Sharwanand: అందుకే శర్వానంద్‌ ఆ హిట్‌ మూవీకి ‘నో’ చెప్పారు.. సెకండ్‌ ఛాన్స్‌లోనూ!

హీరో శర్వానంద్‌ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి ఆసక్తికర విషయం మీకోసం..

Published : 06 Mar 2024 09:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ హీరో శర్వానంద్‌ (Sharwanand) వద్దకు ఓ సినిమా అవకాశం వస్తే దాన్ని ఆయన తిరస్కరించారు. ఆయన స్థానంలో మరో కథానాయకుడు నటించారు. కట్‌చేస్తే, ఆ చిత్రం ఊహించని విజయం అందుకుంది. సదరు నటుడి కెరీర్‌ని పూర్తిగా మార్చేసింది. అదే మూవీ? దాన్ని శర్వానంద్‌ ఎందుకు వద్దన్నారు? నేడు తన పుట్టినరోజు సందర్భంగా ఆ సంగతులు చూద్దాం..

శర్వానంద్‌ ‘నో’ చెప్పిన స్క్రిప్టు మరేదో కాదు ‘అర్జున్‌ రెడ్డి’ (Arjun Reddy). ఈ సినిమాని శర్వానంద్‌తో తెరకెక్కించాలని దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) అనుకున్నారు. ఈ మేరకు ఆయన్ను సంప్రదించారు. కథ నచ్చినా అందులో తాను నటించలేకపోవడానికి గల కారణాన్ని శర్వా ఓ సందర్భంలో పంచుకున్నారు. అందులోని కొన్ని అంశాలు తనకు సెట్‌కాదని అనిపించాయని, అందుకే వదులుకున్నానని తెలిపారు. కొందరు భావించినట్లు ముద్దు సన్నివేశాల వల్ల కాదని చెప్పారు. ఈ హిట్‌ సినిమా మిస్సైనందుకు బాధపడలేదని, ఎవరికి రాసిపెట్టి ఉన్న కథలు వారికే దక్కుతాయని పేర్కొన్నారు. ఆ డైరెక్టర్‌ మరోసారి తన వద్దకు వచ్చి అడగ్గా.. ‘ఆ కథ మినహా ఏదైనా చేస్తా’ అని చెప్పినట్లు తెలిపారు.

శర్వా చెప్పిన దాని ప్రకారం.. ‘కబీర్‌ సింగ్‌’ కోసమే సందీప్‌ మళ్లీ ప్రయత్నించి ఉండొచ్చు. ఎందుకంటే ఆ దర్శకుడు ఇప్పటి వరకు రూపొందించిన చిత్రాలు మూడు. వాటిలోని ‘యానిమల్‌’ గతేడాది విడుదలైంది. ‘అర్జున్‌ రెడ్డి’లో నటించకపోవడంపై కొన్నాళ్ల క్రితం శర్వా మాట్లాడారు కాబట్టి ‘యానిమల్‌’ కథ ఆయన వద్దకు వెళ్లి ఉండదు. ‘అర్జున్‌ రెడ్డి’కి ‘కబీర్‌ సింగ్‌’ రీమేక్‌ (హిందీ). ఈ కారణంతో శర్వా దాన్నీ వద్దాన్నారేమో. ఈ హీరో కాదన్న ఆ కథలో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) నటించి, యువతలో విశేష క్రేజ్‌ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ‘అర్జున్‌ రెడ్డి’ ప్రీ రిలీజ్‌కు శర్వా ముఖ్య అతిథిగా హాజరవడం విశేషం. ‘గమ్యం’, ‘ప్రస్థానం’, ‘రన్‌ రాజా రన్‌’, ‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’, ‘శ్రీకారం’, ‘ఒకే ఒక జీవితం’ వంటి 34 చిత్రాల్లో నటించిన ఆయన ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని