Rakesh: ముగింపును.. ప్రతినాయకుణ్ని ఊహించలేరు!

‘‘అన్ని రకాల వాణిజ్యాంశాలతో నిండిన థ్రిల్లర్‌ చిత్రం ‘నేను స్టూడెంట్‌ సార్‌’. ఇందులో ప్రతి ముప్పై నిమిషాలకు ఊహించని మలుపు వస్తుంది’’ అన్నారు రాకేష్‌ ఉప్పలపాటి.

Updated : 28 May 2023 13:28 IST

‘‘అన్ని రకాల వాణిజ్యాంశాలతో నిండిన థ్రిల్లర్‌ చిత్రం ‘నేను స్టూడెంట్‌ సార్‌’. ఇందులో ప్రతి ముప్పై నిమిషాలకు ఊహించని మలుపు వస్తుంది’’ అన్నారు రాకేష్‌ ఉప్పలపాటి. ఇది ఆయనకు దర్శకుడిగా తొలి చిత్రం. బెల్లంకొండ గణేష్‌ కథానాయకుడిగా నటించారు. సతీష్‌ వర్మ నిర్మించారు. ఈ సినిమా జూన్‌ 2న రానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో శనివారం విలేకర్లతో ముచ్చటించారు రాకేష్‌.

‘‘ఈ చిత్రానికి కృష్ణ చైతన్య కథ అందించారు. ఇదొక భిన్నమైన థ్రిల్లర్‌లా ఉంటుంది. దీని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మనకు ఇష్టమైన ఫోన్‌.. అవసరమైన ఐడెంటిటీ.. భయపెట్టే గన్‌.. ఈ మూడింటి చుట్టూ కథ తిరుగుతుంటుంది. అలాగే హీరోకి కమిషనర్‌కు మధ్య గొడవ ఎలా మొదలైంది.. అది ఏ దిశగా సాగిందన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ చిత్ర ముగింపును, విలన్‌ను అసలు ఊహించలేరు. ఇది ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని పంచుతుంది’’.

గౌతమ్‌ మేనన్‌తో చేయాలనుకున్నా..

‘‘ఈ సినిమాలోని కమిషనర్‌ పాత్రకు నేను తొలుత గౌతమ్‌ మేనన్‌ను అనుకున్నా. నిర్మాత సతీష్‌ మాత్రం సముద్రఖని పేరు సూచించారు. అయితే తుది నిర్ణయం మాత్రం నాకే వదిలేశారు. ఎందుకో ఆయన మాట విన్నాక ఈ పాత్రకు సముద్రఖని అన్ని విధాలా బాగుంటారనిపించింది.

‘జాన్‌ విక్‌’.. ‘విక్రమ్‌’ చిత్రాలు గుర్తొస్తాయి!

‘‘ఈ సినిమాకి మేము ఆరంభంలో ‘రింగ్‌’ అనే వర్కింగ్‌ టైటిల్‌ పెట్టుకున్నాం. తర్వాత చరవాణి అనే మరో టైటిల్‌ కూడా అనుకున్నాం. అదే సమయంలో నిర్మాత సతీష్‌ ‘సినిమాలో ఉన్న డైలాగ్‌ ప్రకారం టైటిల్‌ పెడదాం’ అన్నారు. దాంతో ‘నేను స్టూడెంట్‌ సార్‌’ అనే పేరు ఖరారు చేశాం’’.

‘‘మాది భీమడోలు పక్కన యం.నాగులపల్లి. నాన్న వ్యాపారం నిమిత్తం సుకుమార్‌ ఊరు పక్కన ఉన్న తాటిపాకకు మారాం. మధ్యతరగతి కుర్రాళ్లకు ఓ గుర్తింపు సాధించుకోవాలన్న తపన ఉంటుంది. నేనూ అదే తపనతో గుర్తింపు కోసం సినిమాల్లోకి వచ్చా. గోగినేని శ్రీనివాస్‌ నిర్మాణంలో ‘చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి’ చిత్రానికి పని చేశా. ఆ తర్వాత దర్శకుడు తేజ దగ్గర సహాయకుడిగా చేరా. ‘నీకు నాకు డాష్‌ డాష్‌’ నుంచి ‘అహింస’ స్క్రిప్ట్‌ వర్క్‌ వరకు ఆయనతో కలిసి పని చేశా. ఇప్పుడీ చిత్రంతో దర్శకుడిగా మారా. తదుపరి సినిమాని సతీష్‌ నిర్మాణంలోనే చేయనున్నా’’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని