చిరు-నాగ్‌-వెంకటేశ్‌లతో మల్టీస్టారర్‌ తీయాలనుకున్నారు

ఒక టికెట్టుపై డబుల్‌ ధమాకా వినోదాల్ని పంచిచ్చేవి మల్టీస్టారర్‌ చిత్రాలు. అందుకే ఏ చిత్రసీమలోనైనా ఓ మల్టీస్టారర్‌ చిత్రం మొదలవుతుందంటే.. ప్రేక్షకుల చూపంతా అటువైపే మళ్లుతుంటుంది.

Updated : 11 Mar 2024 12:48 IST

ఒక టికెట్టుపై డబుల్‌ ధమాకా వినోదాల్ని పంచిచ్చేవి మల్టీస్టారర్‌ చిత్రాలు. అందుకే ఏ చిత్రసీమలోనైనా ఓ మల్టీస్టారర్‌ చిత్రం మొదలవుతుందంటే.. ప్రేక్షకుల చూపంతా అటువైపే మళ్లుతుంటుంది. ఇద్దరు స్టార్‌ హీరోలు కలిసి నటిస్తున్నారని చెబితే.. ఇక ఆ అంచనాలు ఆకాశాన్నే తాకుతాయి. దీన్ని దృశ్య రూపంలోకి తీసుకురావడం దర్శక నిర్మాతలకు అంత సులువైన పని కాదు. కథానాయకుల ఇమేజ్‌ చట్రాల్ని దృష్టిలో పెట్టుకొని కథనాలు అల్లుకోవడం ఒకెత్తయితే.. దాన్ని తెరపైకి తెచ్చేందుకు నిర్మాత పెట్టే బడ్జెట్‌ లెక్క మరొకెత్తు. అందుకే పెద్ద హీరోలతో మల్టీస్టారర్‌లు ఎప్పుడూ కలగానే మిగిలిపోతుంటాయి. ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణల జమానాలో సినీప్రియులు ఎన్నో అపురూప మల్టీస్టారర్‌లు చూడగలిగారు. తర్వాతి తరంలో వచ్చిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునల హయాంలో ఒక్క అరుదైన మల్టీస్టారర్‌ను చూడలేకపోయింది తెలుగు ప్రేక్షక లోకం.

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ విజయమిచ్చిన స్ఫూర్తితో ఇటీవల కాలంలో పలువురు అగ్ర హీరోలు యువ స్టార్లతో వెండితెరపై సందడి చేసినప్పటికీ.. చిరు, వెంకీ, నాగ్‌ల కలయికలో ఒక్క మల్టీస్టారరైనా చూడాలన్న అభిమానుల కోరిక ఇప్పటికీ కలగానే ఉండిపోయింది. నిజానికి వీళ్ల ముగ్గురితో ఓ మల్టీస్టారర్‌ చిత్రం చేయాలన్న ఆలోచన 90ల్లో కొందరు అగ్ర దర్శక నిర్మాతలకు వచ్చిందట. అదెందుకో కార్యరూపం  దాల్చలేదు. అయితే దీనిపై అప్పట్లో తీవ్రంగానే చర్చలు జరిగాయి. ఆ రోజుల్లో బాలీవుడ్‌లో వచ్చిన ‘త్రిదేవ్‌’ (1989) అనే క్రేజీ మల్టీస్టారర్‌ ఈ ఆలోచనలకు సాకారం చేసేందుకు యత్నించింది . సన్నీ దేఓల్‌ , జాకీ ష్రాఫ్, నసీరుద్దిన్‌ షా కథానాయకులుగా దర్శకుడు రాజీవ్‌ రాయ్‌ తెరకెక్కించిన ఈ చిత్రం.. అప్పట్లో బాలీవుడ్‌లో సంచలన  విజయాన్ని అందుకొంది. ఆ యాక్షన్‌ థ్రిల్లర్‌ను చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌లతో తీస్తే బాగుంటుందని ఓ అగ్ర నిర్మాణ సంస్థ 90ల్లో గట్టిగానే ప్రయత్నించింది. ఈ కథ ముగ్గురు హీరోల ఇమేజ్‌లకు సరిపడే స్థాయిలో ఉండటం.. మూడు పాత్రలకు సమ ప్రాధాన్యం ఉండటంతో తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకోవచ్చని భావించారట.

అప్పట్లో దీని గురించి ఈ ముగ్గురి హీరోలతో చర్చలు జరిగినట్లు వార్తలు వినిపించాయి. మరి దీనికి మన అగ్ర హీరోలు ఒప్పుకోలేదో? సమర్థమంతమైన దర్శకులు దొరకలేదో? తెలియదు కానీ, ఈ క్రేజీ మల్టీస్టారర్‌ కార్యరూపం దాల్చలేదు. తర్వాత కొన్నేళ్లకు ఈ చిత్రాన్ని సుమన్, భానుచందర్, అరుణ్‌ పాండ్యన్‌లతో ‘నక్షత్ర పోరాటం’ పేరుతో రీమేక్‌ చేశారు. అయితే ఇది బాక్సాఫీస్‌ వద్ద దారుణ ఫలితాన్ని రుచి చూడాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత మళ్లీ ఎప్పుడూ ఈ ముగ్గురు అగ్ర హీరోల మల్టీస్టారర్‌ ఊసులు వినిపించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని