Rajanala: సిగరెట్‌ కోసం రాజనాల పట్టు.. అసలుకే మోసం..

కొన్నిసార్లు మనం అనుకున్నది జరగకపోగా, మొదటికే మోసం రావచ్చు. పట్టు విడుపులు లేకపోతే ఏం జరుగుతోందో ఈ సంఘటనే ఉదాహరణ.

Published : 22 May 2023 12:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కొన్నిసార్లు మనం అనుకున్నది జరగకపోగా, మొదటికే మోసం రావచ్చు. పట్టు విడుపులు లేకపోతే ఏం జరుగుతోందో ఈ సంఘటనే ఉదాహరణ. అప్పట్లో దాదాపు నటులు, రచయితలు, దర్శకులు సిగరెట్లు కాల్చేవారు. ఎన్‌.టి.ఆర్‌. తప్ప తక్కిన వాళ్లలో చాలామందికి సిగరెట్టు కాల్చే అలవాటు ఉండేది. సినిమా కంపెనీ వాళ్లు మర్యాదకి సిగరెట్లు కూడా ఇచ్చేవారు. ఎవరెవరు ఏ బ్రాండ్‌ కాలుస్తారో, తెలుసుకుని, ఆ బ్రాండ్‌ సిగరెట్‌ ప్యాకెట్‌, అగ్గిపెట్టె పొద్దునే ఇచ్చేవారు. ప్రతినాయకుడిగా తనదైన ముద్రవేసిన రాజనాల (Rajanala) గోల్డ్‌ఫ్లేక్‌ కాల్చేవారు. ఆయన మేకప్‌ రూమ్‌కి వచ్చి కుర్చీలో కూర్చోగానే, ఎదురుగా సిగరెట్టు పెట్టె, అగ్గిపెట్టె కనిపించేవి.

రాజలక్ష్మివారి(సుందర్‌లాల్‌ నహతా, డూండి)బ్యానర్‌లో ఓ సాంఘిక చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. రాజనాల రాగానే ఆయనకు టేబుల్‌పై సిగరెట్టు పెట్టె, అగ్గిపెట్టె కనిపించలేదు. సిగరెట్టు‌ పెట్టె గురించి అడిగారు. ‘ప్రొడక్షన్‌ వాళ్లు ఇంకా కొనుక్కొని రాలేదు. మీరు మేకప్‌ వేసుకోండి. ఈలోగా తీసుకొచ్చేస్తారు’ అని మేకప్‌మేన్‌‌ చెప్పాడు. రాజనాలకు ఒక్కసారిగా ఒళ్లు మండింది. ‘రానీ, వచ్చాకే వేసుకుంటా. అంతవరకూ మేకప్‌ వేసుకోను’ అని భీష్మించుకుని కూర్చొన్నారు. ఈలోగా షూటింగ్‌ మొదలైంది.

‘రాజనాల సెట్‌కు రాలేదేం?’ అని డూండీ అడిగారు. ‘ఆయన ఇంకా మేకప్‌ వేసుకోలేదు. సిగరెట్లు వస్తేగానీ వేసుకోరట’ అని మేకప్‌మేన్‌ సమాధానం ఇచ్చాడు. డూండీకి కోపం నషాళానికి అంటింది. ‘ఏంటీ! సిగరెట్లు ఇవ్వాలన్నది కచ్చితమా? మర్యాదకి ఇస్తున్నాం. దానికి ఇంత పట్టింపా! షూటింగ్‌ ఆపేస్తాడా? ఈరోజు నుంచి మన కంపెనీలో సిగరెట్లు ఎవరికీ ఇవ్వకండి. అదేం రూలు కాదు. రాజనాల గారు పది నిమిషాల్లో వస్తారా? రారా? కనుక్కోండి. ఏ సంగతీ చెప్తే నేను వేరే ఏర్పాటు చేసుకుంటాను’ అని అరిచారు. దాంతో పావుగంటలో రాజనాల సెట్టుకి పరిగెత్తుకొచ్చారు. ‘రాజనాల పుణ్యమా అని మనకి కూడా సిగరెట్లు లేకుండా పోయాయి’ అని తక్కిన వాళ్లు బాధపడ్డారు. సిగరెట్లు ఇవ్వకుండా ఆపేసిన తొలి సంస్థ రాజలక్ష్మివారే. ఆ తర్వాత ఒక్కొక్కరిగా అందరూ ఆపేశారు!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని