Soggadu Movie: రవిబాబు మూవీకి నో చెప్పిన ఉదయ్‌కిరణ్‌.. కోపంతో నిర్ణయం తీసుకోవడం వల్లే..!

Soggadu Movie: ‘సోగ్గాడు’కి క్యాస్ట్‌ ఫెయిల్యూర్‌ కారణంగా మూవీపై ఎలాంటి ప్రభావం పడిందో రవిబాబు ఓ సందర్భంలో చెప్పారు.

Published : 28 Feb 2024 09:30 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒకరితో అనుకున్న సినిమాలను వివిధ కారణాల వల్ల వేరొకరితో చేయాల్సి వస్తుంది. ఈక్రమంలో కథ మారితే ఆ సినిమా హిట్‌ అవ్వవచ్చు.. లేదా ఫ్లాప్‌ అవ్వవచ్చు. అయితే, దర్శకుడు రవిబాబు కోపంతో తీసుకున్న నిర్ణయం కారణంగా ఫ్లాప్‌ను చవిచూడాల్సి వచ్చింది. అదే ‘సోగ్గాడు’ మూవీ. తరుణ్‌, ఆర్తి అగర్వాల్‌, జుగల్ హన్సరాజ్‌ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.

రవిబాబు ఈ మూవీని తరుణ్‌, ఉదయ్‌కిరణ్‌లతో తీద్దామనుకున్నారు. కానీ, కుదరలేదు. కథ విన్న తర్వాత తరుణ్‌, ఆర్తి అగర్వాల్‌ ఇద్దరూ ఓకే చెప్పారు. కానీ, ఉదయ్‌ మాత్రం డైలమాలో ఉండిపోయాడట. రవిబాబు స్వయంగా చెన్నై వెళ్లి ఉదయ్‌ను అడిగితే ‘సినిమా చేస్తా’నని చెప్పాడట. తీరా నిర్మాత సురేష్‌బాబును కలిసిన తర్వాత ‘నేను చేయడం లేదు’ అని చెప్పడంతో ఇద్దరూ ఆశ్చర్యపోయారు. దీంతో కోపం వచ్చిన రవిబాబు హిందీ నుంచి జుగల్‌ హన్సరాజ్‌ను తీసుకొచ్చి ఉదయ్‌ చేయాల్సిన చందు పాత్ర అతనితో చేయించారు. తన కెరీర్‌లో ఈగోకు పోయి, ఆ నిర్ణయం తీసుకున్నానని, మళ్లీ అలా ఎప్పుడూ చేయలేదని, కష్టమైనా, నష్టమైనా ఉదయ్‌తో చేయాల్సిందని రవిబాబు ఓ సందర్భంలో చెప్పారు.

సినిమా ఫెయిల్యూర్‌కు కారణమదే!

ఆనాడు యువతలో క్రేజ్‌ ఉన్న తరుణ్‌, ఉదయ్‌కిరణ్‌లతో పాటు, ఆర్తి అగర్వాల్‌ను కీలక పాత్రలకు అనుకున్నారు. దీంతో ఈ మూడు పాత్రల మధ్య ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీతో పాటు ఎమోషనల్‌గా మూవీకి ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతారని భావించారు. అందుకు తగినట్లుగానే క్లైమాక్స్‌ను రాసుకున్నారు. కానీ, హన్సరాజ్‌ను తీసుకురావడం వల్ల ఆర్తి పాత్ర తరుణ్‌తోనే వెళ్లిపోతుందని ప్రేక్షకుడికి ముందే అర్థమైపోయింది. దీంతో సినిమా చివరివరకూ ఆకట్టుకోలేకపోయింది.

ఈ సినిమాకు ఓ డిఫరెంట్‌ క్లైమాక్స్‌ను రవిబాబు ప్లాన్‌ చేశారు. రైల్వేస్టేషన్‌లో ఒక రైలు ఇటు వైపు, మరొక రైలు అటు వైపు వెళ్లడానికి సిద్ధంగా ఉంటుంది. అందులో ఒక రైల్లో ఉదయ్‌ కిరణ్‌, ఇంకొక దానిలో తరుణ్ ఉంటారు. ఆర్తి తరుణ్‌ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే, ‘నీ మొదటి ప్రేమ అతడు.. నేను మధ్యలో వచ్చి సాయం మాత్రమే చేశా. అతని దగ్గరకే వెళ్లు’ అని అంటే ఆర్తి అక్కడికి వెళ్తుంది. వేరే రైల్లో ఉన్న ఉదయ్‌.. ఆర్తితో మాట్లాడుతూ.. ‘నేను నీ జీవితంలో మొదటి ప్రేమికుడినే కావచ్చు. కానీ, అతను చేసినంత సాయం, సాహసం నేను చేయలేను. నాకంటే అతడే  బాగా చూసుకుంటాడు’ అని చెప్పడంతో ఆర్తి ఏదీ తేల్చుకోలేక రైలు దిగిపోతుంది. రెండు రైళ్లు రెండు వైపులకు వెళ్లిపోతాయి. దీంతో ఆ రెండు ట్రాక్‌ల మధ్య కూర్చొని ఆర్తి ఏడుస్తూ ఉంటుంది. కొద్దిసేపటికి ఆమె కళ్లెదుట ఒక గులాబీ కనిపిస్తుంది. అది తరుణ్‌ తీసుకొచ్చింది’’ ఇలా రవిబాబు క్లైమాక్స్‌ ప్లాన్‌ చేసుకున్నారు. ఉదయ్‌కిరణ్ ఒప్పుకోకపోవడంతో మొత్తం మారిపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు