Allari Naresh: ఆ ఒక్క కారణంతో ‘కార్తికేయ’ చిత్రాన్ని వదులుకున్న నరేశ్‌

సూపర్‌ హిట్‌ చిత్రం ‘కార్తికేయ’లో నటించే అవకాశాన్ని ఎందుకు వదులుకోవాల్సి వచ్చిందో ఓ సందర్భంలో అల్లరి నరేశ్ తెలిపారు. ఆ వివరాలివీ..

Published : 13 May 2023 11:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మిస్టరీ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ‘కార్తికేయ’ (Karthikeya) చిత్రం టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌ సెట్‌ చేసింది. హీరో నిఖిల్‌ (Nikhil Siddhartha) కెరీర్‌లో బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. సుమారు రూ.6 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా దాదాపు రూ.20 కోట్లు వసూళ్లు సాధించింది. మరి, ఈ సినిమాలో అల్లరి నరేశ్‌ (Allari Naresh) నటిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి! ఎందుకంటారా..? ముందుగా ఈ కథను దర్శకుడు చందూ మొండేటి.. నరేశ్‌కే వినిపించారు. స్టోరీ తనకు బాగా నచ్చినా ఒక్క కారణంతో ఆయన ఈ చిత్రంలో నటించేందుకు అంగీకరించలేదు. అదేంటంటే.. సుబ్రహ్మణ్యపురం అనే గ్రామంలో సుబ్రహ్మణ్యస్వామి దేవాలయ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో పాములు ఎక్కువగా కనిపించిన సంగతి తెలిసిందే. ఆ సన్నివేశాలే ఈ సినిమాకి కీలకం. వ్యక్తిగతంగా తనకు పాములంటే భయపడడం వల్ల నరేశ్‌ ఆ సినిమాని తిరస్కరించారట. ఓ ఇంటర్వ్యూలో ఆయనే ఈ వివరాలు పంచుకున్నారు. బయటేకాదు సినిమాల్లో కనిపించే పాముల దృశ్యాలను చూసినా ఇప్పటికీ భయపడతానన్నారు. 

2014 అక్టోబరు 14న విడుదలైన ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘కార్తికేయ 2’ రూపొందింది. గతేడాది ఆగస్టు 13న ‘కార్తికేయ’ పార్ట్‌ 2 నిఖిల్‌కి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే.. ‘నాంది’, ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’, ఇటీవల విడుదలైన ‘ఉగ్రం’ (ugram) సినిమాల్లో అల్లరి ట్యాగ్‌ని పక్కనపెట్టి నరేశ్‌ చాలా కొత్తగా కనిపించారు. ప్రస్తుతం అదే తరహా కథలు తన దగ్గరకు ఎక్కువగా వస్తున్నాయని ఆయన పలు సందర్భాల్లో చెప్పారు. ‘కార్తికేయ’లో నటించి ఉంటే అప్పటి నుంచే ఆయన సీరియస్‌ కథల్లో కనిపించేవారేమో. సీరియస్‌ లుక్‌లో ప్రేక్షకులు తనని అంగీకరిస్తారా, లేదా? అనే సందేహానికి ‘మహర్షి’ చిత్రంలో పోషించిన రవిశంకర్‌ పాత్ర జవాబుగా నిలిచిందని, ఆ క్యారెక్టరే పవర్‌ఫుల్‌ స్టోరీల్లో నటించేందుకు ధైర్యాన్నిచ్చిందని నరేశ్‌ మరో ఇంటర్వ్యూలో తెలిపారు. వరుసగా యాక్షన్‌ తరహా సబ్జెక్ట్‌లకే పరిమితం కాకుండా కామెడీ సినిమాలూ చేస్తుంటానని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని