Sekhar Kammula: ఆ ఫీల్‌గుడ్‌ స్టోరీ.. పవన్‌ను దృష్టిలో పెట్టుకుని రాసిందే కానీ..!

ఓ హిట్‌ సినిమా స్టోరీని ప్రముఖ హీరో పవన్‌ కల్యాణ్‌ను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నారు ఆ దర్శకుడు. ఆ ఆసక్తికర సంగతులివీ..

Updated : 12 Mar 2024 10:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫలానా హీరోను దృష్టిలో పెట్టుకుని దర్శక, రచయితలు కథను రెడీ చేసుకోగా పలు కారణాల వల్ల అందులో వేరే హీరో నటించడం చిత్ర పరిశ్రమలో అప్పుడప్పుడూ జరుగుతుంటుంది. ఇలా వచ్చిన కొన్ని సినిమాలు ఊహించని విజయం అందుకున్నాయి, మరికొన్ని పరాజయం పొందాయి. ఈ జాబితాలో నిలిచిన ఓ హిట్‌ చిత్రం గురించి ఆసక్తికర విషయం తెలుసుకుందాం. ఆ మూవీ మరేదో కాదు ‘ఆనంద్‌: మంచి కాఫీలాంటి సినిమా’ (Anand).

చదువు పూర్తి కాగానే అమెరికా వెళ్లిన శేఖర్‌ కమ్ముల (Sekhar Kammula) సినిమాపై ఆసక్తితో ఉద్యోగానికి రాజీనామా చేసి, ఫిల్మ్‌ మేకింగ్‌ కోర్సులో చేరిన సంగతి తెలిసిందే. తన అనుభవాన్ని రంగరించి రాసుకున్న తొలి స్క్రిప్టు ‘డాలర్‌ డ్రీమ్స్‌’. తెలుగు, ఇంగ్లిష్‌లో రూపొందిన ఆ సినిమా కమర్షియల్‌గా హిట్‌ కాలేదుగానీ ‘బెస్ట్‌ డెబ్యూ డైరెక్టర్‌’గా శేఖర్‌కు జాతీయ అవార్డు అందించింది. వసూళ్లపరంగాను విజయం సొంతం చేసుకోవాలనే కసితో తదుపరి ప్రయత్నంగా ‘ఆనంద్‌’ స్టోరీని రాసుకున్నారు. పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan)ను దృష్టిలో పెట్టుకునే ఈ కథను సిద్ధం చేశానని, కానీ ఆయన్ను సంప్రదించలేదని శేఖర్‌ ఓ సందర్భంలో తెలిపారు. ఎందుకు మీట్‌ అవలేదనే విషయాన్ని ప్రస్తావించలేదు. అలా పవన్‌ను ఊహించుకుని రాసుకున్న ఆ స్టోరీలో.. అప్పటికి మూడు సినిమాల అనుభవం ఉన్న రాజా (Raja Abel) ‘ఆనంద్‌’గా నటించి మంచి క్రేజ్‌ తెచ్చుకున్నారు. హీరోయిన్‌గా ముందుగా అసిన్‌, సదాను అనుకున్నా చివరకు ఆ అవకాశం కమలినీ ముఖర్జీ (Kamalinee Mukherjee)కి దక్కింది.

చిరంజీవి నటించిన ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’ రిలీజ్‌ డేట్‌నే ‘ఆనంద్‌’ టీమ్‌ కూడా ఫిక్స్‌ చేసుకోవడం అప్పట్లో హాట్‌ టాపిక్‌. 2004 అక్టోబరు 15న బాక్సాఫీసు ముందుకొచ్చిన ఈ రెండు చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. మరోవైపు, పవన్‌పై ఉన్న అభిమానంతో ఆయనతో సినిమా చేసేందుకు శేఖర్‌ ఆసక్తి చూపిస్తున్నారని, ‘లీడర్‌ 2’ను పవన్‌ హీరోగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారంటూ గతంలో జోరుగా ప్రచారం సాగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని