Anjali: పెళ్లి చేసుకుంటానన్నా ఇంట్లోవాళ్లు నమ్మేలా లేరు!

ఇటీవలే ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమాతో 50చిత్రాల మైలురాయిని దాటింది అంజలి. ఇప్పుడు విష్వక్‌ సేన్‌తో కలిసి ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’తో అలరించేందుకు సిద్ధమవుతోంది.

Published : 27 May 2024 01:09 IST

ఇటీవలే ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమాతో 50చిత్రాల మైలురాయిని దాటింది అంజలి. ఇప్పుడు విష్వక్‌ సేన్‌తో కలిసి ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’తో అలరించేందుకు సిద్ధమవుతోంది. వీళ్లిద్దరూ కలిసి నటించిన ఈ సినిమాని కృష్ణచైతన్య తెరకెక్కించారు. ఈ చిత్రం ఈ నెల 31న రానుంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం హైదరాబాద్‌లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకుంది అంజలి. 

ట్రైలర్‌లో మీరు కనిపించిన తీరు.. పలికిన సంభాషణలు చూస్తుంటే ఈ సినిమాలో చాలా మాస్‌ పాత్ర చేశారనిపిస్తోంది?  

‘‘ఈ తరహా పాత్ర చేయడం నాకు కూడా కొత్తగానే అనిపించింది. నేనిలాంటి పాత్రలో కనిపించడం.. ఈ తరహా బోల్డ్‌ సంభాషణలు నా నోటి నుంచి రావడం ఇదే తొలిసారి. మొదటిసారి ఆ డైలాగ్‌లు విన్నప్పుడు నిజంగా వీటిని సినిమాలో ఉంచుతారా అనుకున్నా. ఇలాంటి పాత్రలు నిజ జీవితంలో ఎక్కడో ఒక దగ్గర మనకు తారసపడుతూనే ఉంటాయి’’. 

ఈ సినిమా చేయడానికి దీంట్లో మిమ్మల్ని ఆకర్షించిన అంశాలేంటి? 

 ‘‘నాకెప్పుడూ ఒకే తరహా పాత్రలు పోషించడం నచ్చదు. వైవిధ్యభరితమైన పాత్రలతో ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరచాలనుకుంటా. ఈ సినిమాలోని నా రత్నమాల పాత్రలో ఆ వైవిధ్యత కనిపించింది. ఆ పాత్రను మలచిన తీరు చాలా బాగుంటుంది. కృష్ణచైతన్య నాకు తొలిసారి కథ వినిపించినప్పుడు ఇలాంటి పాత్రకు నన్ను ఎంపిక చేయడానికి కారణమేంటని అడిగా. ఎందుకంటే నన్ను ఎక్కువగా అందరూ పక్కింటి అమ్మాయి తరహా పాత్రల్లో చూడాలనుకుంటారు. కానీ, ఈ పాత్ర దానికి పూర్తి భిన్నంగా.. చాలా మాస్‌గా ఉంటుంది. చైతన్య మాత్రం ఈ పాత్రకు నేనైతేనే న్యాయం చేయగలనని నమ్మి నా దగ్గరకొచ్చినట్లు చెప్పారు. తను నిజంగా ఏ నమ్మకంతో చెప్పారో తెలియదు కానీ.. ఇంత మంచి పాత్ర పోషించినందుకు సంతోషంగా ఉంది’’. 

ఈ చిత్రంలో విష్వక్‌ పాత్రతో మీ ప్రయాణం ఎలా ఉండనుంది? ఈ చిత్ర విషయంలో సవాల్‌గా అనిపించిన అంశాలేంటి?

‘‘ఇందులో మా ఇద్దరి పాత్రల బంధం చాలా స్వీట్‌గా ఉంటుంది. మా పాత్రల పేర్లు కూడా ఒకేలా ఉంటాయి. నేను రత్నమాలైతే.. తను రత్నాకర్‌. ఇద్దర్నీ రత్న అనే పిలుస్తారు. అంతేకాదు సినిమాలో మా పాత్రలు రెండూ పోటాపోటీగానే అనిపిస్తాయి. ‘‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంలో చూసిన సీత స్వీట్‌గా కాకుండా మాస్‌గా కొంచెం రఫ్‌గా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది దీంట్లో నా పాత్ర’’. 

మీ పెళ్లి విషయమై తరచూ వార్తలు వినిపిస్తుంటాయి. దానిపై మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి?

‘‘సోషల్‌ మీడియా నాకు ఇప్పటికే మూడు, నాలుగు పెళ్లిళ్లు చేసేసింది (నవ్వుతూ). మొదట్లో ఇలాంటి గాసిప్స్‌ వచ్చినప్పుడు ఇంట్లో వాళ్లు కంగారు పడేవాళ్లు. కానీ, ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు. నా పెళ్లిపై ఇప్పటి వరకు వచ్చిన గాసిప్స్‌ వల్ల నేను ఒక అబ్బాయిని తీసుకెళ్లి ‘ఇతన్నే పెళ్లి చేసుకుంటాన’ని చెప్పినా ఇంట్లో వాళ్లు నమ్మేలా లేరు. నేను కచ్చితంగా పెళ్లి చేసుకుంటా. దానికి ఇంకా చాలా సమయం ఉంది. ప్రస్తుతం నేను సినిమాలతో బిజీగా ఉన్నా. తప్పకుండా నేను పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తా’’. 

ఈ మధ్య కథానాయిక పాత్రలు కాకుండా ఎక్కువగా కీలక పాత్రలు పోషించడానికి కారణమేంటి? 

‘‘అలా ఏమీ లేదు. ‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’లో నాది కీలక పాత్ర కాదు. కథానాయికలలో ఒక పాత్ర. ‘గేమ్‌ ఛేంజర్‌’లోనూ నా పాత్ర అలాగే ఉంటుంది. కియారాతో పాటు నేనూ మరో నాయికగానే కనిపిస్తా. రామ్‌చరణ్‌కు ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌లో నేను జోడీగా కనిపిస్తా. దాంట్లో మా ఇద్దరికీ మంచి పాట కూడా ఉంది. నా తదుపరి సినిమాల్లోనూ నేను ప్రధాన పాత్ర చేస్తున్నవే ఉన్నాయి’’.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు