Ghajini Movie: హిందీ ‘గజనీ’.. మురుగదాస్‌ ఫస్ట్‌ ఛాయిస్‌ సల్మాన్‌

ఆమిర్‌ నటించిన ‘గజనీ’మూవీకి సంబంధించి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు నటుడు ప్రదీప్‌ రావత్‌

Published : 19 May 2024 17:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆమిర్‌ఖాన్‌ కథానాయకుడిగా మురగదాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గజనీ’ (Ghajini Movie). తమిళంలో సూర్య నటించిన ఈ మూవీని హిందీలోనూ అదే పేరుతో తీసి బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్నారు. అంతేకాదు, రూ.100 కోట్లు సాధించిన తొలి బాలీవుడ్‌ సినిమా గానూ ‘గజనీ’ రికార్డు సృష్టించింది. అయితే, ఈ సినిమాలో కథానాయకుడిగా తొలుత సల్మాన్‌ఖాన్‌ను అనుకున్నారట దర్శకుడు మురగదాస్‌. ఇందులో ప్రతినాయకుడిగా నటించిన ప్రదీప్‌ రావత్‌ సూచన మేరకు ఆమిర్‌ను తీసుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆ విషయాన్ని ప్రదీప్‌ రావత్‌ వెల్లడించారు.

‘‘గజనీ’ మూవీని హిందీలో చేస్తా’ అని మురగదాస్‌ అంటూ ఉండేవారు. సల్మాన్‌ఖాన్‌ హీరోగా తీయాలన్నది ఆయన ప్లాన్‌. అయితే, అది సరైన ఎంపిక కాదన్నది నా అభిప్రాయం. ఎందుకంటే సల్మాన్‌కు కాస్త కోపం ఎక్కువ. పైగా మురగదాస్‌ హిందీ, ఇంగ్లిష్‌లో మాట్లాడలేరు. పెద్ద పర్సనాలిటీ కూడా కాదు. అప్పటికే నేను ‘సర్ఫరోష్‌’ వంటి చిత్రాల్లో ఆమిర్‌తో పనిచేసిన అనుభవం ఉంది. ఎప్పుడూ కూల్‌గా ఉండే ఆయన సరైన ఎంపిక అనిపించింది. ఆమిర్‌ఖాన్‌ సెట్స్‌లో అరవడం, కేకలు వేయడం నేనెప్పుడూ చూడలేదు. ఎవరూ అలాంటి ఆరోపణ చేసిన సందర్భం కూడా లేదు. ప్రతి ఒక్కరితోనూ మర్యాదగా నడుచుకుంటారు. అసభ్య పదజాలం అస్సలు వాడరు. సల్మాన్‌ను ఎంపిక చేసుకుంటే లేనిపోని ఇబ్బందులు వస్తాయి’’ అని మురుగదాస్‌తో చెప్పాను అంటూ ఆనాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. ఆర్నెల్ల పాటు ఆమిర్‌ వెంట పడటంతో ఎట్టకేలకు తమిళ ‘గజనీ’ చూసి, మరో ఆలోచన లేకుండా హిందీలో రీమేక్‌ చేయడానికి అంగీకరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని