Jayamalini: జయమాలిని కోసం కత్తితో బెదిరింపు!

సినీ తారలను చూసేందుకు జనం విరగబడి రావడం, వారితో సెల్ఫీల కోసం పోటీ పడటం మనం చూస్తుంటాం. సరిగ్గా ఇలాంటి పరిస్థితే అలనాటి నృత్యతార జయమాలినికి (Jayamalini) ఎదురైందట.

Published : 15 Feb 2024 12:29 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఏదైనా కార్యక్రమానికి సినీ తారలు వస్తున్నారంటే వారిని చూసేందుకు ఎగపడిపోతారు అభిమానులు. తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమయ్యే నూతన వస్త్ర దుకాణాలను ఆరంభించేందుకు వచ్చే తారలను చూసేందుకు కూడా జనం విరగబడి రావడం, వారితో సెల్ఫీల కోసం పోటీ పడటం మనం చూస్తుంటాం. సరిగ్గా ఇలాంటి పరిస్థితే అలనాటి నృత్యతార జయమాలినికి (Jayamalini) ఎదురైందట.

అప్పట్లో ఐటమ్‌ సాంగ్స్‌ అంటే జ్యోతిలక్ష్మి, జయమాలిని, సిల్క్‌స్మిత. వెండితెరపై వారు కాలు కదిపితే, థియేటర్లు ఈలలు, చప్పట్లతో మార్మోగిపోయేవి. మరి అలాంటి తారలు బయట కనిపిస్తే సాధారణ ప్రేక్షకులు, అభిమానులు ఊరుకుంటారా? వారిని చూసి ఈలలు వేయడం, దుర్భాషలతో అభిమానం చూపిస్తారు. అందుకనే జ్యోతిలక్ష్మి, జయమాలిని, సిల్క్‌స్మిత, విజయలలితలాంటి వాళ్లు షూటింగులకే పరిమితమయ్యేవారు. బయటకు పెద్దగా వచ్చేవారు కాదు. కానీ, ఒకసారి జయమాలిని, ఒక ఊళ్లో నాట్య ప్రదర్శనకి వచ్చారు. అయితే, అది సినిమా నాట్యం కాదు. వెనక వరుసల్లో కూచున్న వాళ్లంతా ఆ నాట్యం అక్కర్లేదని గోల గోల చేశారు. దీంతో జయమాలిని తన ‌రూమ్‌కి వెళ్లిపోయారు. అది గమనించిన జనం అక్కడికి పరుగెత్తారు. అంతలో ఒకాయన జనం మధ్యలో దూరి, కేకలు వేస్తూ కత్తి తీశాడు! జనం ఆశ్చర్యపోయారు.

‘ఎవరూ ముందుకు రాకండి. నేను జయమాలిని ‌రూమ్‌కి వెళతాను. వెనకాల వచ్చారా పొడిచి చంపేస్తాను’ అని జయమాలిని ఉన్న గదిలోకి చొచ్చుకు వెళ్లిపోయాడు. జయమాలిని, చుట్టూ ఉన్నవాళ్లూ అదిరిపోయి, కేకలు వేశారు. ‘ఏం భయం లేదు. ఎవర్నీ ఏమీ చెయ్యను. జయమాలిని గారూ! మిమ్మల్ని బాగా దగ్గరగా చూడాలన్న కోరికతో, కత్తి తీసుకొచ్చి జనాల్ని అదుపులో పెట్టాను. కొంచెం నా దగ్గరగా రండి.. ఆఁ.. చూశాను చాలు!’ అని, మళ్లీ కత్తి ఊపుకొంటూ వెళ్లిపోయాడు. అంతలో పోలీసులు, ప్రదర్శన ఏర్పాటు చేసిన వాళ్లూ వచ్చి, జనాల్ని పంపించేసి, జయమాలినిని నిదానంగా దొడ్డిదారిని తీసుకెళ్లి కారు ఎక్కించారు. ‘‘అంతే! ఆ తర్వాత ఎప్పుడూ, ఏ ఊరూ వెళ్లలేదు, ప్రదర్శనలూ ఇవ్వలేదు. షూటింగ్‌లు స్టూడియోల్లో ఉంటేనే ఒప్పుకొనేదాన్ని’’ అని ఓ సందర్భంలో జయమాలిని చెప్పుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని