MAA Elections: 10న గెలిచాక మొదట విష్ణుకే ఫోన్‌ చేస్తా! మంచు ఫ్యామిలీపై ప్రకాశ్‌రాజ్‌ సెటైర్లు

‘మా’ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంచు కుటుంబంపై ప్రకాశ్‌ రాజ్‌ విమర్శలు గుప్పించారు. కొన్ని కుటుంబాలకే పెత్తనం కావాలని మోహన్‌బాబు.......

Published : 05 Oct 2021 01:40 IST

హైదరాబాద్‌: ‘మా’ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంచు కుటుంబంపై ప్రకాశ్‌ రాజ్‌ విమర్శలు గుప్పించారు. కొన్ని కుటుంబాలకే పెత్తనం కావాలని మోహన్‌బాబు అన్నారన్నారు. ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌, చిరు కుటుంబాల్లో పుట్టకపోవడం నా తప్పా? అని ప్రశ్నించారు. ‘‘మా’ సభ్యుడిగా నాకు పోటీచేసే హక్కు లేదా? ‘మా’ నాయకత్వం కొన్ని కుటుంబాలకే ఉండాలా? నాకు ఇక్కడే ఇల్లు ఉంది.. ఆధార్‌ కార్డూ ఉంది. నేను ఇక్కడ వ్యవసాయం కూడా చేస్తున్నా. సీఎం జగన్‌ తన బంధువని విష్ణు చెబుతున్నారు. జగన్‌.. విష్ణు ఒక్కరికే కాదు.. ఏపీ మొత్తానికి సీఎం కదా! మా ఎన్నికల్లోకి జగన్‌ను ఎందుకు లాగుతున్నారు? కేటీఆర్‌ నాకూ స్నేహితుడే నేను చెప్పుకోవట్లేదు’’ అన్నారు.

గెలిచాక మొదటి ఫోన్‌ విష్ణుకే చేస్తా

‘‘కరోనా మహమ్మారితో నెలకొన్న సంక్షోభం సమయంలో చిరంజీవి సినీ పరిశ్రమకు ఎంతో సాయం చేశారు. మంచు కుటుంబం పరిశ్రమకు ఏం చేసింది. సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు ఇప్పటికీ.. ఎప్పటికీ చిరు అన్నయ్యే. ప్రభాస్‌, ఎన్టీఆర్‌, రాంచరణ్‌.. సినీ పరిశ్రమకు ఆస్తులు. పవన్‌ కల్యాణ్‌ సినీ పరిశ్రమకు పెద్ద నిధి. నా పాత వివాదాలను ఇప్పుడు ప్రచారంలోకి తెస్తున్నారు. వివాదాలు సమసిపోయినా ఇంకా ఎందుకు ప్రస్తావన? ఈ నెల 10న గెలిచాక మొదటి ఫోన్‌ విష్ణుకే చేస్తా. ‘మా’ భవన నిర్మాణానికి విష్ణు సాయం కూడా తీసుకుంటా’’ అని ప్రకాశ్‌ రాజ్‌ వ్యాఖ్యానించారు. మా సభ్యులకు మంచి చేయడంతోపాటు ఇన్నాళ్లు మా అసోసియేషన్ ప్రతిష్ఠను దెబ్బతీసిన పెద్దలను ప్రశ్నించేందుకు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు  ప్రకాశ్‌రాజ్‌ వివరించారు.

అందుకే అలా స్పందించా!

‘విష్ణు ఒకటి గుర్తు పెట్టుకో... పవన్‌కల్యాణ్‌ మార్నింగ్‌ షో కలెక్షన్స్ అంత ఉండదు నీ సినిమా బడ్జెట్‌’ అంటూ ఇటీవల మంచు విష్ణుపై తాను చేసిన వ్యాఖ్యల గురించి తాజాగా నటుడు ప్రకాశ్‌రాజ్‌ స్పందించారు. వ్యక్తిగతంగా విష్ణుతో తనకి మంచి సంబంధాలున్నాయని.. ఎన్నికల బరిలోకి దిగిన తర్వాత కూడా ప్రతిఒక్కరూ మర్యాదగానే వ్యవహరించాలని అన్నారు. తనపై నరేశ్‌, విష్ణు టీమ్‌ సభ్యులు వ్యాఖ్యలు చేయడం వల్లే.. తాను ఆరోజు ఫైర్‌ అవ్వాల్సి వచ్చిందని చెప్పారు.

‘‘విష్ణుతో నాకు మంచి సంబంధాలున్నాయి. నన్ను ‘అంకుల్‌’ అని పిలుస్తుంటాడు. మేమిద్దరం బాగానే మాట్లాడుకుంటాం. మంచు విష్ణు కూడా ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడని తెలిసిన తర్వాత.. నేను అతనికి ఫోన్‌ చేసి మాట్లాడాను. ‘ఎన్నికల బరిలో ఉన్నాం కాబట్టి.. ఎవరి అజెండాలను వాళ్లు ప్రమోట్‌ చేసుకుందాం. వ్యక్తిగత విషయాలు, విమర్శల జోలికి వెళ్లొద్దు’ అని చెప్పాను. దానికి అతను ఓకే అన్నాడు. కానీ ఇటీవల మంచు విష్ణు - నరేశ్‌ కలిసి ప్రెస్‌మీట్‌ పెట్టారు. అందులో నన్ను, నా ప్యానల్‌లోని సభ్యుల్ని కించపరిచేలా నరేశ్‌, మరి కొంతమంది మాట్లాడారు. మరికొన్నిరోజుల్లో ఎన్నికలు జరుగుతుండగా వాళ్లు ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేమిటి? అదీ కాకుండా.. ‘నువ్వు ఇండస్ట్రీ సైడ్‌ ఉన్నావా? పవన్‌కల్యాణ్‌ సైడ్‌ ఉన్నావా? చెప్పాలి’ అంటూ వాళ్లు చేసిన వ్యాఖ్యలు నాకు నచ్చలేదు. పవన్‌కల్యాణ్‌ కూడా ఈ ఇండస్ట్రీలో సభ్యుడే. సినీనటుడి తర్వాతే ఆయన రాజకీయ నాయకుడు అయ్యాడు. వాళ్ల వ్యాఖ్యలను తిప్పి కొట్టడం కోసమే ఆరోజు మంచు విష్ణుపై కామెంట్‌ చేశాను’ అని ప్రకాశ్‌రాజ్‌ వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని