Chiranjeevi: చిరుని రాఘవేంద్రరావు ఏమని పిలిచేవారంటే!

అగ్ర కథానాయకుడు చిరంజీవి సినీ కెరీర్‌లో ప్రేక్షకులకు గుర్తిండిపోయే చిత్రాలను అందించారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.

Published : 30 Jan 2023 12:58 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అగ్ర కథానాయకుడు చిరంజీవి సినీ కెరీర్‌లో ప్రేక్షకులకు గుర్తిండిపోయే చిత్రాలను అందించారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. ‘అడవి దొంగ’, ‘కొండవీటి రాజా’, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘ఘరానా మొగుడు’ ఇలా వారి కాంబినేషన్‌లో దాదాపు 14 చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇక చిరు కథానాయకుడిగా శ్రీదేవితో ఆయన తెరకెక్కించిన చిత్రం ‘జగదేక వీరుడు..’ ఎవర్‌గ్రీన్‌ అని చెప్పాలి.

రాఘవేంద్రరావు దర్శకత్వంలో చిరు నటించిన తొలి చిత్రం ‘మోసగాడు’. ఇందులో శోభన్‌బాబు హీరో అయినా, చిరంజీవిని కూడా తీసుకోవడానికి ఓ కారణం ఉంది. ఈ చిత్రంలో శ్రీదేవి ద్విపాత్రాభినయం చేశారు. నెగెటివ్‌ రోల్‌ శ్రీదేవి పాత్రకు జోడీగా చిరును తీసుకున్నారు. అప్పటికే ఫైట్స్‌, డ్యాన్సులు బాగా చేస్తాడని చిరుకు మంచి పేరు వచ్చింది. దీంతో ఆయన్ను తీసుకుంటే శ్రీదేవితో ఒక పాట, శోభన్‌బాబుతో ఒక ఫైట్‌ ప్లాన్‌ చేయొచ్చనే ఉద్దేశంతో కావాలనే చిరును తీసుకున్నారట. ఆ తర్వాత ఎన్టీఆర్‌తో తీసిన ‘తిరుగులేని మనిషి’లో కూడా చిరుకు అవకాశం ఇచ్చారు. అయితే, ఈ సినిమా వచ్చిన అయిదేళ్ల తర్వాత చిరు కథానాయకుడిగా వీరి కాంబినేషన్‌లో ‘అడవి దొంగ’(1985) తెరకెక్కింది. మాస్‌ హీరోగా చిరుకు మంచి పేరు తెచ్చింది. అప్పటి నుంచి వీరి మధ్య సాన్నిహిత్యం మరింత బలపడింది. దీంతో చిరును రాఘవేంద్రరావు బాబాయ్‌ అని పిలిచేవారట.

రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించే సమయానికి చిరంజీవి చిన్న చిన్న పాత్రలు మాత్రమే చేశారు. ఈ నేపథ్యంలో తనతో పనిచేయడానికి ఇబ్బంది పడతాడేమోనని చిరుని రాఘవేంద్రరావు బాబాయ్‌ అని పిలిచేవారట. అలా ఆ తర్వాత కూడా అలవాటైపోయింది. ఏ దర్శకుడైనా హీరోను దగ్గర చేసుకుంటే వారి నుంచి మంచి నటన రాబట్టవచ్చని, అందుకే అలా పిలిచేవాడినని రాఘవేంద్రరావు ఓ సందర్భంలో పంచుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని