Opposition: అయోధ్యలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ వేళ.. విపక్ష నేతలు ఇలా..

Ayodhya ram mandir: అయోధ్య రామమందిరంలో రామ్‌లల్లా కొలువుతీరాడు. అంగరంగవైభవంగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సమయంలో విపక్ష నేతలు ఏం చేశారంటే..?

Published : 22 Jan 2024 18:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అయోధ్య రామమందిర(Ayodhya ram mandir) ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంతో సోమవారం దేశ ప్రజలంతా భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించారు. ఆలయాల్లో పూజలు చేశారు. ఈ ప్రారంభోత్సవానికి కొందరు విపక్ష నేతలకు ఆహ్వానం అందినా వారు హాజరుకాలేదు. ఇదొక రాజకీయ ప్రాజెక్టు అంటూ ఈ వేడుకకు దూరంగా ఉన్నారు. అయితే అదే సమయంలో తమ రాష్ట్రాల్లో నిర్వహించిన ర్యాలీల్లో పాల్గొన్నారు.

  • రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రస్తుతం అస్సాంలో భారత్‌ జోడో న్యాయ యాత్రలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా  బతద్రవ సత్ర ఆలయానికి వెళ్లాలనుకున్న ఆయన్ను అధికారులు అడ్డుకున్నారు. తనను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారని ఆరోపించిన ఆయన.. గుడిలోకి ఎవరు వెళ్లాలనేది ప్రధాని మోదీ నిర్ణయిస్తున్నారని విమర్శించారు. 
  • ఇక ఈ రోజు పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ..  కోల్‌కతాతో పాటు రాష్ట్రమంతా మతసామరస్య ర్యాలీని ప్రారంభించారు. అన్ని మతాల వారు ఈ ర్యాలీలో పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో ఈ ప్రాణప్రతిష్ఠ వేడుక.. భాజపా ఎన్నికల జిమ్మిక్కు అని విమర్శించారు. 
  • ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌.. దిల్లీ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మూడు రోజుల రామ్‌లీల కార్యక్రమంలో పాల్గొన్నారు. శనివారం ఈ కార్యక్రమం మొదలైంది. ఆదివారం కేజ్రీవాల్‌ దీనిలో పాల్గొన్నారు. ప్రాణప్రతిష్ఠకు తనకు అధికారికంగా ఆహ్వానం అందలేదని, కొద్దిరోజుల తర్వాత తాను కుటుంబంతో కలిసి ఆలయాన్ని దర్శించుకుంటానని తెలిపారు. 
  • మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తాను నాసిక్‌లోని కాలారాం ఆలయంలో పూజలు చేస్తానని చెప్పారు. ఆయనకు చివరి నిమిషంలో స్పీడ్‌ పోస్టు ద్వారా రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందింది. ఇదిలా ఉండగా.. తాము కొద్దిరోజుల తర్వాత రాములవారి దర్శనం చేసుకుంటామని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, ఎస్పీ చీఫ్ అఖిలేశ్‌ యాదవ్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని