Nisha Bangre: రాజీనామా ఆమోదించాలంటూ పాదయాత్ర.. మహిళా డిప్యూటీ కలెక్టర్‌ అరెస్టు!

తన రాజీనామాను ఆమోదించాలంటూ పాదయాత్ర చేపట్టిన ఓ మహిళా డిప్యూటీ కలెక్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్‌లో ఇది చోటుచేసుకుంది.

Published : 10 Oct 2023 21:46 IST

భోపాల్: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నానని.. తన రాజీనామాను ఆమోదించి, న్యాయం చేయాలని కోరుతూ మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లో ఓ మహిళా డిప్యూటీ కలెక్టర్‌ పాదయాత్ర చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ర్యాలీగా భోపాల్‌ (Bhopal)లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లేందుకు యత్నించగా.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారనే ఆరోపణలపై మార్గమధ్యంలోనే ఆ మహిళా అధికారి (Deputy Collector)ని పోలీసులు అరెస్టు చేశారు.

ఛతర్‌పుర్‌ జిల్లా డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్న నిశా బాంగ్రే (Nisha Bangre).. ఈ ఏడాది జూన్‌లో తన రాజీనామాను సమర్పించారు. కానీ, ఇంతవరకూ ప్రభుత్వం అంగీకరించలేదని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే తనకు న్యాయం చేయాలని కోరుతూ.. సెప్టెంబర్ 28న ఇక్కడి బేతుల్ జిల్లా నుంచి పాదయాత్ర మొదలుపెట్టారు. సోమవారం సాయంత్రానికి రాజధాని భోపాల్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నివాసం వైపు వెళ్లేందుకు యత్నించగా ఆమెను అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం వెల్లడించారు. బాంగ్రేను స్థానిక కోర్టులో హాజరుపరిచామని, అయితే, బెయిల్‌ తీసుకునేందుకు నిరాకరించడంతో.. భోపాల్‌ కేంద్ర కారాగారానికి తరలించినట్లు చెప్పారు.

పెళ్లి గురించి అందుకే ఆలోచించలేదు..! రాహుల్‌ గాంధీ

‘ఎస్సీ’ సామాజిక వర్గానికి చెందిన బాంగ్రే.. బేతుల్ జిల్లాలోని తన స్వగ్రామంలో మతపరమైన కార్యక్రమంలో పాల్గొనేందుకు సెలవు మంజూరు చేయకపోవడంతో సర్వీసుకు రాజీనామా చేసినట్లు ఆమె భర్త ఓ వార్తాసంస్థకు తెలిపారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో.. బేతుల్ జిల్లాలోని ఆమ్లా నుంచి పోటీ చేయాలనుకుంటున్నారని, అయితే జూన్‌ నుంచి ఆమె రాజీనామాను ప్రభుత్వం ఆమోదించడం లేదన్నారు. దీంతో చేసేదేమీ లేక శాంతియుత యాత్రను చేపట్టగా పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. 230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న ఎన్నికలు జరగనుండగా, డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని