chiranjeevi: నాగబాబుపై ‘చిరు’ కోపం!

అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సోదరుడిగా నాగబాబు పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. అన్నదమ్ములిద్దరూ కలిసి నటించిన సందర్భాలూ ఉన్నాయి.

Updated : 02 Apr 2024 12:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సోదరుడిగా నాగబాబు పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. అన్నదమ్ములిద్దరూ కలిసి నటించిన సందర్భాలూ ఉన్నాయి. ఆ తర్వాత నాగబాబు నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించారు. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానే కాకుండా ‘జబర్దస్త్’ కామెడీషో జడ్జిగానూ ఎంతోమందికి చేరువయ్యారు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆయన ఏ విషయంలోనైనా తనకు అన్నయ్యే స్ఫూర్తి అని చెబుతుంటారు. ‘చిన్నప్పుడు ఎప్పుడైనా నాగబాబును మీరు కొట్టారా?’ అని చిరంజీవిని ఓ సందర్భంలో ప్రశ్నించగా ఇలా చెప్పుకొచ్చారు.

‘‘నేను ఇంటర్మీడియట్‌ చదువుతున్న రోజుల్లో నాగబాబు ఆరో, ఏడో చదువుతున్నాడు. ఆ సమయంలో అమ్మకు అన్ని విషయాల్లో సహాయపడుతూ, పనులన్నీ నేనే చేసేవాడిని. ఒకరోజు లాండ్రీ నుంచి బట్టలు తీసుకురావడంతో పాటు, మరో చోటుకి కూడా వెళ్లాల్సి వచ్చింది. రెండూ ఒకే సమయంలో చేయాల్సి రావడంతో ‘నేను బయటకు వెళ్లొచ్చే సరికి లాండ్రీకి వెళ్లి బట్టలు తీసుకురా’ అని నాగబాబుకు చెప్పా. నేను పని చూసుకుని వచ్చి ‘బట్టలు తెచ్చావా?’ అని అడిగితే ‘తీసుకురాలేదు’ అన్నాడు. ‘ఎందుకు తేలేదు’ అని అడిగితే.. ‘నిద్ర పోతున్నా’ అన్నాడు. నాకు విపరీతమైన కోపం వచ్చి కొట్టేశాను. అది చూసి అమ్మకు నాపై మరింత కోపం వచ్చి ‘చిన్నోడిని అలా కొడతావా?’ అంటూ నన్ను బాగా తిట్టేసింది. సాయంత్రం నాన్న రాగానే, ఏడుస్తూ మొత్తం చెప్పేశా. అప్పుడు నాన్న వెళ్లి నాగబాబును మందలించారు. అప్పుడు నాకు రిలీఫ్‌గా అనిపించింది’ అంటూ నవ్వుతూ చిన్ననాటి సంగతులను గుర్తు చేసుకున్నారు చిరు.

చిరంజీవి-నాగబాబు కలిసి పలు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ‘అంజి’ సినిమాలో చిరంజీవిని పెంచి పెద్ద చేసిన వ్యక్తిగా పెద్దయ్య అనే పాత్రలో నటించారు నాగబాబు. ఆ పాత్రకు సంబంధించిన సంభాషణల్లో చిరుని ‘ఒరేయ్‌’, ‘ఏరా’ అంటూ పిలవాల్సి ఉండగా, తాను అన్నయ్యను అలా పిలవలేనని చెప్పారట. విషయం చిరంజీవి దృష్టికి తీసుకెళ్లిందట చిత్ర బృందం. దీంతో చిరు వచ్చి ‘మనం కేవలం ఆ పాత్రల్లో నటిస్తున్నామంతే. పర్వాలేదు పిలువు’ అని చెబితే అప్పుడు ఒప్పుకొన్నారట నాగబాబు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని