Cinema News: వెండితెరపై ఉత్తరాంధ్ర జాతర

ఓ కథకు మట్టి పరిమళాలు అద్ది.. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచివ్వడంలో ప్రాంతాల పాత్ర కూడా కీలకమే. ఎందుకంటే తెలుగు భాష ఒక్కటే అయినా ప్రాంతాన్ని బట్టి అది కొత్త యాసతో సరికొత్త సొగసులద్దుకొని భిన్నమైన రుచుల్ని పంచుతుంది.

Updated : 18 Feb 2024 03:18 IST

ముస్తాబవుతోన్న తారల చిత్రాలు

ఓ కథకు మట్టి పరిమళాలు అద్ది.. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచివ్వడంలో ప్రాంతాల పాత్ర కూడా కీలకమే. ఎందుకంటే తెలుగు భాష ఒక్కటే అయినా ప్రాంతాన్ని బట్టి అది కొత్త యాసతో సరికొత్త సొగసులద్దుకొని భిన్నమైన రుచుల్ని పంచుతుంది. అందుకే కథలు సిద్ధం చేసుకునే సమయంలోనే దాన్ని ఏ ప్రాంత నేపథ్యం నుంచి చెప్పాలన్న విషయంలో ఓ అంచనాకి వచ్చేస్తుంటారు దర్శకులు. ఇప్పుడిలా సిద్ధమైన వాటిలో ఉత్తరాంధ్ర నేపథ్యంతో ముడిపడి ఉన్న స్టార్ల చిత్రాలు కొన్ని సినీప్రియుల్ని ఊరిస్తున్నాయి.


తెలుగు తెరపై ఒక్కో ఏడాది ఒక్కో ప్రాంత నేపథ్య చిత్రాల సందడి బాగా కనిపిస్తుంటుంది. ఒకప్పుడు రాయలసీమ నేపథ్యంగా సాగే యాక్షన్‌ సినిమాలు జోరు చూపించాయి. ఆ తర్వాత తెలంగాణ నేపథ్య కథల ఊపు కనిపించింది. ఇక ఇప్పుడు ఉత్తరాంధ్ర కథల వంతొచ్చింది. ప్రస్తుతం రామ్‌చరణ్‌ కథానాయకుడిగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు. ఇది పూర్తిగా ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే కథాంశంతోనే తెరకెక్కనుంది. ఓ ఆటను ప్రధానంగా చేసుకొని బలమైన భావోద్వేగాలతో నిండిన సినిమాగా దీన్ని ముస్తాబు చేయనున్నారు. ఇప్పుడీ చిత్రం కోసం ఉత్తరాంధ్ర యాసను అనర్గళంగా మాట్లాడగల కొత్త నటీనటుల్ని వెతికి పట్టుకునే పనిలో పడింది చిత్ర బృందం. ఈ యాస కోసం చరణ్‌ కూడా ప్రత్యేకంగా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆయన లుక్‌ కూడా చాలా రా రస్టిక్‌గా ఉండనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర పూర్వ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ వేసవిలోనే చిత్రీకరణ మొదలు కానుంది.


తీరం తాకిన ప్రేమకథ..

నాగచైతన్య కథానాయకుడిగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘తండేల్‌’. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీవాస్‌ నిర్మిస్తున్నారు. సాయిపల్లవి కథానాయిక. ఇది ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ప్రేమ కథా చిత్రంగా ఉండనుంది. పాకిస్థాన్‌ తీర రక్షక దళానికి అనుకోకుండా పట్టుబడిన ఓ మత్స్యకారుడి జీవిత ఇతివృతమే ఈ సినిమా. చైతన్య దీంట్లో రాజు అనే పాత్రలో కనిపించనుండగా.. ఆయన్ని ప్రేమించే పల్లెటూరి అమ్మాయిగా బుజ్జితల్లి పాత్రలో సాయిపల్లవి నటిస్తోంది. ఈ చిత్రంలో వీళ్లిద్దరూ ఉత్తరాంధ్ర యాసలో సంభాషణలు పలకనున్నారు. అంతేకాదు ఈ సినిమా కోసం చైతూ పొడవాటి జుట్టు, గుబురు గడ్డంతో మునుపెన్నడూ చూడని రగ్గడ్‌ లుక్‌లోకి మారారు. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.


పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా..

హీరో వరుణ్‌ తేజ్‌.. దర్శకుడు కరుణ కుమార్‌ కలయికలో ‘మట్కా’ అనే పాన్‌ ఇండియా సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. విజేందర్‌ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పూర్తిగా ఉత్తరాంధ్ర నేపథ్యంలోనే సాగనుంది. యావత్‌ దేశాన్ని కదిలించిన కొన్ని యథార్థ సంఘటనల ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. 1958-80ల మధ్య కాలంలో సాగే ఈ కథలో వరుణ్‌ నాలుగు భిన్నమైన గెటప్స్‌లో కనిపించనున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.


అనుష్క సినిమా.. అదే నేపథ్యం?

గతేడాది ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’తో ప్రేక్షకుల్ని అలరించింది అనుష్క. ఇప్పుడామె క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. ‘వేదం’ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రమిది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఓ ఆసక్తికర కథాంశంతో దీన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. తనకు జరిగిన అన్యాయంపై ఓ అమ్మాయి ఎలా పోరాటం చేసిందన్నదే దీని ప్రధాన ఇతివృత్తంగా ఉండనున్నట్లు తెలిసింది. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే ప్రారంభమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని