Game on: కొత్తదనమే ‘గేమ్‌ ఆన్‌’ బలం

ఓటమి నుంచి గెలుపు వరకూ సాగిన ఓ యువకుడి ఆసక్తికర ప్రయాణమే మా చిత్రం... ప్రేక్షకుడిని ప్రత్యేకమైన ప్రపంచంలో లీనం చేసే  ప్రయత్నం చేశామన్నారు గీతానంద్‌. ఆయన కథానాయకుడిగా... ఆయన తమ్ముడు దయానంద్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గేమ్‌ ఆన్‌’. నేహా సోలంకి కథానాయిక. మధుబాల, ఆదిత్య మేనన్‌, శుభలేఖ సుధాకర్‌ కీలక పాత్రలు పోషించారు.

Updated : 02 Feb 2024 09:21 IST

ఓటమి నుంచి గెలుపు వరకూ సాగిన ఓ యువకుడి ఆసక్తికర ప్రయాణమే మా చిత్రం... ప్రేక్షకుడిని ప్రత్యేకమైన ప్రపంచంలో లీనం చేసే  ప్రయత్నం చేశామన్నారు గీతానంద్‌. ఆయన కథానాయకుడిగా... ఆయన తమ్ముడు దయానంద్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గేమ్‌ ఆన్‌’. నేహా సోలంకి కథానాయిక. మధుబాల, ఆదిత్య మేనన్‌, శుభలేఖ సుధాకర్‌ కీలక పాత్రలు పోషించారు. రవి కస్తూరి నిర్మాత. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా గీతానంద్‌ గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

‘‘విభిన్నమైన ప్రయత్నం చేయాలని ముందే నిర్ణయించుకుని రియల్‌టైమ్‌ సైకలాజికల్‌ గేమ్‌ నేపథ్యంలో ఈ కథని ఎంచుకున్నాం. ప్రేక్షకులు ప్రత్యేకమైన అనుభూతికి గురవుతారని బలంగా నమ్మాం. కథకి తగ్గట్టుగానే సినిమాని ఎంతో పకడ్బందీగా తెరపైకి తీసుకొచ్చాం. మేం అనుకున్నట్టే పెద్దవాళ్ల నుంచి పిల్లల వరకూ అందరినీ అలరిస్తోంది చిత్రం. మూడు రోజులుగా భిన్న రకాల వయసులవారిని ఎంపిక చేసి వాళ్ల కోసం సినిమా ప్రదర్శనల్ని ఏర్పాటు చేస్తున్నాం. అందరూ సినిమా బాగుందని మెచ్చుకుంటున్నారు. తర్వాత ఏం జరుగుతుందనే ఉత్సుకత అడుగడుగునా రేకెత్తించారని మెచ్చుకుంటున్నారు. సినిమాపై మాకున్న నమ్మకంతోనే ముందుగానే ప్రదర్శనలు ఏర్పాటు చేశాం. విడుదల తర్వాత ప్రేక్షకులు కూడా కథలోని కొత్తదనాన్ని ఆస్వాదిస్తారని నమ్ముతున్నాం. అదే మా సినిమాకు బలం’’.

  • ‘‘లఘు చిత్రాలతో మా  ప్రయాణం మొందలైంది. నా తమ్ముడు, ఈ చిత్ర దర్శకుడు దయానంద్‌ కథ రాస్తే నేను నటించేవాడిని, కొన్నిసార్లు తను రాసిన కథకి నేను దర్శకత్వం వహించేవాడిని. మా ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉంది. నిర్మాత రవి కస్తూరి కూడా నా స్నేహితుడు కావడంతో ముగ్గురం కలిసి చర్చించుకుని ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించాం. నిర్మాణ దశలోనూ మా ముగ్గురి మధ్య ఉన్న అవగాహన వల్లే సినిమా ఇంత నాణ్యతతో రూపుదిద్దుకుంది. విజువల్స్‌, సంగీతం, విజువల్‌ ఎఫెక్ట్స్‌... ఇలా ప్రతి విభాగం గురించీ ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. కథలోని భావోద్వేగాలు ప్రేక్షకుల మనసుల్ని హత్తుకుంటాయి. మధుబాల, శుభలేఖ సుధాకర్‌, ఆదిత్య మేనన్‌ తదితరుల పాత్రలు గుర్తుండిపోతాయి. కథానాయిక నేహాకీ, నాకూ మధ్య కెమిస్ట్రీ బాగుందనే ప్రశంసలు కూడా వచ్చాయి’’.
  • ‘‘ఎప్పటికప్పుడు విభిన్నమైన కథలతో ప్రయాణం చేయాలన్నదే నా ప్రయత్నం. ‘రథం’ తర్వాత ఈ చిత్రం చేశా. ప్రేక్షకుల స్పందనని బట్టి ‘గేమ్‌ ఆన్‌’కి కొనసాగింపుని తెరకెక్కించడంపై నిర్ణయం తీసుకుంటాం. కొత్తగా మూడు చిత్రాలు చేయబోతున్నా. స్పోర్ట్స్‌ నేపథ్యంలో ఒక చిత్రం, థ్రిల్లర్‌ కథతో మరో చిత్రం చేయబోతున్నా. మా తమ్ముడికి దర్శకత్వం పరంగా వేరే ప్రణాళికలు ఉన్నాయి. దాంతో నేను కొత్త దర్శకులతో సినిమాలు చేయబోతున్నా’’.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని