Amritha aiyer: ‘హను-మాన్‌’ గుర్తుండిపోయే జ్ఞాపకం

‘రెడ్‌’, ‘30రోజుల్లో ప్రేమించడం ఎలా?’ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన కథానాయిక అమృత అయ్యర్‌. ఇప్పుడు ‘హనుమాన్‌’లో తేజ సజ్జాకు జోడీగా నటించింది. ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన ఈ పాన్‌ ఇండియా సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది అమృత.

Updated : 13 Jan 2024 09:55 IST

‘రెడ్‌’, ‘30రోజుల్లో ప్రేమించడం ఎలా?’ లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన కథానాయిక అమృత అయ్యర్‌. ఇప్పుడు ‘హనుమాన్‌’లో తేజ సజ్జాకు జోడీగా నటించింది. ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన ఈ పాన్‌ ఇండియా సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది అమృత.

  • ‘‘హను-మాన్‌’ కథ చెప్పినప్పుడే నాకు చాలా నచ్చేసింది. వెంటనే చేస్తానని చెప్పేశా. అయితే ఓ చిన్న తెలుగు సినిమాలా మొదలైన ఇది.. ఇంత పెద్ద చిత్రంగా మారుతుందనైతే అసలు అనుకోలేదు. నిన్న ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూస్తుంటే వాళ్ల అరుపులు, కేకలు విని చాలా ఆనందంగా అనిపించింది. అందరికీ నా పాత్ర కూడా బాగా నచ్చింది. కొంతమంది ‘‘ప్రథమార్ధంలో  నువ్వే హీరో’ అంటుంటే సంతోషంగా అనిపించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌ ఉందని నాకూ తెలియదు. తెరపై అందరితో కలిసి చూసినప్పుడు సర్‌ప్రైజ్‌గా అనిపించింది’’.
  • ‘‘హను-మాన్‌’కు ముందు వరకు నాకు సరైన అవకాశాలు రాలేదనే చెప్పాలి. ఎందుకంటే ఎవరికైనా ఓ హిట్టు పడ్డాకే కదా వారిపై దృష్టి పడేది. ఇప్పుడీ చిత్రం తర్వాత నుంచి మంచి అవకాశాలు వస్తాయనే అనుకుంటున్నా. నాకు నటనా ప్రాధాన్య పాత్రలంటే ఇష్టం. అలాగే నాకు డ్యాన్స్‌ అంటే ఇష్టం. అలాంటి పాత్రలు వచ్చినా చేయడానికి సిద్ధమే. నేను సెట్‌లో ఉంటే ఫోన్‌ చూడను.. క్యారవాన్‌లోకి వెళ్లను. అందర్నీ పరిశీలిస్తుంటా. ఎందుకంటే ప్రతి ఒక్కరి నుంచి నేర్చుకోవడానికి ఏదోక విషయం ఉంటుంది. తమిళ హీరో విజయ్‌ను చూసి దీన్ని అలవర్చుకున్నా. ప్రస్తుతం తెలుగులో అల్లరి నరేశ్‌తో ఓ సినిమా చేస్తున్నా’’.
  • ‘‘విడుదలకు ముందు ఈ సినిమాకి థియేటర్ల సమస్య ఏర్పడటంతో టీమ్‌తో పాటు నాకు కాస్త ఆందోళనగా అనిపించింది. కాకపోతే నాకు ప్రశాంత్‌ వర్మ దర్శకత్వ ప్రతిభపై నమ్మకం. కచ్చితంగా సినిమా అందరికీ నచ్చుతుందని నమ్మా. ఈరోజు అదే నిజమైంది. ఇక తేజతో కలిసి పని చేయడం చాలా బాగుంది. తను చాలా మంచి నటుడు. తన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నా. అలాగే  వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, వెన్నెల కిషోర్‌.. ఇలా ప్రతి ఒక్కరి నుంచి కొన్ని మెళకువలు నేర్చుకున్నా.ఈ ‘‘హను-మాన్‌’ ప్రయాణం నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే మంచి జ్ఞాపకం’’.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని