‘గాలివాన’లో ప్రదర్శన!

1972-73 ప్రాంతంలో మండలి కృష్ణారావు మంత్రిగా ఉన్న సమయంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి.

Published : 30 Dec 2023 14:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: 1972-73 ప్రాంతంలో మండలి కృష్ణారావు మంత్రిగా ఉన్న సమయంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిగాయి. ఆయన ఆధ్వర్యంలో సినిమా నటులందరూ సహకరించారు. ఊరూరా తిరిగి ప్రదర్శనలు ఇచ్చారు. నాటికలు, నాట్యాలు, మిమిక్రీలు, సంగీతం ఇలా అనేక కార్యక్రమాలు నిర్వహించేవారు. నెల్లూరు, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తెనాలి తదితర పట్టణాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. ఎస్‌.పి.బాలసుబ్రమణ్యం పాట కచేరి, రాజసులోచన నాట్యం, వేణుమాధవ్‌ మిమిక్రీలతో పాటు, నటీనటులు ఒక్కో నాటికలో నటించారు.

అప్పలాచార్య రాసిన ‘వింత మనుషులు’ నాటికలో పాత్రలు ఎక్కువ. కృష్ణ, విజయనిర్మల, రాధాకుమారి, లీలారాణి, చంద్రమోహన్‌, సాక్షి రంగారావు, గుమ్మడి, జగ్గారావు, రావికొండలరావు తదితరులు నటులు ఆ నాటికలో వివిధ పాత్రలు పోషించారు. రాజమండ్రిలో ప్రదర్శన ఏర్పాటు చేశారు. భారీ స్టేజ్‌ కట్టారు. నాటకం ప్రదర్శిస్తుండగా విపరీతమైన గాలి రాగా, పైన తాత్కాలికంగా ఏర్పాటు చేసిన టార్ఫాలిన్‌ కప్పు లేచిపోయింది. చిన్న చిన్న చినుకులుగా ప్రారంభమైన వాన తీవ్రమైంది. ఇంతలో హీరో కృష్ణ వచ్చి, ‘మీరంతా చూస్తామంటే మేము ఈ వానలోనే నాటిక ప్రదర్శిస్తాం’ అని చెప్పారు. ప్రేక్షకులు ‘చూస్తాం.. చూస్తాం..’ అని అన్నారు. కుర్చీలు ఎత్తి తలపై పెట్టుకుని నిలబడి చూడసాగారు. ఒక పక్క వాన చప్పుడు హోరుమంటుంటే మరోపక్క లైట్లమీద నీరు పడి టప్‌టప్‌మని బల్బులు పేలిపోతున్నాయి. తడిసిన మైకులు మూగబోయాయి. వాన మరింత తీవ్రమైంది. అంతే! ప్రేక్షకులు పరిగెత్తారు. చేసేది లేక కృష్ణతో సహా మిగిలిన నటులు కూడా స్టేజ్‌పై నుంచి దిగి వెళ్లిపోయారు!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని