ఆ దర్శకుడు చేసిన పనితో షాకయ్యా!

సినిమాల్లో హీరోలు కొట్టే పంచ్‌లకు ఎంత క్రేజ్‌ ఉంటుందో స్కిట్‌లలో తను పేల్చే పంచ్‌లకు అంతే క్రేజ్‌ ఉంటుంది. సిల్వర్‌ స్క్రీన్‌, టెలివిజన్‌ స్క్రీన్‌ ఏదైనా సరే, తన

Updated : 28 Oct 2020 11:27 IST

సినిమాల్లో హీరోలు కొట్టే పంచ్‌లకు ఎంత క్రేజ్‌ ఉంటుందో స్కిట్‌లలో తను పేల్చే పంచ్‌లకు కూడా అంతే క్రేజ్‌ ఉంటుంది. సిల్వర్‌ స్క్రీన్‌, టెలివిజన్‌ స్క్రీన్‌ ఏదైనా సరే, తన మార్కు కామెడీ ట్రాక్‌పై ఎక్స్‌ప్రెస్‌లా దూసుకుపోతూ, ఆడియన్స్‌కు నాన్‌స్టాప్‌ కితకితలు పెడుతున్న ట్రాక్‌ రికార్డు తనది. అతనే హైపర్‌ ఆది.

బాణాల్లాంటి చూపులు.. బ్రహ్మనే ఆశ్చర్యపరిచే ఒంపు సొంపులు.. మెరుపు తీగలాంటి రూపం.. ఓర చూపులతో కట్టిపడేసేంత అందం ఆమె సొంతం. కుర్రాళ్ల మనసు దోచుకున్న ఆ నటి, వ్యాఖ్యాత వర్షిణి. వీరిద్దరూ కలిసి ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి విచ్చేసి తాము ఎలా కెరీర్‌ను మొదలు పెట్టింది? ఆ సమయంలో ఎదురైన ఇబ్బందులు, ఇంకా తమ మధ్య జరిగిన సరదా సంఘటనలను కలిసి పంచుకున్నారిలా..!

మీ చేతి మీద ఉన్న టాటూ అర్థం ఏంటి?

వర్షిణి: మనం ఏదైతే ఈ విశ్వాన్ని అడుగుతామో, అది తిరిగి ఇస్తుంది.

మీ సొంతూరు ఏది?

వర్షిణి: నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. కానీ, నేను తమిళియన్‌ను.

కోట ఆదయ్య ‘హైపర్‌ ఆది’ ఎలా అయ్యాడు?

హైపర్‌ ఆది: కోట ఆదయ్య మా తాత పేరు. అదే నాకు పెట్టారు. స్కూల్‌, కాలేజ్‌లో ఆ పేరుతో బాగా ఆటపట్టించేవారు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆదిగా పేరు మారింది. ‘హైపర్‌’ అనే టైటిల్‌ ‘జబర్దస్త్‌’ చేసేటప్పుడు మా దర్శకులు పెట్టారు. నేను చేసే స్కిట్లలో ఫ్రస్ట్రేషన్‌ ఎక్కువగా ఉండేది దాంతో ‘హైపర్‌’ అని పెట్టారు.

మీరెలా ఇండస్ట్రీకి వచ్చారు?

వర్షిణి: పాకెట్‌ మనీ కోసం మోడలింగ్‌ చేయడం మొదలు పెట్టా. అదే కెరీర్‌ అయిపోయింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. సినిమాలంటే నాకు ఇష్టం లేదు. మోడలింగ్‌.. జాబ్‌.. ఆ తర్వాత పెళ్లి ఇదే నా జీవితమనుకున్నా. కానీ, సినిమాల్లో అనుకోకుండా అవకాశం వచ్చింది. ‘చందమామ కథలు’ నా మొదటి చిత్రం. ఒక మేనేజర్‌ నన్ను పిలిచి ‘కొత్త వాళ్ల కోసం చూస్తున్నారు. మీరు ప్రయత్నించండి. అది ఒక యాడ్‌ షూట్‌’ అని చెప్పి నన్ను తీసుకెళ్లారు. ప్రవీణ్‌ సత్తార్‌ కథ చెబుతుంటే మొదట నాకు అర్థం కాలేదు. బయటకు వచ్చిన తర్వాత  ‘కేవలం నాలుగు రోజుల షూటింగ్‌. ఈ పాత్రకు మీరు సరిపోతారు. మంచి రెమ్యూనరేషన్‌ కూడా ఇస్తారు’ అని మేనేజర్‌ చెప్పారు. నేను మోడలింగ్‌ చేస్తే వచ్చేదాని కన్నా ఎక్కువ వస్తుండటంతో నేను కూడా సర్లేనని ఒప్పుకొన్నా. అప్పటికీ నాకస్సలు నటన రాదు.

షాలిని అలియాస్‌ వర్షిణి పెళ్లి ఎప్పుడు?

వర్షిణి: ఈ పేరు మీకెలా తెలుసు? పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదండీ. ఇలాగే లైఫ్‌ బాగుంది. అబ్బాయిలు నాకు అర్థం కారు. ఐదేళ్ల కిందట లవ్‌ బ్రేకప్‌ అయింది. అదంతా గతం. మా ఇద్దరికీ కుదరలేదు.

ఆదితో ఎక్కడ పరిచయం?

హైపర్‌ ఆది: నేను ‘ఢీ10’లో స్క్రిప్ట్ రాసేవాడిని. అప్పుడు వర్షిణి టీమ్‌ లీడర్‌. ఆ తర్వాతి సీజన్‌ నుంచి మేమిద్దరం టీమ్‌ లీడర్‌లుగా చేస్తున్నాం.

ఎన్ని సినిమాల్లో హీరోయిన్‌గా చేశారు?

వర్షిణి: నాలుగు సినిమాల్లో నటించా. ఒకటి విడుదల కాలేదు. ఇప్పటివరకూ నా జీవితంలో ‘నాకు ఈ ఆఫర్‌ ఇవ్వండి’ అని నేను ఎవరినీ అడగలేదు. అన్నీ నా దగ్గరకు వచ్చినవే. ఎవరైనా సినిమా చేయమని అడిగితే ‘ఎన్ని రోజులు చేయాలి’ అని అందులో నటించేదాన్ని. బ్రేకప్‌ తర్వాత కొన్నాళ్లు విరామం తీసుకున్నా. అప్పుడే ‘పెళ్లి గోల’ వెబ్‌ సిరీస్‌ చేశా. చాలా బాగా సక్సెస్‌ అయింది. ఆ తర్వాత ‘ఢీ’. ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిలేకుండా పోయింది.

పెళ్లంటే ఎందుకు విరక్తి ఏర్పడింది?

వర్షిణి: నాకు ఎంగేజ్‌మెంట్‌ కూడా అయింది. పెళ్లి వరకూ వచ్చి రద్దయింది. ఇక మా కుటుంబం విషయానికొస్తే మా తల్లిదండ్రులు విడిపోయారు. మా అమ్మ అన్ని చూసుకునేది.

ఒక పెద్ద కమెడియన్‌ మీకు ఫోన్‌ చేసి, నేను ఫలానా అని చెబితే ‘నేను హైపర్‌ ఆది’ అయితే ఏంటి? అన్నారట!

హైపర్‌ ఆది: ఒక రోజు సడెన్‌గా కాల్‌ వచ్చింది. ఫ్రెండ్స్‌ ఆటపట్టిస్తున్నారేమో అనుకున్నా. ‘హలో నేను బ్రహ్మానందం’ అని అవతలి నుంచి మాట్లాడుతున్నారు. ‘నేను హైపర్‌ ఆది’ అయితే ఏంటి? అన్నాను. ‘నేను నిజంగా బ్రహ్మానందం మాట్లాడుతున్నా’ అన్నారు అవతలి వ్యక్తి. కొద్దిసేపటికి నాకు అసలు విషయం అర్థమైంది. ‘సారీ సర్‌.. ఎవరో ఆట పట్టిస్తున్నారనుకున్నా’ అని ఆయనతో మాట్లాడా. ఆ తర్వాత వెళ్లి కలిసి సారీ చెప్పా.

పెళ్లెప్పుడు చేసుకుంటారని అడిగితే, ‘వచ్చే సంవత్సరం’ చేసుకుంటానని చెబుతున్నారు. సరిగ్గా చెప్పండి?

హైపర్‌ ఆది: ఈ ఏడాది చేసుకుందామనుకున్నా. కానీ కుదరలేదు. (మధ్యలో ఆలీ అందుకుని.. ఇప్పుడు చేసుకుంటే రూ.25వేలతో అయిపోతుంది) నాకు గ్రాండ్‌గా చేసుకోవాలని ఉంది. 2021లో తప్పకుండా చేసుకుంటా. ప్రేమ వివాహమా? పెద్దలు కుదిర్చిన పెళ్లా? అనేది తెలియదు.

వర్షిణి: సెట్‌లో ఉండగా ఎప్పుడూ ఫోన్‌తో బిజిగానే ఉంటాడు. ఎవరితోనో చాట్ చేస్తూనే ఉంటాడు.

హైపర్‌ ఆది:  అదేం లేదు. ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరుగుతున్నాయి కదా! స్కోర్‌ చూసుకుంటూ ఉంటా.(నవ్వులు)

చిన్నప్పుడు స్కూల్‌కు వెళ్తుంటే, మీ అన్న రాడ్‌ పట్టుకుని నీ వెనక వచ్చేవాడట!

వర్షిణి: చిన్నప్పుడు నన్ను, మా అక్కను అన్నయ్య చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. మా ఇంటి నుంచి మేమిద్దరం నడుచుకుంటూ వెళ్తుంటే ఎవరైనా చూస్తే ఊరుకునేవాడు కాదు. మేము థియేటర్‌కు వెళ్తే మా పక్కన ఎవరూ కూర్చోకూడదని ఆ పక్క సీట్‌ కూడా బుక్‌ చేసేవాడు. మేమంటే అంత జాగ్రత్త ఉండేది. అన్నయ్య ప్రవర్తన చూసి వాడు మారతాడని హాస్టల్లో వేశారు. అయినా మారలేదు. ప్రస్తుతం తను యూఎస్‌లో ఉంటున్నాడు.

ఆస్ట్రేలియాలో మీ ఇద్దరి (ఆది-వర్షిణి) మధ్యా ఏం జరిగింది?

హైపర్‌ ఆది: మేము ఆస్ట్రేలియా వెళ్లాం. మొదటి నుంచి మాకు పరిచయం లేదు. మమ్మల్ని ఆస్ట్రేలియా తీసుకెళ్లిన వాళ్లందరితో కలిసి కూర్చొన్నాం. తను ఏదో సెటైరికల్‌గా మాట్లాడుతోంది. నేను మాట్లాడదామని లేచి ఏదో చెప్పబోతుంటే.. అందరి మధ్యలో ‘నువ్వు ఆపు’ అన్నది. నాకు విపరీతమైన కోపం వచ్చింది. చేతిలో ఉన్న కోక్‌ బాటిల్‌ను నేలకేసి కొట్టి వర్షిణిపై అరిచేశాను. అందరూ షాకయ్యారు. ఆ తర్వాత కూడా ఈ చర్చ అలాగే కొనసాగింది. తను కూడా సెటైరికల్‌గా మాట్లాడేది. ‘ఢీ’ సెట్‌లో కలిసి ట్రావెల్‌ అయిన తర్వాత తెలిసింది.. నేనే తప్పు చేశానని. సారీ చెప్పాను.

వర్షిణి: సుధీర్‌, గెటప్‌ శ్రీను, రాం ప్రసాద్‌ మేమంతా కలిసి చాలా బాగా మాట్లాడుకుంటాం. తిట్టుకుంటాం. ఆ సమయంలో ఆది మా గ్రూప్‌లో కొత్తగా జాయిన్‌ అయ్యాడు. వాళ్లతో ఎలా మాట్లాడతానో.. ఆదితో కూడా అలాగే మాట్లాడా. ఇద్దరి మధ్యా మాటమాటా పెరిగింది. తను కోపంతో కోక్‌ బాటిల్‌ విసిరేశాడు. దాంతో నేను కూడా ఆదిపై అరుస్తూ, ఏడ్చేశా. ఎందుకంటే అప్పటివరకూ నన్ను ఎవరూ అలా తిట్టలేదు. ఆ తర్వాత సుధీర్‌ వచ్చి, మా మధ్య గొడవను పరిష్కరించాడు. ఏదైనా గొడవ జరిగితే దాన్ని నేను ఆరోజే మర్చిపోతా.

బుల్లితెరపై మీ పంచ్‌లు బాగా ఆకట్టుకుంటాయి. మరి వెండితెరపై ఆ స్థాయి పేరు ఎందుకు రాలేదు?

హైపర్‌ ఆది: బుల్లితెరపై స్క్రిప్ట్‌లో ఎక్కువగా నేనే మాట్లాడుతుంటా. పంచ్‌లు వేసేది కూడా నేనే. సినిమా నిడివి ఎక్కువ కాబట్టి, రెండు మూడు సీన్లు ఉంటాయంతే. ‘తొలిప్రేమ’, ‘మేడ మీద అబ్బాయి’ చిత్రాల్లో ఫుల్‌ లెంగ్త్‌ క్యారెక్టర్లు చేశా. డైరెక్టర్‌ పాయింట్ ఆఫ్‌ వ్యూలో మన క్యారెక్టర్లు వర్కవుట్‌ అవుతాయి.

ఇండస్ట్రీకి ఎందుకు రావాలనిపించింది?

హైపర్‌ ఆది: కాలేజ్‌లో ఉండగా, మిమిక్రీ చేసేవాడిని, పాటలు పాడేవాడిని. ఇండస్ట్రీలోకి రావాలని ఉండేది. ఒకవైపు సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేస్తూ, శని, ఆదివారాల్లో షూటింగ్‌లు జరిగే చోటుకు వెళ్లేవాడిని. ‘జబర్దస్త్‌’ కంటే ముందు జ్ఞాపిక ప్రొడక్షన్స్‌లో రచయితగా చేశాను. ఒక సీరియల్‌కు స్క్రిప్ట్‌ రాశాను. ‘తడఖా’ మిమిక్రీ షోకు కూడా రాశాను. ఆ తర్వాత ‘జబర్దస్త్‌’ అభి అన్న పరిచయమవడం, మంచి వేషాలు వేయడంతో జాబ్‌ వదిలేశా.

మీ కుటుంబం గురించి?

హైపర్‌ ఆది: నాన్న వ్యవసాయం చేస్తారు. అమ్మ గృహిణి. నాకు ఇద్దరు బ్రదర్స్‌. మాది మధ్యతరగతి కుటుంబం. మేము పైచదువులకు వచ్చే సమయానికి అప్పుల వల్ల ఉన్న మూడెకరాల పొలం అమ్మేయాల్సి వచ్చింది. కొన్ని సందర్భాల్లో రూ.100 కావాలన్నా పక్కింటి వాళ్లను అప్పు అడిగే పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలోనే నేను జాబ్‌ వదిలేసి ‘జబర్దస్త్‌’ ట్రయల్స్‌ మొదలు పెట్టాను. మొదట్లో చిన్న చిన్న వేషాలు వేస్తుంటే, అందరూ ఎగతాళి చేసేవారు. మళ్లీ ఆలోచనలో పడ్డా. ఏదైతే అది అయిందని, ‘జబర్దస్త్‌’లోనే  కొనసాగా. అభి అన్నవల్ల నాకు మంచి గుర్తింపు వచ్చింది. 12 స్కిట్‌ల తర్వాత నేను టీమ్‌ లీడర్‌ అయ్యాను. నన్ను ఎగతాళి చేసిన వారిపై పంతంతో విజయం సాధించా. ఏ ఊళ్లో అయితే, మూడెకరాలు అమ్ముకున్నామో అదే ఊరిలో 10 ఎకరాల పొలం కొన్నా.

వర్షిణి: మాది కూడా మధ్యతరగతి కుటుంబం. అమ్మ మమ్మల్ని బాగా చదివించారు. అయితే, ఉండటానికి, తినడానికి ఇబ్బంది ఏమీ లేదు.  ఇప్పుడిప్పుడే సెటిల్‌ అవుతున్నా.

ఈ కింది వారికి సినిమా టైటిల్స్‌ పెట్టమంటే?

ప్రదీప్‌ మాచిరాజు సరిలేరు నీకెవ్వరు
సుమ జేజమ్మ
రోజా: రోజా
మనో బాషా
సుధీర్‌ ఒక్క మగాడు
గెటప్‌ శ్రీను దశావతారం
రష్మి బుట్టబొమ్మ
అనసూయ నువ్వే కావాలి
శేఖర్‌ మాస్టర్‌ మిస్టర్‌ పర్‌పెక్ట్‌
అదిరే అభి మేమిద్దరం ‘గురు-శిష్యులు’

బైక్‌ను సింగిల్‌ టైర్‌పై నిలబెట్టి నడుపుతారట!

హైపర్‌ ఆది: (నవ్వులు)నాకు బైక్‌, కారు నడపటం రాదు. సైకిల్‌ అయితే మేనేజ్‌ చేస్తా.

మీ కెరీర్‌లో బాధపడిన సందర్భం?
వర్షిణి: నా కెరీర్‌లో నేనెప్పుడూ అవకాశాల కోసం ఎవరి దగ్గరకూ వెళ్లలేదు. కనీసం ఫొటోలు కూడా పంపలేదు. ఇది ఏడెనిమిది నెలల ముందు జరిగింది. ఒకసారి వెబ్‌ సిరీస్‌కోసం ఆఫర్‌ వచ్చింది. ఆ దర్శకుడిని కలవడానికి ఆఫీస్‌కు వెళ్లా. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత అతడు నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నా చేయి పట్టుకుని లాగాడు. ఒక్కసారి షాకయ్యా.. అక్కడి నుంచి లేచి వచ్చేశా. చాలా భయం వేసింది. కారులో ఏడ్చుకుంటూ వెళ్లిపోయాను. ఇప్పటివరకూ ఎవరూ కూడా అలా నాతో ప్రవర్తించలేదు. ఎవరో ఒకరు అలా ఉంటారు. నా జీవితంలో నేను ఎదుర్కొన్న మొదటి చేదు సంఘటన అది.

హైపర్‌ ఆది: వచ్చిన కొత్తలో ఒక వ్యక్తి ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం అయ్యాడు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్లతో కలిసి ఫొటోలు దిగి షేర్‌ చేస్తూ ఉండేవాడు. బహుశా ఇతను కూడా ఇండస్ట్రీకి చెందిన వాడేమోననుకున్నా. దాంతో పరిచయం పెంచుకున్నా. ‘నిన్ను ఆలీ దగ్గర లేకపోతే, సునీల్‌ దగ్గర పెడతా’ అని చెప్పేవాడు. అప్పుడప్పుడు ఫోన్‌ రీఛార్జ్‌ చేయమనేవాడు. నేను కూడా చేసేవాడిని. ఒక రోజు కలుద్దామని చెప్పాడు. వెళ్లి కలిశా. ఏవేవో కబుర్లు చెప్పాడు. పోనిలే మనల్ని ఎవరో ఒకరి దగ్గర పెడతాడని రూ.5వేలు అడిగితే ఇచ్చా. మళ్లీ నాతో మాట్లాడలేదు. ఆ తర్వాత ఓ సినిమా ఆఫీస్‌కు నా ప్రొఫైల్‌ పంపిస్తే, ఛాన్సు ఇస్తానని చెప్పి రూ.10వేలు తీసుకున్నారు. మరుసటి రోజు ఆ ఆఫీస్‌కు తాళం వేసి వెళ్లిపోయారు. డబ్బులకు పని అవదని, కేవలం టాలెంట్‌ ఉంటేనే అవకాశాలు వస్తాయని అప్పుడు తెలియదు. అలా నేను రెండుసార్లు మోసపోయా.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని