Pokiri: పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..

మహేష్‌బాబు, పూరి జగన్నాథ్‌ల కాంబినేషన్‌కు సినీ ప్రియుల్లో మంచి క్రేజ్‌ ఉంది. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘పోకిరి’, ‘బిజినెస్‌మెన్‌’ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం  కురిపించాయి.

Updated : 28 Apr 2024 14:31 IST

మహేష్‌బాబు, పూరి జగన్నాథ్‌ల కాంబినేషన్‌కు సినీ ప్రియుల్లో మంచి క్రేజ్‌ ఉంది. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన ‘పోకిరి’, ‘బిజినెస్‌మెన్‌’ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షం  కురిపించాయి. ముఖ్యంగా ‘పోకిరి’ చిత్రం అప్పట్లో వసూళ్ల పరంగా తెలుగు చిత్రసీమలో సరికొత్త రికార్డులు సృష్టించింది. రూ.10కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం.. రూ.70కోట్ల గ్రాస్‌తో రూ.40కోట్ల షేర్‌ సాధించి ఆల్‌ టైం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. మహేష్‌, పూరిల సినీ కెరీర్‌కు ఇంతటి అపురూప విజయాన్ని అందించిన ఈ చిత్రం విడుదలై నేటికి(ఏప్రిల్‌ 28) 18 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఈ సినిమా వెనుక కొన్ని ఆసక్తికర విషయాలున్నాయి.

ఆ హీరో కోసం కథ రాసుకున్న పూరి

దర్శకుడు పూరి జగన్నాథ్‌ ఈ చిత్రాన్ని మహేష్‌బాబుతో కలిసి 2006లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.  వాస్తవానికి ఆయన ఈ కథను రాసుకుంది మాత్రం అంతకు ఆరేళ్ల ముందుగానే. పూరి తన తొలి చిత్రం ‘బద్రి’ కన్నా ముందే ఈ చిత్ర స్క్రిప్ట్‌ను రాసుకున్నారట. తొలుత ఈ కథకు హీరోలుగా పవన్‌కల్యాణ్‌, రవితేజలను కూడా అనుకున్నారు. ఈ చిత్రాన్ని ‘ఉత్తమ్‌ సింగ్‌.. సన్నాఫ్‌ సూర్య నారాయణ’ అనే టైటిల్‌తో తెరపైకి తీసుకొద్దామని అనుకున్నారు. అనుకోని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. తర్వాత కొన్నాళ్లకు ఈ కథ మహేష్‌ దగ్గరకు చేరింది. ఆయన ఈ స్క్రిప్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చాక.. పూరి కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి దాన్ని ‘పోకిరి’గా మార్చారు.

కథానాయికగా ఎంపికైన కంగన

మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో కథానాయిక పాత్రకి తొలుత అనుకున్నది అయేషా టకియాని. కొన్ని కారణాల వల్ల ఆమె ఈ పాత్రను వదులుకుంది. తర్వాత ఆ అవకాశాన్ని  కంగనా రనౌత్‌ దక్కించుకుంది. ఈ చిత్ర ఆడిషన్స్‌ ముంబయిలో జరుగుతున్న సమయంలో.. అక్కడే బాలీవుడ్‌ చిత్రం ‘గ్యాంగ్‌స్టర్‌’కూ ఆడిషన్స్‌ జరిగాయట. దీంట్లో పాల్గొనడానికి వచ్చిన కంగన.. పనిలో పనిగా ‘పోకిరి’ చిత్రానికీ ఆడిషన్స్‌ ఇచ్చింది. అదృష్టమో, దురదృష్టమో తెలియదు కానీ, కంగనాకు ఈ రెండు చిత్రాల్లోనూ అవకాశం దక్కింది. అయితే వీటిలో ఏదో ఒక దాన్నే చేయాల్సి రావడంతో ఆమె ‘పోకిరి’ని వదులుకుంది. దీంతో ఆ అవకాశం కాస్తా ఇలియానాకు దక్కింది.

అలా కనిపించడం అదే తొలిసారి..

‘పోకిరి’ ముందు వరకు మహేష్‌బాబు చేసిన అన్ని సినిమాల్లోనూ ఆయన లుక్‌ దాదాపు ఒకేలా ఉండేది. లైట్‌ హెయిర్‌, క్లీన్‌ షేవ్‌తో బాలీవుడ్‌ హీరోలా క్లాస్‌గా దర్శనమిచ్చేవారు. ‘పోకిరి’ చిత్రంతో మహేష్‌ను తొలిసారి ఊర మాస్‌ యాంగిల్‌లో చూపించారు పూరి. ఆయన మహేష్‌కు కథ చెబుతున్నప్పుడే జుత్తు బాగా పెంచాలి.. లైట్‌గా మీసం, గెడ్డంతో ఉండాలని చెప్పేశారట. దీనికి తగ్గట్లుగానే మహేష్‌ ‘అతడు’ చిత్రం తర్వాత వచ్చిన నాలుగు నెలల విరామాన్ని దీనికోసం వినియోగించుకున్నారట. జుత్తు కత్తిరించుకోకుండా సరికొత్త లుక్‌లోకి మారారు ఆయన. ఈ చిత్రంలో ఆయన డ్రెస్సింగ్‌ స్టైల్‌ అప్పట్లో కొత్త ట్రెండ్‌ అయింది. ఇక పూరి రాసిన సంభాషణలు మహేశ్‌ చెబుతుంటే చిన్నా పెద్దా తేడాలేకుండా అందరికీ నరనరాల్లోకి ఎక్కేశాయి. దానితోడు మణిశర్మ పాటలు ఓ ఊపు ఊపేశాయి. అప్పటికీ, ఇప్పటికీ ఎప్పటికీ టీవీ వచ్చిన ప్రతిసారి ‘పోకిరి’ ప్రసారమవుతుంటే ఛానల్‌ మార్చకుండా చూసేవాళ్లు కచ్చితంగా ఉన్నారు.. ఉంటారు..! దటీజ్‌ ‘పండుగాడు’

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు