Devil: కల్యాణ్‌రామ్‌ విశ్వరూపం చూస్తారు!

‘అర్జున్‌ రెడ్డి’ సినిమాతో తొలి అడుగులోనే ప్రేక్షకుల మెప్పు పొందిన నయా సంగీత తరంగం హర్షవర్ధన్‌ రామేశ్వర్‌. ‘కబీర్‌ సింగ్‌’తో బాలీవుడ్‌లోనూ సత్తా చాటిన ఆయన ఇప్పుడు ‘యానిమల్‌’తో మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించారు.

Updated : 24 Dec 2023 10:44 IST

‘అర్జున్‌ రెడ్డి’ సినిమాతో తొలి అడుగులోనే ప్రేక్షకుల మెప్పు పొందిన నయా సంగీత తరంగం హర్షవర్ధన్‌ రామేశ్వర్‌. ‘కబీర్‌ సింగ్‌’తో బాలీవుడ్‌లోనూ సత్తా చాటిన ఆయన ఇప్పుడు ‘యానిమల్‌’తో మరోసారి అందరి దృష్టినీ ఆకర్షించారు. ప్రస్తుతం ఆయన సంగీతమందించిన ‘డెవిల్‌’ ప్రేక్షకుల ముందుకు రానుంది. కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని అభిషేక్‌ నామా స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఇది ఈనెల 29న విడుదల కానున్న నేపథ్యంలో పంచుకున్న విశేషాలివి..  

‘‘యానిమల్‌’ అందరికీ నచ్చుతుందని ముందునుంచీ అనుకున్నా కానీ, ఇంత పెద్ద విజయాన్ని అందుకుంటుందని అసలు ఊహించలేదు. ప్రేక్షకుల నుంచి దక్కిన ఈ ఆదరణ చాలా ఆనందాన్నిచ్చింది. చాలామంది ఫోన్లు చేసి నేపథ్య సంగీతం గురించి ప్రశంసిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తున్నారు. ఎంతో సంతృప్తిగా ఉంది’’.

  • ‘‘డెవిల్‌’ పూర్తిగా స్వాతంత్య్రానికి పూర్వం జరిగే కథతో రూపొందిన చిత్రం. కాబట్టి దానికెలాంటి సంగీతం అందించాలన్న విషయంలో చాలా పరిశోధన చేశా. క్లాసికల్‌ టచ్‌తో సితార్‌, వీణ, సింఫనీ వంటి వాద్యాల్ని ఉపయోగిస్తూనే ఓ కొత్త మ్యూజిక్‌ వినిపించే ప్రయత్నం చేశాం. దీనికోసం సింగపూర్‌, సౌదీ తదితర దేశాల నుంచి మరికొన్ని కొత్త వాద్య పరికరాల్ని తెప్పించుకున్నా’’.
  • ‘‘ఇది థ్రిల్లర్‌ జానర్‌లో సాగే సినిమా. ఆద్యంతం ట్విస్టులు, టర్న్‌లతో ఆసక్తి రేకెత్తిస్తూ సాగుతుంది. కాబట్టి కథ చెప్పడంలో నేపథ్య సంగీతం కూడా కీలకంగా నిలుస్తుంది. అలాగే దీంట్లో పాటలన్నీ కథలోనే భాగంగా ఉంటాయి. ఒక్క ‘‘రోజీ..’’ పాట తప్ప మిగిలినవన్నీ మాంటేజ్‌ గీతాలే. వీటిలో ఏ ఒక్కటీ కథా గమనానికి అడ్డుగా అనిపించవు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వినిపించే నేపథ్య సంగీతం హైలైట్‌గా నిలుస్తుంది’’
  • ‘‘ఈ చిత్ర విషయంలో దర్శక నిర్మాత అభిషేక్‌ నామా నాకెంతో అండగా నిలిచారు. నిజానికి దీన్ని అక్టోబరులోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, అప్పటికి నేను ‘యానిమల్‌’ సంగీత పనులతో తీరిక లేకుండా ఉన్నా. దీంతో ఆయన నేను ఆ చిత్రం పూర్తి చేసి వచ్చే వరకు వేచి చూశారు. వాస్తవానికి తను కావాలనుకుంటే మరో సంగీత దర్శకుడ్ని పెట్టుకొని మ్యూజిక్‌ చేయించుకోవచ్చు. కానీ, నాపై ఉన్న నమ్మకంతోనే ఆ చిత్ర పనులు పూర్తయ్యే వరకు వేచి చూశారు’’.
  • ‘‘చిన్నప్పటి నుంచి ఇళయరాజా, ఏఆర్‌ రెహమాన్‌ తదితరుల సంగీతం వింటూ పెరిగా. తెలియకుండానే వాళ్ల ప్రభావం నా సంగీతంలో కనిపిస్తుంటుంది. నాకు సంగీత దర్శకుడిగా భిన్నమైన ప్రయోగాలు చేయాలనుంది. పాతరోజుల్లో చేసినట్లు ఒక సినిమా మొత్తాన్ని పూర్తిగా లైవ్‌ సెక్షన్‌ మ్యూజిక్‌తో చేయాలనుంది. భవిష్యత్తులో దర్శకత్వం చేస్తా. సంగీత ప్రధానంగా ఓ చిత్రం తెరకెక్కించాలనుంది. దర్శకుడు సందీప్‌రెడ్డి వంగాకు ఇదే విషయం చెప్పా. ఆయన దగ్గర రెండు సినిమాలకు పని చేసి.. స్క్రిప్ట్‌ వర్క్‌తో పాటు అన్నీ నేర్చుకోవాలి. అలాగే డ్రమ్స్‌ శివమణి జీవితకథతో సినిమా చేయాలని ఆశ. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలకు సంగీతం అందిస్తున్నా. సందీప్‌ - ప్రభాస్‌ కలయికలో రూపొందనున్న ‘స్పిరిట్‌’ చిత్రానికి సంగీతమందించనున్నా. స్క్రిప్ట్‌ పూర్తి చేసి.. మేలో కథ చెప్తానని సందీప్‌ చెప్పారు. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి’’.

"దేశభక్తి ప్రధానంగా సాగే చిత్రమిది. సినిమా చూసేటప్పుడు ప్రేక్షకులు దాన్ని అనుభూతి చెందుతారు. కచ్చితంగా ఈ చిత్రానికి అవార్డులొస్తాయని నమ్ముతున్నా. కల్యాణ్‌రామ్‌లోని ఓ కొత్త అవతారాన్ని ‘బింబిసార’ సినిమాతో అందరూ చూశారు. కానీ, ఇప్పుడీ చిత్రంతో ఆయన విశ్వరూపాన్ని చూస్తారు. ముఖ్యంగా ద్వితీయార్ధంలో వచ్చే ఓ కీలక ఎపిసోడ్‌లో ఆయన కనబర్చిన నటన అద్భుతంగా అనిపిస్తుంది".

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని