15Years for Arundhati: ‘అరుంధతి’ మూవీకి సోనూసూద్‌ పారితోషికం తెలిస్తే షాకే!

Arundhati Movie: అరుంధతి చిత్రంలో పశుపతిగా నటించిన సోనూసూద్‌ తొలుత ఆ పాత్ర చేయనని చెప్పారు. 20 రోజుల్లో షూటింగ్‌ పూర్తవుతుందని అనుకున్నారు. కానీ, అందుకు పూర్తి భిన్నంగా జరిగింది.

Updated : 16 Jan 2024 15:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అనుష్క (Anushka), సోనూసూద్‌ (Sonu sood) కీలక పాత్రల్లో కోడి రామకృష్ణ తెరకెక్కించిన హారర్‌ ఫాంటసీ మూవీ ‘అరుంధతి’ (Arundhati). మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శ్యామ్‌ ప్రసాద్‌ నిర్మించారు. 2009 జనవరి 16న  వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మంగళవారంతో ఈ సినిమా విడుదలై 15 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. చక్కని అభిరుచితో చిత్రాలు నిర్మించే శ్యామ్ ప్రసాద్‌రెడ్డి కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమా ఇది. రొటీన్ సినిమాలకు భిన్నంగా రూపుదిద్దుకొన్న ఈ చిత్రం అనుష్క కెరీర్‌ను కూడా మలుపు తిప్పింది. ‘అరుంధతి’ పాత్ర కోసం అనుష్క కంటే ముందు చాలా మంది పేర్లు అనుకున్నారు. కథపరంగా యువరాణి పాత్రలో కనిపించే నటి రాయల్ లుక్ కలిగి ఉండాలని నియమం పెట్టుకోవడం ఎక్కడా రాజీపడకుండా నిర్మాత శ్యామ్ ప్రసాద్‌రెడ్డి వరుస ఆడిషన్స్‌ చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో నిర్మాత జెమినీ కిరణ్ సూచన మేరకు నాగార్జున ‘సూపర్’లో నటించిన అనుష్కను చూసి ఓకే అనుకున్నారు.  వెంటనే ఆమెకు ఆ విషయం చెప్పకుండా రకరకాల ఆడిషన్స్, లుక్‌ టెస్ట్‌ చేసి చివరకు ఫైనలైజ్‌ చేశారు.

తొలుత తమిళ నటుడు అనుకుంటే...

‘అరుంధతి’ చిత్రంలో మరో కీలక పాత్రను సోనూసూద్ (Sonu sood) పోషించారు. సినిమాను చూసిన తర్వాత పశుపతిగా ఆయనను తప్ప మరొకరని ఊహించుకోలేం.  ఈ పాత్రకు మొదట తమిళ నటుడు పశుపతిని అనుకున్నారు. ఆ పేరు పెట్టడానికి కూడా కారణం అదే. అఘోర పాత్రకు పశుపతి చక్కగా సూట్ అవుతారని చిత్రం బృందం భావించింది.  సినిమాలో కొన్ని సీన్లలో పశుపతి పాత్ర రాయల్‌ లుక్‌లో కనిపించాలి. దీంతో ఆలోచనలో పడ్డారు. ఆ సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అశోక్’ చిత్రం విడుదలైంది. అందులో విలన్‌గా నటించిన సోనూసూద్.. నిర్మాత శ్యామ్ ప్రసాద్‌రెడ్డి దృష్టిని ఆకర్షించారు. అయితే అఘోరా గెటప్ స్కెచ్‌ చూపించగానే ఆ పాత్రను చెయ్యనని సోనూసూద్ చెప్పారు. ఒకసారి గెటప్ వేసుకోమని, మేకప్ టెస్ట్ చేసిన తర్వాత కూడా నచ్చకపోతే.. మరొక నటుడిని తీసుకుంటానని నచ్చజెప్పారు. అందుకు సోను అయిష్టంగానే అంగీకరించారు.

కమల్ హాసన్ నటించిన ‘దశావతారం’ చిత్రానికి వర్క్ చేసిన రమేశ్‌ను చెన్నై నుంచి పిలిపించి ఆయనతో సోనూసూద్‌కు అఘోరా గెటప్  వేయించారు. మేకప్ కోసమే ఆయనకు ఆరు గంటలు పట్టింది. ఆ పాత్ర చేయడం తనకు ఇష్టం లేకపోయినా శ్యామ్ ప్రసాద్‌రెడ్డి తపన చూసి చివరకు సోనూసూద్‌ అంగీకరించారు. పశుపతి పాత్రకు సంబంధించి 20 రోజుల్లో ఆయన వర్క్ పూర్తి చేస్తామని శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డి చెప్పగానే, రూ.18 లక్షలు పారితోషికంగా ఇవ్వమని సోనూసూద్‌ డిమాండ్ చేశారు. ఆయన మరో ఆప్షన్ కూడా ఇచ్చారు. రూ.20 లక్షలు ఇస్తే ఎన్ని రోజులైనా పని చేస్తానని చెప్పారు. కానీ, శ్యామ్ ప్రసాద్‌రెడ్డి ఒప్పుకోలేదు. 20 రోజుల్లోనే అతని వర్క్ పూర్తి చేస్తాననీ, రూ.18 లక్షలే ఇస్తానని చెప్పారు. ఒక వేళ 20 రోజుల్లో వర్క్ పూర్తి కాకపోతే, ఆ తర్వాత ఎన్ని రోజులు ఎక్కువ వర్క్ చేస్తే రోజుకి రూ. 25 వేలు ఇస్తానని శ్యామ్ ప్రసాద్‌రెడ్డి చెప్పారు.  అనుకున్నట్లుగా 20 రోజుల్లో సోనూసూద్ వర్క్ పూర్తి కాలేదు. చివరకు ‘అరుంధతి’ చిత్రం ద్వారా సోనూ సూద్‌ లభించిన పారితోషికం ఎంతో తెలుసా? అక్షరాలా రూ.45 లక్షలు.

‘అరుంధతి’ 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అనుష్క (15Years for Arundhati) ట్వీట్‌ చేశారు. ‘జేజమ్మ పాత్రతో నేను ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం దక్కించుకున్నా. కోడి రామకృష్ణగారు, శ్యామ్‌ ప్రసాద్‌రెడ్డిగారికి నా కృతజ్ఞతలు. భారతీయ సినిమాలో ఇదొక ఎపిక్‌. మీ ప్రేమకు, సహకారానికి ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని