Heeramandi Review: రివ్యూ హీరామండి: ది డైమండ్‌ బజార్‌.. సంజయ్‌లీలా భన్సాలీ ఫస్ట్‌ వెబ్‌సిరీస్‌ ఎలా ఉంది?

భారీ తారాగణంతో సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన వెబ్‌సిరీస్‌ మెప్పించిందా?

Updated : 02 May 2024 16:31 IST

Heeramandi Review in telugu: వెబ్‌సిరీస్‌: హీరామండి: ది డైమండ్‌ బజార్‌; నటీనటులు: మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్‌, షర్మిన్‌ సెగల్‌ తదితరులు; సినిమాటోగ్రఫీ: సుదీప్‌ ఛటర్జీ, మహేశ్‌ లిమాయే, హ్యుయాన్‌త్సాంగ్‌ మహోపాత్ర, రఘుధర్‌మన్‌; కథ: మొయిన్‌ బేగ్‌; సంగీతం, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్‌, దర్శకత్వం: సంజయ్‌ లీలా భన్సాలీ; స్ట్రీమింగ్‌ వేదిక: నెట్‌ఫ్లిక్స్‌

భారీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌ సంజయ్‌ లీలా భన్సాలీ. ముఖ్యంగా చారిత్రక నేపథ్యంతో ఆయన తీసిన ‘బాజీరావ్‌ మస్తానీ’, ‘పద్మావత్‌’ తదితర చిత్రాలన్నీ కళాఖండాలే. ఇప్పుడు ఆయన దర్శకత్వం వహించిన తొలి వెబ్‌సిరీస్‌ ‘హీరామండి’. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సిరీస్‌ ఎలా ఉంది?(Heeramandi Review in telugu) భారీ తారాగణంతో పీరియాడిక్‌ డ్రామాగా రూపొందిన సిరీస్‌ మెప్పించిందా?

కథేంటంటే: స్వాతంత్ర్యానికి ముందు పాకిస్థాన్‌లోని లాహోర్‌లో ఉన్న వేశ్యావాటిక హీరామండిలో జరిగిన పలు సంఘటనల సమాహారమే ఈ చిత్రం. అక్కడి షాహీ మహల్‌కు పెద్ద దిక్కు మల్లికా జాన్‌ (మనీషా కొయిరాలా). వహీదా (సంజీదా షేక్‌) ఆమె సోదరి. బిబోజాన్‌ (అదితిరావ్‌ హైదరి), ఆలంజేబు (షర్మిన్‌ సెగల్‌) ఇద్దరూ ఆమె కుమార్తెలు. ఫరీదాన్‌ (సోనాక్షి సిన్హా) ఖ్వాభాగ్‌ అనే మరో మహల్‌కు పెద్ద. మల్లికా జాన్‌ చేసిన పని వల్ల ఆమెను ద్వేషిస్తూ ఉంటుంది. లజ్జో (రిచా చద్దా) భగ్న ప్రేమికురాలు. మల్లికా జాన్‌ తన చిన్న కుమార్తె ఆలంజేబును వేశ్యలా మార్చాలని చూస్తుంది. అయితే, ఆమె బాలోచి నవాబు తాజ్‌దార్‌ (తాహా షా బహదూర్‌ షా)తో ప్రేమలో పడుతుంది. అయితే, వీరి ప్రేమ వ్యవహారం ఇటు మల్లికా జాన్‌కు, అటు తాజ్‌దార్‌ తండ్రికి నచ్చదు. మల్లిక వ్యవహారశైలి కారణంగా వహీదా ఆమెకు గుణపాఠం చెప్పాలని అనుకుంటుంది. అందుకు ఫరీదాన్‌తో చేతులు కలుపుతుంది. (Heeramandi Review in telugu) హీరామండిలో ఒకవైపు ఇన్ని వ్యవహారాలు నడుస్తుండగా, బిబోజాన్‌ బ్రిటీషర్లకు వ్యతిరేకంగా జరిగే స్వాతంత్ర్య పోరాటంలో గూఢచారిగా వ్యవహరిస్తూ ఉంటుంది. బ్రిటీషర్లతో సత్సంబంధాలు కలిగిన వాలీసాహెబ్‌ (ఫర్దీన్‌ఖాన్‌)తో పరిచయం పెంచుకుని వారి రహస్యాలను తెలుసుకుంటూ ఉంటుంది. షాహీ మహల్‌కు హుజూర్‌ కావడానికి ఫరీదాన్‌ ఎలాంటి కుట్రలు పన్నింది? వాటిని మల్లికా జాన్‌ ఎలా ఎదుర్కొంది. గూఢచారి అయిన బిబోజాన్‌ విషయం తెలిసిన తర్వాత బ్రిటీష్‌వాళ్లు ఏం చేశారు? తదితర విషయాలు తెలియాలంటే వెబ్‌సిరీస్‌ చూడాల్సిందే.

ఎలా ఉందంటే: బ్రిటీష్‌ పాలనకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి. చరిత్ర పుటల్ని తిరగేస్తే ప్రతి దశలోనూ స్వాతంత్ర్య కాంక్షను రగిలిస్తూ పోరాటం చేసినవారు అడుగడుగునా కనిపిస్తారు. దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన ఎందరో మహిళల గాథలు భావితరాలకు తెలియకుండానే చరిత్రలో కలిసిపోయాయి. ‘స్త్రీలకు ఆస్తిలో వాటా ఇవ్వని సమాజం.. చరిత్రలో ఎలా ఇస్తుంది’ ఇది వెబ్‌సిరీస్‌ అయిపోయిన తర్వాత వినిపించే సంభాషణ. అలా చరిత్రలో కనుమరుగైన ఒక అధ్యాయమే ‘హీరామండి’. స్వాతంత్ర్య పోరాటంలో ‘హీరామండి’ అధ్యాయానికి భారీదనం అద్ది తెరపై అద్భుతాన్ని ఆవిష్కరించడంలో దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ విజయం సాధించారు. మొత్తం 8 ఎపిసోడ్స్‌ (ఒక్కో ఎపిసోడ్‌ సుమారు గంట) కలిగిన సిరీస్‌ ఆద్యంతం కనులపండువగా సాగుతుంది. తన టేకింగ్‌, విజువల్‌ ఫీస్ట్‌తో ప్రతి ప్రేక్షకుడినీ హీరామండి ప్రపంచంలోకి తీసుకెళ్లారు.

షాహీమహల్‌లో ఉండే వ్యక్తులు, వారి స్వభావాలను పరిచయం చేస్తూ సిరీస్‌ను మొదలుపెట్టిన దర్శకుడు.. ఒక ఎపిసోడ్‌ మొత్తాన్ని దాని కోసమే వాడుకున్నాడు. ఇతర పాత్రలతో పోలిస్తే, మల్లికాజాన్‌ పాత్ర పరిచయం సొంత కుమార్తెలతో సహా ఎవరిపైనా దయాదాక్షిణ్యాలు లేని కఠినాత్మురాలిగా ఆ పాత్రను ఎస్టాబ్లిష్‌ చేసిన విధానం బాగుంది. ఆమె గతం, ఘోరమైన నేర చరిత్ర షాహీమహల్‌ సొంతం చేసుకోవడానికి ఆమె చేసిన కుట్రలు ఇలా ఎన్నో పార్శ్వాలు కలిగిన పాత్ర అని చెప్పడానికి చాలా సమయం తీసుకున్నట్లు అనిపిస్తుంది. మొదటి రెండు ఎపిసోడ్స్‌ హీరామండిని మనకు పరిచయం చేయడానికే సరిపోయింది. మూడో ఎపిసోడ్‌ నుంచి హీరామండిలో వేశ్యల మధ్య ఆధిపత్య పోరు, ఆలంజేబు, తాజ్‌దార్‌ల ప్రేమ వ్యవహారం, బ్రిటీషర్లకు వ్యతిరేకంగా సాగే విప్లవ పోరాటాన్ని ఇలా రెండు, మూడు ప్లాట్‌లను సమాంతరంగా చూపించుకుంటూ అన్నింటినీ ఒకదానితో ఒకటి కనెక్ట్‌ చేసుకుంటూ వెళ్లారు.

వెండి తెరపై స్వాతంత్ర్య పోరాటమనే కాన్సెప్ట్‌కు కాస్త ఫిక్షన్‌ జోడించి మామూలుగా చూపించవచ్చు. కానీ, అక్కడ ఉన్నది సంజయ్‌లీలా భన్సాలీ. కథను అప్పటి వాస్తవ ప్రపంచంలో చెప్పినప్పుడే ప్రేక్షకుడికి కనెక్ట్‌ అవుతుంది. ఆ విషయంలో భన్సాలీని కొట్టేవారు లేరు. పాత్రలు, వాటి తీరుతెన్నులను ఎంత డీటెయిలింగ్‌గా రాసుకున్నారో హీరామండిలో ఉండే అణువణువునూ అంతే డీటెయిలింగ్‌గా చూపించారు. అదెంతలా అంటే ‘హీరామండి’ అనే వేశ్యవాటికను చూపిస్తున్నారా? లేక రాణివాసాన్ని చూపిస్తున్నారా? అన్నంత ముగ్ధమనోహరంగా ప్రపంచాన్ని ఆవిష్కరించారు. సినిమా అయినా సిరీస్‌ అయినా కథ, కథనాలు సాగుతున్న కొద్దీ ఆసక్తికరంగా ఉండాలి. ఒకానొకదశలో అది గాడి తప్పింది. కథ మొత్తం అక్కడక్కడే తిరుగుతున్న భావన కలుగుతుంది. దీనికితోడు మధ్య మధ్యలో వచ్చే పాటలు విజువల్స్‌పరంగా అద్భుతంగా ఉన్నా, ఓటీటీకి అవి ఏమాత్రం అదనపు బలాన్ని ఇవ్వవు. మధ్యలో వచ్చే మూడు ఎపిసోడ్స్‌ ఇలా పాత్రల మధ్య సంఘర్షణే సుదీర్ఘంగా ఉండటం ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తుంది. ఆరో ఎపిసోడ్‌ నుంచి మళ్లీ కథ ట్రాక్‌ ఎక్కుతుంది. మరీ ముఖ్యంగా చివరి రెండు ఎపిసోడ్స్‌ భావోద్వేగభరితంగా సాగుతాయి. పతాక సన్నివేశాలు ఉద్విగ్నంగా ఉంటాయి. ఒక హైఎండ్‌ నోట్‌తో సిరీస్‌ను ముగించిన తీరు బాగుంది.

ఎవరెలా చేశారంటే: మనీషా కొయిరాలా, సోనాక్షి సిన్హా, అదితిరావు హైదరీ, రిచా చద్దా, సంజీదా షేక్‌, షర్మిన్‌ సెగల్‌ ఇలా భారీ తారాగణమే ఉంది. ప్రతి ఒక్కరూ తమ పాత్రకు న్యాయం చేశారు. షాహీమహల్‌ హుజూర్‌గా కఠినాత్మురాలైన వేశ్యగా మల్లికాజాన్‌ పాత్రలో మనీషా కొయిరాలా తన నటనలో కొత్త కోణాన్ని చూపించారు. ఆమె మాటతీరు, నవ్వు, హావభావాలు ఇలా దేనికదే ప్రత్యేకం. నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో సోనాక్షి చక్కగా సరిపోయారు. ఒకవైపు వేశ్యగా, మరోవైపు విప్లవకారిణిగా రెండు రకాల వైవిధ్యంతో ఆకట్టుకున్నారు అదితిరావు హైదరీ. భగ్న ప్రేమికురాలిగా రిచా చద్దా కనిపించేది కొద్దిసేపే. షర్మిన్‌ సెగల్‌ తెరపై అందంగా కనిపించింది. మిగిలిన వాళ్లు తమ పరిధి మేరకు నటించారు.

సాంకేతికంగా వెబ్‌సిరీస్‌ అత్యుత్తమంగా ఉంది. సినిమాటోగ్రఫీ, విజువల్స్‌, సెట్స్‌ ఊహకందని స్థాయిలో అద్భుతంగా ఉన్నాయి. ‘జనాలకు పోరాడితే స్వాతంత్ర్యం వస్తుంది. వేశ్యలకు మరణంతోనే వస్తుంది’, ‘ఏ దిక్కూ లేని ఆడదానికి అందం, సామర్థ్యం శత్రువులు’,  ‘రాణులు తిరుగుబాటు చేయరు. యుద్ధం చేస్తారు’ వంటి సంభాషణలు బాగున్నాయి. ఈ సిరీస్‌కు సంగీతం, ఎడిటింగ్‌, దర్శకత్వం సంజయ్‌ లీలా భన్సాలీ. ఆయన విజువలైజేషన్‌, కథ ప్రపంచాన్ని ఆవిష్కరించే తీరు అంచనా వేయడం సినీ విశ్లేషకులకు కూడా సాధ్యం కాదంటే అతిశయోక్తి కాదు. అయితే, భారీ తారాగణం, సెట్స్‌ ఇవేవీ కథను నడిపించలేవు. ఒకరకంగా చూస్తే ఇప్పటివరకూ వచ్చిన స్వాత్రంత్యపోరాట కథల మాదిరిగానే ‘హీరామండి’ సగటు కథా వస్తువు. మలుపులు, వీరోచిత ఘట్టాలు ఏమీ ఉండవు. పాత్రలు పరిచయం, పాటలు.. ఇలా చాలా సన్నివేశాలకు కత్తెర వేసే అవకాశం ఉన్నా భన్సాలీ ఆ పని చేయలేదు. సుమారు  గంట పాటు సాగే ఒక్కో ఎపిసోడ్‌ను చూడటం కాస్త ఇబ్బందికరమే!

కుటుంబంతో చూడొచ్చా: ఎలాంటి అభ్యంతరం లేకుండా చూడొచ్చు. వేశ్యవాటిక నేపథ్యంలో సాగే కథే అయినా.. ఒక్కచోట కూడా అసభ్య సన్నివేశం కానీ, అసభ్య పదజాలం కానీ లేవు. తెలుగు సహా 14 భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది.

  • బలాలు
  • + నటీనటులు
  • + సెట్స్‌, సినిమాటోగ్రఫీ
  • + దర్శకత్వం
  • బలహీనతలు
  • - నిడివి
  • - బలమైన కథా వస్తువు లేకపోవడం
  • చివరిగా: ‘హీరామండి’.. క్లాసిక్‌ డ్రామా విత్‌ విజువల్‌ ఫీస్ట్‌ (Heeramandi Review in telugu)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని