Jagapathi Babu: జగపతి బాబుకు ‘విలన్‌’ అవకాశం తెచ్చి పెట్టిందదే!

నటుడు జగపతి బాబు పుట్టిన రోజు నేడు. సందర్భంగా ఆయనకు విలన్‌గా అవకాశం తెచ్చిపెట్టిందేదో చూద్దామా..

Updated : 12 Feb 2024 14:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విలన్‌గా కెరీర్‌ ప్రారంభించి, హీరోగా స్థిరపడిన వారు చాలామంది ఉన్నారు. కథానాయకుడిగా రాణించి, ప్రతినాయకుడిగా మారిన వారు ఇండస్ట్రీలో అరుదుగా కనిపిస్తారు. జగపతి బాబు (Jagapathi Babu) ఈ రెండో జాబితాలోకి వస్తారు. హీరోగా ఎన్నో వైవిధ్యభరిత పాత్రల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా దగ్గరైన ఆయన ‘లెజెండ్‌’ (Legend)తో విలన్‌గా సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. మరి, ఆయనకు ప్రతినాయకుడిగా అవకాశం తెచ్చిపెట్టిందేదో మీకు తెలుసా..? నేడు జగపతి బాబు పుట్టినరోజు సందర్భంగా ఆ సంగతి చూద్దాం..

‘ఇమేజ్‌’ అనే చట్రంలో ఉండడం నచ్చని నటుల్లో ఈయన ఒకరు. ‘‘నేను హీరోని.. హీరో క్యారెక్టర్లే ప్లే చేస్తా. వేరే పాత్రలు పోషించను’ అని అనుకుంటే జైల్లో ఉన్నట్లే ఉంటుంది’’ అని ఆయనే ఓ సందర్భంలో చెప్పారు. ‘ఇక కథానాయకుడిగా చేసింది చాలు.. కథాబలమున్న చిత్రాల్లో మంచి పాత్ర వచ్చినా చేద్దాం’ అని ఫిక్స్‌ అయిన తరుణంలో ఆయా అవకాశాల కోసం ఎంతో ఆశగా ఎదురుచూశారు. ఎంతకీ ఛాన్స్‌లు రాకపోవడంతో కొన్ని నెలలు ఖాళీగా ఉన్నారు. ఆ విషయం తెలిసిన కొందరు చులకనగా చూసేవారట. అదే సమయంలో ‘సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌’ లుక్‌లో ఫొటోషూట్‌లో పాల్గొని, వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అవి దర్శకుడు బోయపాటి శ్రీను దృష్టిని ఆకర్షించాయి. దాంతో, ‘లెజెండ్‌’లో విలన్‌ పాత్రకు బాగా సెట్‌ అవుతారనే ఉద్దేశంతో జగపతి బాబును సంప్రదించారు. ఆయనకు స్క్రిప్టు నచ్చడంతో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. విలన్‌గా తొలి ప్రయత్నమే అయినా నేను ఆశించిన దానికి రెట్టింపు పారితోషికం ఇచ్చారని జగపతి బాబు ఓ సందర్భంలో గుర్తుచేసుకున్నారు. ఆ ఫొటోషూట్‌ ఐడియా ఇచ్చిన వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పారు.

బాలకృష్ణ హీరోగా రూపొందిన ఆ చిత్రం బాక్సీఫీసు వద్ద ఘన విజయం అందుకుంది. జగపతి కెరీర్‌ టర్న్‌ అయింది. ఆ తర్వాత విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఫుల్‌ బిజీ అయ్యారాయన. ‘శ్రీమంతుడు’, ‘నాన్నకు ప్రేమతో’, ‘రంగస్థలం’, ‘మహర్షి’, ‘అఖండ’, ‘సలార్‌’ వంటి హిట్‌ చిత్రాల్లో భాగమయ్యారు. ‘మంచి మనుషులు’ సినిమాతో బాలనటుడిగా తెరంగేట్రం చేసి.. ‘సింహ స్వప్నం’ (1989)తో హీరోగా మారారు. ‘శుభాకాంక్షలు’, ‘శుభలగ్నం’, ‘పెళ్లి పందిరి’, ‘మావిడాకులు’, ‘పెళ్లి పీటలు’ తదితర ఫ్యామిలీ చిత్రాలతోపాటు ‘మనోహరం’, ‘గాయం’ వంటి  యాక్షన్‌ సినిమాల్లో నటించి మెప్పించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని