Cinema news: ‘బాక్‌’.. వారం వెనక్కి

సుందర్‌. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘బాక్‌’. ఖుష్బు సుందర్‌, ఏసీఎస్‌ అరుణ్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మించారు.

Updated : 20 Apr 2024 12:17 IST

సుందర్‌. సి ప్రధాన పాత్రలో నటిస్తూ స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘బాక్‌’. ఖుష్బు సుందర్‌, ఏసీఎస్‌ అరుణ్‌ కుమార్‌ సంయుక్తంగా నిర్మించారు. తమన్నా, రాశీ ఖన్నా కథానాయికలు. వెన్నెల కిశోర్‌, కోవై సరళ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 26న విడుదల కావాల్సి ఉండగా ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మే 3కి వాయిదా వేశారు. ఈ విషయాన్ని చిత్ర బృందం శుక్రవారం ప్రకటించింది. విజయవంతమైన హారర్‌ కామెడీ ఫ్రాంచైజీ ‘అరణ్మనై’ నుంచి వస్తున్న 4వ చిత్రమిది.  ఈ సినిమాకి సంగీతం: హిప్‌హాప్‌ తమిళ, ఛాయాగ్రహణం: ఇ.కృష్ణమూర్తి అకా కిచ్చ.  


మట్టి నుంచి పుట్టిన... ‘పొట్టేల్‌’

 

మా ‘పొట్టేల్‌’ గొప్ప స్ఫూర్తిని పంచుతుందన్నారు యువచంద్ర కృష్ణ. ఆయన కథానాయకుడిగా... సాహిత్‌ మోత్కూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. అనన్య నాగళ్ల కథానాయిక. నిశాంక్‌ రెడ్డి కుడితి, సురేశ్‌ కుమార్‌ సడిగే నిర్మాతలు. ఇటీవల హైదరాబాద్‌లో టీజర్‌ని విడుదల కార్యక్రమం జరిగింది. ప్రముఖ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ‘‘సాహిత్‌తో నాకు నాలుగేళ్లుగా పరిచయం ఉంది. ఈ కథని నాకు ఫోన్‌లో వినిపించాడు. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ తరహా సినిమాల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది’’ అన్నారు. యువచంద్ర కృష్ణ మాట్లాడుతూ ‘‘మన మట్టి నుంచి పుట్టిన కథతో రూపొందిన చిత్రమిది. స్క్రీన్‌ప్లేలోని మ్యాజిక్‌ ప్రేక్షకుల్ని అబ్బుర పరుస్తుంది’’ అన్నారు. మా కెరీర్‌లోనే అత్యుత్తమ సినిమా అవుతుందన్నారు అనన్య. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఈ సినిమా విషయంలో మేమంతా గర్వపడుతున్నాం. మమ్మల్ని ప్రోత్సహిస్తున్న సందీప్‌ రెడ్డి, ప్రణయ్‌ రెడ్డికి కృతజ్ఞతలు’’ అన్నారు.


తరుణ్‌.. ఈషా.. ఓ సినిమా

గతేడాది ‘కీడా కోలా’ సినిమాతో నటుడిగా.. దర్శకుడిగా ప్రేక్షకుల్ని మెప్పించారు తరుణ్‌ భాస్కర్‌. ఇప్పుడాయన ప్రధాన పాత్రలో సజీవ్‌ ఏఆర్‌ ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. సృజన్‌ యరబోలు, వివేక్‌ కృష్ణని, సాధిక్‌, ఆదిత్య పిట్టీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈషా రెబ్బా కథానాయిక. బ్రహ్మాజీ, శివన్నారాయణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాని ఈషా పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు తరుణ్‌, ఈషా కలిసి ఉన్న సెట్లోని ఫొటోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ చిత్ర తొలి షెడ్యూల్‌ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో శరవేగంగా జరుగుతోంది. అక్టోబరులో సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జై క్రిష్‌, ఛాయాగ్రహణం: దీపక్‌ యెరగరా.


ఓటుకు ‘లక్ష్మీ కటాక్షం’!

సాయికుమార్‌ ప్రధాన పాత్రలో సూర్య తెరకెక్కించిన చిత్రం ‘లక్ష్మీ కటాక్షం’. ఫర్‌ ఓట్‌.. అన్నది ఉపశీర్షిక. దీన్ని యు.శ్రీనివాసుల రెడ్డి, బి.నాగేశ్వర రెడ్డి, వహీద్‌ షేక్‌, కె.పురుషోత్తం రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. వినయ్‌, అరుణ్‌, దీప్తి వర్మ, చరిష్మా శ్రీకర్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను ఇటీవల విడుదల చేశారు. ఇందులో సాయికుమార్‌ రాజకీయ నాయకుడిగా కనిపించనున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల తేదీనే ట్రైలర్‌లో ప్రకటిస్తూ ఈ ప్రచార చిత్రం ఆసక్తికరంగా మొదలైంది. తన పాతికేళ్ల రాజకీయ జీవితాన్ని నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో ఆ ఎన్నికల్ని ఎంతో ప్రత్యేకంగా తీసుకుంటాడు సాయికుమార్‌. ఆయన తన నియోజక వర్గంలోని రెండు లక్షల మంది ఓటర్లను తనవైపు తిప్పుకునేందుకు ఓటుకు రూ.5000 చొప్పున రూ.100కోట్లు పంచాలని నిర్ణయించుకుంటాడు. అయితే మరోవైపు దాన్ని అడ్డుకునేందు ఓ నిజాయతీ గల పోలీసు ప్రయత్నిస్తుంటాడు. మరి ఈ నేపథ్యంలో కథలో జరిగిన పరిణామాలేంటి?అన్నది ఆసక్తికరం. ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని