aa okkati adakku: పేరు మరింత బాధ్యతని పెంచింది

పెళ్లికి సంబంధించి చాలా మందికి తెలియని విషయాల్ని మా సినిమాతో చెబుతున్నాం. హాస్యంతోపాటు... భావోద్వేగాలూ బలమైన ప్రభావం చూపిస్తాయ’’ని చెప్పారు మల్లి అంకం.

Updated : 30 Apr 2024 09:42 IST

‘‘పెళ్లికి సంబంధించి చాలా మందికి తెలియని విషయాల్ని మా సినిమాతో చెబుతున్నాం. హాస్యంతోపాటు... భావోద్వేగాలూ బలమైన ప్రభావం చూపిస్తాయ’’ని చెప్పారు మల్లి అంకం. ఆయన దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. అల్లరి నరేశ్‌, ఫరియా అబ్దుల్లా జంటగా నటించారు. రాజీవ్‌ చిలక నిర్మాత. ఈ చిత్రం మే 3న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు మల్లి అంకం.

‘‘పెళ్లెప్పుడు అని తేలిగ్గా అడిగేస్తుంటాం కానీ... ఆ మాట పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నవాళ్లకీ, వాళ్ల కుటుంబాలకీ చాలా సార్లు ఎంతో బాధని కలిగిస్తుంది. దాని వెనక భావోద్వేగాల్ని ఆవిష్కరించాలనే ప్రయత్నమే ఈ సినిమా. దాన్ని వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశాం. ఈ సినిమాలోని కామెడీ, భావోద్వేగాలు మనసుల్ని హత్తుకునేలా ఉంటాయి. నరేశ్‌కి నేను కథ మాత్రమే చెప్పా. విన్నాక ఆయనే ఈ పేరుని సూచించారు. కథకి దగ్గరైన పేరు ఇది. ఆ పేరుతో ఈవీవీ సర్‌ తీసిన సినిమా ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో ఉంది. అలాంటి పేరుతో మేం సినిమా చేయడం నాపై మరింత బాధ్యతని పెంచింది’’.  

  • ‘‘నరేశ్‌ కొంతకాలంగా కామెడీ సినిమాలు చేయడం లేదు. దాంతో నేను కామెడీ కథ అనగానే ఆయన మొదట అయిష్టత వ్యక్తం చేశారు. ఆయన ఇదివరకు చేసిన స్లాప్‌స్టిక్‌ కామెడీ అనుకున్నారు. కానీ ఇందులోని భావోద్వేగాల గురించి తెలుసుకుని కథ వినడం మొదలుపెట్టారు. సగం కథ చెప్పడం పూర్తవ్వగానే ‘ఇది మనం చేద్దాం’ అన్నారు’.  
  • ‘‘సమాజంలో జరిగే సంఘటనలే ఈ కథకి స్ఫూర్తి. వాటికి కొన్ని కల్పితాల్ని జోడించి ఈ కథ రాసుకున్నా. పూర్వ విద్యార్థుల కలయిక పేరుతో మా స్నేహితులంతా ఓసారి కలిశాం. కొంతమంది కుటుంబాలతో కలిసి వస్తే, కొంతమందికేమో పెళ్లి కాలేదు. అందరూ వేదికనెక్కితే, పెళ్లి కాని ఒకరిద్దరు మాత్రం వేదికపైకి రావడానికీ ఇష్టపడలేదు. వస్తే పెళ్లి కాలేదనే విషయం అందరికీ తెలుస్తుందనీ, ఆ తర్వాత పెళ్లి ఎందుకు చేసుకోలేదని, ఎప్పుడు చేసుకుంటావని అడుగుతారనీ ఈ సమాధానాలు చెప్పలేకే రానని చెప్పారు వాళ్లు. ఆ సందర్భంలో వాళ్ల  ఆవేదన ఎలాంటిదో నాకు అర్థమైంది. అలాగే పెళ్లి సంబంధాల్ని చూసే మ్యాట్రిమోనీ ఏజెన్సీల గురించి, పెళ్లికి సంబంధించి పత్రికల్లో వచ్చిన మరికొన్ని సంఘటనల్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ కథ రాశా. రచయిత అబ్బూరి రవి ఈ కథలోని భావోద్వేగాన్ని మరింత బలంగా ఆవిష్కరిస్తూ మాటలు రాశారు. ఆయన ఈ సినిమాకి ఎంతో బలం’’.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని