sandeep reddy vanga: నానితో లవ్‌స్టోరీ ఆ భయంతో చెప్పలేకపోయిన సందీప్‌ వంగా!

‘అర్జున్‌రెడ్డి’ కన్నా ముందు ఓ ప్రేమకథను అనుకున్న ఆయన దాన్ని నానితో తీద్దామనుకున్నారు. కానీ, కలిసి కథ చెప్పేందుకు కాస్త ఆలోచించడంతో అది పట్టాలెక్కలేదు.

Published : 16 Dec 2023 15:33 IST

హైదరాబాద్‌: ‘అర్జున్‌రెడ్డి’తో యువతను ఆకట్టుకున్న దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. ఇటీవల రణ్‌బీర్‌తో ‘యానిమల్‌’ (Animal) తీసి, మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయాన్ని సందీప్‌ బయటపెట్టారు. ‘అర్జున్‌రెడ్డి’ కన్నా ముందు ఓ ప్రేమకథను అనుకున్న ఆయన దాన్ని నానితో తీద్దామనుకున్నారు. కానీ, కలిసి కథ చెప్పేందుకు కాస్త ఆలోచించడంతో అది పట్టాలెక్కలేదు.

అది 2010-11. ఫిల్మ్‌ స్కూల్‌ నుంచి వచ్చిన సందీప్‌ (sandeep reddy vanga) ఒక సినిమాకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో ఒక మంచి లవ్‌స్టోరీ అనుకుని ఒక నిర్మాతకు వినిపించారు. కథ నచ్చిన ఆ నిర్మాత ‘హీరో ఎవరు’ అని అడిగితే, ‘నాని’ (Nani) అని సందీప్‌ సమాధానం ఇచ్చారు. ‘నాని ఎవరు’ అంటూ ఆ నిర్మాత ప్రశ్నించడంతో, ‘‘అష్టాచమ్మా’లో నటించాడు. ఆ సినిమా నేను చూడలేదు. కానీ, ఇప్పుడు ‘రైడ్‌’ చేశాడు. చాలా బాగుంది. అతని డైలాగ్‌ మాడ్యులేషన్‌ నాకు నచ్చింది. మాస్‌ హీరోకు ఉండాల్సిన అంశాలు అతనిలో ఉన్నాయి. ఈ కథకు అతడు డిఫరెంట్‌గా ఉంటాడు’’ అని చెప్పాడు. వెంటనే స్పందించిన ఆ నిర్మాత ‘ఆ హీరో వద్దు.. ఈ నాలుగు పేర్లు పరిశీలించు’ అని ఇండస్ట్రీలో ఉన్న ఓ నలుగురు హీరోల పేర్లు ఆప్షన్‌గా ఇచ్చాడు. అవకాశాల కోసం వెతుకుతున్న సమయంలో అది వినియోగించుకునే పరిస్థితి ఉన్నా ‘నా కథకు ఈ హీరోలు సరిపోరు’ అని చెప్పి సందీప్‌ వంగా ఆయన దగ్గరి నుంచి వచ్చేశాడు. ఇదే విషయాన్ని ఫ్రెండ్స్‌కు చెబితే, ‘నీకేమైనా పిచ్చా’ అంటూ తిట్టారట.

ఆ తర్వాత కొన్ని రోజులకు బంజారాహిల్స్‌లోని ‘మోకా’ రెస్టారెంట్‌కు వెళ్తే, అక్కడ స్నేహితులతో కలిసి నాని ఉండటాన్ని సందీప్‌ గమనించారు. అప్పుడు నాని దగ్గరకు వెళ్లి, ‘నేను ఒక నిర్మాతకు కథ చెప్పాను. ఆయన వేరే హీరో అన్నారు. కానీ, నా కథలో మీరే హీరో. కథ చెబుతా వింటారా’ అని అడుగుదామని పదే అనుకున్నారట. స్నేహితులతో కలిసి ఎంజాయ్‌ చేస్తున్న సమయంలో వెళ్లి అడిగితే, ‘నన్ను ఇబ్బంది పెట్టొద్దు. వెళ్లండి’ అంటారేమోనని భయపడి నానికి కథ చెప్పకుండా అక్కడి నుంచి వచ్చేశారట. ఒకవేళ అప్పుడే ఆ కథను నాని చెప్పి, ఆయన ఒప్పుకొని ఉంటే, ‘అర్జున్‌రెడ్డి’ కన్నా ముందే సందీప్‌ దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యేవారు. తాజాగా ‘హాయ్‌ నాన్న’తో నాని, ‘యానిమల్‌’తో సందీప్‌ వంగా ఒకేసారి ప్రేక్షకులను పలకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని