Ramanaidu: రామానాయుడి ఔదార్యం!

సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసి, మూవీ మొఘల్‌ అనిపించుకున్నారు దివంగత నిర్మాత డి.రామానాయుడు.

Updated : 24 Apr 2024 12:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ఎన్నో విజయవంతమైన చిత్రాలు తీసి, మూవీ మొఘల్‌ అనిపించుకున్నారు దివంగత నిర్మాత డి.రామానాయుడు. కథల ఎంపికలో, సినిమా నిర్మాణంలో ఎంత కచ్చితంగా ఉండేవారో.. నటులను, ఇతర సాంకేతిక బృందాన్ని అంతే గౌరవించేవారు. వారికి ముట్ట చెప్పాల్సిన మొత్తాన్ని అణాపైసలతో సహా ఇచ్చేవారు. సినిమా విజయవంతమైతే అదనపు బహుమతులూ ఇచ్చిన సందర్భాలు కోకొల్లలు. నటీనటులకు డబ్బు ఇచ్చేటప్పుడు ఎంత ఔదార్యంతో ఉండేవారో దివంగత నటుడు రావి కొండలరావు ఓ సందర్భంలో పంచుకున్నారు.

‘‘రామానాయుడుగారు ‘అగ్నిపూలు’ (1981) సినిమా తీశారు. యద్దనపూడి సులోచనారాణి నవల. ఆ సినిమా అనుకుంటున్నప్పుడు నేను ఎందుకో నాయుడుగారిని కలవడానికి వెళ్తే, ‘అగ్నిపూలు’ నవల ఇచ్చారు. (అలా కొంతమంది రచయితలకి ఇచ్చారట) ‘ఇది చదువు. కథలో కల్పించడానికి బాగుంటుందనుకుంటే ఏదైనా పాయింటు చెప్పు. నీ పాయింటు నాకు నచ్చితే నీకు రెండువేలు ఇస్తాను’ అన్నారు. నేను దానిని చదివి ఆ నవల మొత్తం డైరీ రూపంలో ఉంది. ఏదో నాకు తోచిన చిన్న పాయింట్‌ని చెప్పాను. ‘బాగుంది. దర్శకుడు, రచయితలతో కూడా చెప్తాను. అనుకున్నట్టుగానే, నీకు రెండు వేలు ఇస్తాను తీసుకో’ అని చెక్కు బుక్కు తియ్యబోయారు. అంతకుముందు నాయుడు గారి ‘జీవిత కథను’ పుస్తకంగా రాయమని నాకు చెప్పి, మూడు వేలు అడ్వాన్సు ఇచ్చారు. అది జరగలేదు. ఎందుకంటే కొన్ని గంటలపాటు ఆయనతో కూర్చుని, ఇంటర్వ్యూ చెయ్యాలి. అదంతా రికార్డ్‌ చేసుకోవాలి. ఆయన ఎప్పటికప్పుడు ‘ఇదిగో అదిగో’ అంటూ బాగా బిజీగా ఉన్నారు. వారానికి ఒకసారి బొంబాయి వెళ్తున్నారు. ‘రోజుకి రెండు గంటలు కేటాయించండి’ అని అడిగినా కూడా కుదరలేదు. సరే అని, వదిలేశాను’’

‘‘ఆ మూడు వేలూ నా దగ్గర ఉన్నాయి. అందులో మినహాయించుకుందాం’ అన్నాను. ‘అలా ఎందుకులే, అది అలా ఉండనీ చూద్దాం! ఇప్పుడిది తీసుకో’ అని ఇచ్చేశారు. తర్వాత ఒక సినిమాలో వేషం ఇచ్చారు. ‘మీరిచ్చిన మూడు వేలూ అలాగే ఉన్నాయి. ఈ సినిమా పారితోషికంలో కొంత ఇచ్చేసినట్టే’ అని అన్నాను. అప్పుడూ ఆ పాత మాటే అన్నారు. ‘అది అలా ఉండనీ చూద్దాం’ అని. నాకు తెలిసి, పారితోషికం గురించి ఎవరూ రామానాయుడిగారితో మాట్లాడరు. ఆయన ఎంత ఇస్తే అది తీసుకోడమే! అయితే ఆ పారితోషికం చూసినవాళ్లు ‘అరె! బాగా తక్కువ ఇచ్చారే’ అనుకున్నవాళ్లూ ఎవరూ లేరు. తృప్తిగానే ఉంటుంది. హైదరాబాద్‌ వచ్చాక, ‘మధుమాసం’ సినిమాలో నాయుడుగారు నాకు వేషం ఇచ్చారు. వేషం అయిపోయి, డబ్బింగ్‌ చెప్పేసిన తర్వాత చెక్కు పంపించారు. తృప్తిగానే ఉంది! నిర్మాతగా నాయుడుగారి వ్యవహారాలు అలా ఉంటాయి.’’ అని రామానాయుడితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు రావికొండలరావు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు