NTR: ఆ కథ ఎన్టీఆర్‌తో చేస్తానంటే కొడాలి నాని ఒప్పుకోలేదు: వినాయక్‌

టాలీవుడ్‌ క్రేజీ కాంబినేషన్లలో దర్శకుడు వి.వి. వినాయక్‌ (VV Vinayak)- నటుడు ఎన్టీఆర్‌ (NTR) కాంబో ఒకటి. తొలి ప్రయత్నం ‘ఆది’తోనే (aadi) ఈ ఇద్దరు...........

Updated : 06 Dec 2022 15:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌ క్రేజీ కాంబినేషన్లలో దర్శకుడు వి.వి. వినాయక్‌ (VV Vinayak)- నటుడు ఎన్టీఆర్‌ (NTR) కాంబో ఒకటి. తొలి ప్రయత్నం ‘ఆది’తోనే (aadi) ఈ ఇద్దరు కలిసి సరికొత్త రికార్డు సృష్టించారు. 2002లో విడుదలైన ఈ సినిమా మాస్‌ కథలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది. మరి, వినాయక్‌.. ఎన్టీఆర్‌తో ఈ యాక్షన్‌ కథకు బదులు లవ్‌స్టోరీని తీసుంటే ఎలా ఉండేది? ‘శ్రీ’ అనే ప్రేమ కథతో వినాయక్‌ దర్శకుడిగా పరిచయమవుదామనుకున్నారు. సుమారు రూ.40 లక్షల బడ్జెట్‌లో నాయికా ప్రాధాన్య కథని రాసుకున్నారు. అందులో ఇద్దరు కొత్త నటులకు అవకాశం ఉంది. నిర్మాత బుజ్జి ద్వారా ఎన్టీఆర్‌ను కలిశారు వినాయక్‌. ఏదో విందాం లే అన్నట్టుగా ‘నాకు ఎక్కువ సమయం లేదు.. త్వరగా కథ చెప్పు’ అని ఎన్టీఆర్‌ అనగా వినాయక్‌ 5 నిమిషాల్లో ఇంట్రడక్షన్‌ సీన్‌ చెప్పారు. కట్ చేస్తే.. ఆ సీన్‌ తారక్‌కు బాగా నచ్చడంతో 2 గంటలపాటు పూర్తి కథ విన్నారట.

‘‘అంతా హ్యాపీ అనుకునేలోపు ఓ క్యారెక్టర్‌ ఎంటరైంది. ఆ క్యారెక్టర్‌ పేరు కొడాలి నాని. ‘మనకి లవ్‌స్టోరీలు వద్దని చెప్పు. ఇప్పుడు ఆ డైరెక్టర్‌తో మనకెందుకు?’ అని ఆయన ఎన్టీఆర్‌తో అన్నారు’’ అని తన తొలి మజిలీని వినాయక్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. ‘‘ఆ తర్వాతా మేం చాలా సార్లు కలిశాం. అయితే, ఈ విషయం నాతో చెప్పలేక తారక్‌ ఇబ్బంది పడేవాడు. నాకు మరో అవకాశం ఇవ్వు. ఇంకో కథ చెప్తా, నచ్చితే చేద్దాం అని అన్నా. ఆయన ఓకే అనగానే ‘ఆది’ కథ వినిపించా. అంతే ఆయనకు బాగా నచ్చేసింది’’ అని వినాయక్‌ తెలిపారు. ఇంకో విశేషం ఏంటంటే.. ‘శ్రీ’ స్క్రిప్టు రాసేందుకు ఎన్నో ఏళ్లు పట్టగా ‘ఆది’ని రెండు రోజుల్లోనే రాశారట. అలా సంచలనంగా మారిన వినాయక్‌- ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో ‘సాంబ’, ‘అదుర్స్‌’ చిత్రాలు రూపొందాయి. వినాయక్‌ ప్రస్తుతం ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా తెరకెక్కుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని