Heeramandi2: ‘హీరామండి-2’ ప్రకటించిన దర్శకుడు.. ఏం చూపనున్నారంటే!

‘హీరామండి: ది డైమండ్‌ బజార్‌’ సీజన్‌ 2ను ప్రకటించారు. అందులో ఏం చూపనున్నారంటే..

Published : 03 Jun 2024 13:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హీరామండి: ది డైమండ్‌ బజార్‌’ ఇటీవల విడుదలై సంచలనం సృష్టించింది. భారీ తారాగణంతో పీరియాడిక్‌ డ్రామాగా రూపొందిన ఈ వెబ్‌ సిరీస్‌ బాలీవుడ్‌ ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. తన సినిమాల్లాగే దీన్ని కూడా సంజయ్‌ (Sanjay Leela Bhansali) చాలా గ్రాండ్‌గా తెరకెక్కించారు. ఇప్పుడీ సిరీస్‌కు సీజన్‌ 2ను ప్రకటించి అందరికీ సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. మొదటి పార్ట్‌కు కొనసాగింపుగా ఏం చూపనున్నారో వివరించారు.

సీజన్‌2 (Heeramandi season 2) గురించి సంజయ్‌లీలా భన్సాలీ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఈ సిరీస్‌ కోసం నేను 2022లో ‘గంగూబాయి కాఠియావాడి’ పూర్తయినప్పటి నుంచి కష్టపడ్డాను. నా తొలి సిరీస్‌ కావడంతో మరింత కష్టంగా అనిపించింది. బాధ్యతగా భావించి దీని పనులు మొదలుపెట్టినప్పటినుంచి బ్రేక్ లేకుండా పని చేశాను. ‘హీరామండి-2’లో వేశ్యలందరూ లాహోర్‌ వదిలి సినీ పరిశ్రమకు వస్తారు. దేశ విభజన సమయంలో వారందరూ ముంబయి, కోల్‌కతా వెళ్లి స్థిరపడతారు. అక్కడినుంచి ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారన్నది చూపనున్నా. సీజన్‌2లోనూ వాళ్లందరూ డ్యాన్స్ చేస్తారు. అయితే మొదటి పార్ట్‌లో నవాబుల కోసం డ్యాన్స్‌ చేసినవారు.. రెండో సీజన్‌లో చిత్ర నిర్మాతల కోసం చేస్తారు. ఈ కథతో ముందుకువెళ్లనున్నా. ఎప్పుడవుతుందో చూడాలి’ అని తెలిపారు.

రివ్యూ హీరామండి: ది డైమండ్‌ బజార్‌..

ఇక సీజన్‌ 2 ప్రకటించడంలోనూ సంజయ్‌ తన మార్క్‌ చూపారు. 100 మంది అమ్మాయిలు అనార్కలీ డ్రెస్‌లో డ్యాన్స్‌ వేస్తూ.. సీజన్‌2 ఉన్నట్లు ఆ మూమెంట్స్‌తో తెలిపారు. ఈ వీడియోను నెట్‌ఫ్లిక్స్‌ షేర్‌ చేయగా అది అందరినీ ఆకట్టుకుంటోంది. మొదటి భాగానికి (Heeramandi) మంచి ప్రేక్షకాదరణ వచ్చిందని అందుకే రెండో దాన్ని తెరకెక్కించనున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ తెలిపింది. తొలిభాగంలో మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్‌, షర్మిన్‌ సెగల్‌ తదితరులు కీలకపాత్రలు పోషించారు. రూ.200కోట్లతో రూపొందిన ఫస్ట్‌పార్ట్‌లోని కొన్ని సన్నివేశాలు ఇన్‌స్టాలో ట్రెండ్‌ సృష్టించాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని