Prithviraj Sukumaran: రెండు ఆఫర్లు ఇచ్చిన చిరంజీవి.. తిరస్కరించిన పృథ్వీరాజ్‌ సుకుమారన్‌.. కారణమదే

చిరంజీవి ఇచ్చిన రెండు ఆఫర్లను ఓ సినిమా కారణంగా తిరస్కరించాల్సి వచ్చిందని మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ తెలిపారు.

Published : 20 Mar 2024 10:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొందరు అగ్ర హీరోలు తమ సినిమాల్లోని కీలక పాత్రకు ఫలానా నటుడైతేనే న్యాయం చేస్తారని భావిస్తారు. ఎలాగైనా వారితో నటింపజేసేందుకు ప్రయత్నిస్తారు. కానీ, కొన్ని సందర్భాల్లో అది వీలుపడదు. ఎవరినైతే యాక్ట్‌ చేయించాలని అనుకుంటారో వారు అప్పటికే ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండడంతో డేట్స్‌ ఖాళీ లేక వచ్చిన అవకాశాన్ని సున్నితంగా తిరస్కరిస్తారు. ఇలా జరగడం అన్ని చిత్ర పరిశ్రమల్లో సాధారణమేగానీ దాదాపు నాలుగేళ్ల తర్వాత.. అదే హీరో అదే నటుడికి మరో ఆఫర్‌ ఇవ్వగా.. ఆ యాక్టర్‌ తొలుత ఏ ప్రాజెక్టు వల్ల తిరస్కరించారో రెండోసారి కూడా అదే మూవీ వల్ల ‘నో’ చెప్పడమనేది అరుదు. టాలీవుడ్‌ ప్రముఖ హీరో చిరంజీవి (Chiranjeevi) తన సినిమాల కోసం మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ (Prithviraj Sukumaran)ను సంప్రదించగా ఆయన తిరస్కరించారు. నాటి సంగతులను పృథ్వీరాజ్‌ తాజాగా పాల్గొన్న ఇంటర్వ్యూలో నెమరువేసుకున్నారు. ఆ విశేషాలివీ..

‘‘హిస్టారికల్‌ ఫిల్మ్‌ ‘సైరా’లో ఓ పాత్ర కోసం చిరంజీవి నన్ను సంప్రదించారు. అందులో నటించాలనే ఆసక్తి ఉన్నా సాధ్యపడలేదు. ‘సర్‌ నేను ఆడుజీవితం అనే లార్జన్‌దేన్‌ లైఫ్‌ సినిమా చేయబోతున్నా. కాల్షీట్లు మొత్తం దానికే కేటాయించా’ అని చెబితే ఆయన పరిస్థితి అర్థం చేసుకున్నారు. కొన్నాళ్ల తర్వాత తాను హీరోగా తెలుగులో ‘లూసిఫర్‌’ రీమేక్‌ను తెరకెక్కించాలని కోరారు. ‘సైరా’ సమయంలో ఏదైతే సమాధానం చెప్పానో ‘లూసిఫర్‌’ విషయంలోనూ నేను అదే చెప్పడంతో ఆయన షాక్‌ అయ్యారు. ఆయన అడిగిన టైమ్‌కి నేను ‘ఆడుజీవితం’ సినిమాకి సంబంధించి వేరే పనుల్లో బిజీగా ఉండేవాణ్ని’’ అని పృథ్వీరాజ్‌ తెలిపారు. చిరంజీవిలానే రామ్‌చరణ్‌ (Ram Charan) జెంటిల్‌మ్యాన్‌ అని పేర్కొన్నారు. విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన పృథ్వీరాజ్‌ ‘లూసిఫర్‌’తో దర్శకుడిగా మారారు. ఈయనకు కుదరకపోవడంతో ఆ చిత్రాన్ని చిరంజీవి హీరోగా ‘గాడ్‌ ఫాదర్‌’ పేరుతో డైరెక్టర్‌ మోహన్‌ రాజా తెలుగులో తెరకెక్కించారు.

బతుకుదెరువు కోసం కేరళ నుంచి సౌదీకి వలసవెళ్లిన నజీబ్‌ అనే వ్యక్తి జీవితాధారంగా దర్శకుడు బ్లెస్సీ తెరకెక్కించిన చిత్రమే ‘ఆడుజీవితం’ (Aadujeevitham). డైరెక్టర్‌ పదహారేళ్ల కల ఇది. ఇందులో బానిస జీవితాన్ని అనుభవించే వలస కూలీగా కనిపించనున్నారు పృథ్వీరాజ్‌. విదేశాలకు వలసవెళ్లిన వ్యక్తులు బతకటం కోసం ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటారు? పాస్‌ పోర్టులు లాక్కొని వారిని బానిసలుగా ఎలా మార్చుకుంటారనేది ఈ సినిమాలో చూపించనున్నారు. 2018లో చిత్రీకరణ ప్రారంభమైనా కొవిడ్‌ ఇతరత్రా కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అమలాపాల్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకురానుంది. ‘ది గోట్ లైఫ్‌’ (The Goat Life) పేరుతో ఇంగ్లిష్‌లో విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు