Dil raju: దిల్‌రాజు నిర్మాతే కాదు.. సింగర్‌ కూడా.. ఆయన పాడిన పాటేంటో తెలుసా?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్‌రాజు (Dil Raju) ఒకరు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.

Published : 12 Dec 2023 15:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర నిర్మాతల్లో దిల్‌రాజు (Dil Raju) ఒకరు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. అంతేకాదు, నూతన దర్శకులను పరిచయం చేయడంలోనూ ఆయన ముందుంటారు. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ ఉంటారు. అలాంటి దిల్‌ రాజులోనూ ఓ టాలెంట్‌ ఉంది. అదే సింగింగ్‌. అవును మీరు విన్నది నిజమే. అంతేకాదు, ఆయన ఓ పాట పాడారని చాలా మంది తెలియదు.

అక్కినేని నట వారసుడు నాగచైతన్య కథానాయకుడిగా వెండితెరకు పరిచయమైన చిత్రం ‘జోష్‌’ (Josh). వాసువర్మ దర్శకుడు. యువతను ఆకట్టుకునే కథా, కథనాలతో తీర్చిదిద్దిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. సరిగ్గా ఈ సినిమా విడుదల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంలో చనిపోవడంతో యావత్‌ రాష్ట్రం మొత్తం విషాదంలో మునిగిపోయింది. దీంతో సినిమా విడుదల వాయిదా పడి, ఆలస్యమవడం, రాష్ట్రంలో పరిస్థితులు అప్పటికి చక్కబడకపోవడం కూడా సినిమాపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి.

‘జోష్‌’ కథానాయకుడిగా తొలుత రామ్‌చరణ్‌ను అనుకున్నారట దిల్‌రాజు. కానీ ఎందుకో కుదరలేదు. ఆ తర్వాత ఈ కథను నాగార్జున వినడం, నాగచైతన్య (Naga chaitanya) హీరోగా తెరంగేట్రం చేయడం జరిగాయి. అక్కినేని నట వారసుడి పరిచయం కావడంతో ఈ సినిమా విషయంలో దిల్‌రాజు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. సందీప్‌ చౌతా సంగీతం అందించిన ఇందులో పాటలు ఆకట్టుకునేలా ఉంటాయి. ఇక ఇందులో ఓ పాటను దిల్‌రాజు కూడా పాడారు. ‘అన్నయొచ్చినాడో.. వెలుగులు వెన్నెల్‌ తెచ్చినాడో..’ అంటూ చంద్రబోస్‌ సాహిత్యం అందించిన పాటను దిల్‌రాజు స్వయంగా పాడటం విశేషం. ఈ పాట లిరిక్స్‌ వచ్చిన తర్వాత అవి సరిగా ఉన్నయో లేదో చూసుకుంటూ దిల్‌ రాజు హమ్‌ చేస్తుండటంతో అది విన్న దర్శకుడు వాసువర్మ పట్టుబట్టి మరీ ఆయనతోనే ఈ పాట పాడించారు. ఈ విషయాన్ని గతంలో ప్రసారమైన రాఘవేంద్రరావు ‘సౌందర్య లహరి’లో దిల్‌రాజు స్వయంగా పంచుకున్నారు. ఇక రామ్‌చరణ్‌ (Ram charan) కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో ‘గేమ్‌ ఛేంజర్‌’ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని