Actor Ali: ఇదీ అలీ చాట కథ..!

అలీ అంటే గుర్తొచ్చేది ‘చాట’ భాష. ఆ భాషతో తికమకపెట్టి నవ్వులు పంచారు. ఈ చాట భాష ఎక్కడి నుంచి వచ్చింది? అని అలీని అడిగితే..

Published : 15 Mar 2023 11:35 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాల నటుడిగా కెరీర్‌ను ప్రారంభించి.. హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకుని.. కథానాయకుడి స్థాయికి ఎదిగిన నటుడు అలీ(Ali) . ఒకప్పుడు తనదైన కామెడీ టైమింగ్‌తో అలరించిన ఆయన ఇప్పటికీ అదే స్థాయిలో అలరిస్తున్నారు. హీరోగా మారిన తర్వాత మళ్లీ కమెడియన్‌గా చేయాలంటే చాలామంది వెనకడుగేస్తుంటారు. కానీ, ఏ పాత్రలోనైనా ఇమిడిపోయే నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు అలీ. ఆయనకు బాగా పేరు తీసుకొచ్చిన సినిమాల్లో ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ ఒకటి. లోను కోసం బ్యాంకు మేనేజర్‌ అయిన బ్రహ్మానందాన్ని ‘చాట’ భాషతో తికమకపెట్టి నవ్వులు పంచారు. ఈ చాట భాష ఎక్కడి నుంచి వచ్చింది? అని అలీని అడిగితే..

‘‘మగాడు’ చిత్రీకరణ కోసం కేరళలోని ఎర్నాకుళం వెళ్లాం. ఒకరోజు షూటింగ్‌ నుంచి ఒక్కడినే మేం బస చేసిన హోటల్‌కు బయల్దేరా. హోటల్‌ పేరు గుర్తులేదు. అడ్రస్‌ కార్డూ లేదు. అక్కడొక మార్కెట్‌ చూసినట్టు గుర్తు. మలయాళం రాదు. ఒక ఆటోని పిలిచి మార్కెట్‌ అని చెప్పా. ‘ఎన్న శాట మార్కెట్‌, అడ్రస్‌ అల్లిల్లో...’ అంటూ ఏదో మాట్లాడాడు. ఏం అర్థం కాలేదు. ‘ఆ శాటే...’ అంటూ ఆటో ఎక్కేశా. వాడేమో ఊరంతా తిప్పుతున్నాడు. లాభం లేదనుకొని ‘సినిమావాళ్లు దిగే పెద్ద హోటల్‌’ అని వచ్చీ రాని భాషలో అడిగా. చివరికి తీసుకెళ్లాడు. కొన్ని రోజులు అక్కడ తిరగడంతో ఆ యాస బాగా అలవాటైంది’’

‘‘జంబలకిడి పంబ’ సమయంలో రచయిత దివాకర్‌బాబు ఒక చెట్టు కింద కూర్చుని రాసుకొంటున్నాడు. అప్పుడే నటి చంద్రిక అటుగా వస్తోంది. ఆమె మలయాళం సినిమాలో నటిస్తుందని తెలిసి ‘ఎవడే చంద్రిక, ఎవడే పైలిల్లో’ అన్నా సరదాగా. అది విన్న దివాకర్‌బాబు ‘బాగుందయ్యా.. సినిమాలో వాడేద్దాం’ అన్నాడు. ఆ తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ షూటింగ్‌లో డైలాగ్‌ పేపర్‌ తీసుకున్నా.. బ్రహ్మానందం అని రాసి ఉంది, పక్కన కొన్ని డైలాగులున్నాయి. కింద అలీ అని రాసుంది, డైలాగులు లేవు. ఇదేంటీ? నాకు డైలాగులు లేవా అన్నా. ‘దివాకర్‌బాబు చెప్పాడు, నువ్వేదో మలయాళం మాట్లాడతావంట కదా! అదే డైలాగ్‌’ అన్నారు. ఇక చూడండి.. కెమెరామెన్‌ శరత్‌ కెమెరాని వదిలిపెట్టి బయటికి వెళ్లి నవ్వుకున్నాడు. ఎప్పుడైతే అక్కడ క్లాప్స్‌ కొట్టి నవ్వుకొన్నారో. నేను యాక్ట్‌ చేయడం కంటే కూడా, బ్రహ్మానందం రియాక్షన్‌ని చూసి ఎక్కువగా నవ్వుకొన్నారు. అప్పట్నుంచి నేను చాటగాడు అయిపోయా’’ అంటూ చాట భాష వెనుక కథ చెప్తారాయన. ఇలా ప్రతి సినిమాలోనూ తనదైన మేనరిజమ్స్‌తో ఆకట్టుకున్నారు అలీ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని