Brahmanandam: బ్రహ్మానందం చేసిన పాత్ర ఆ మ్యూజిక్‌ డైరెక్టర్‌ది కాదు..!

కింగ్‌ సినిమాలో బ్రహ్మానందం పాత్రను ఎవరిని తీసుకున్నారు? అందుకు కారణం ఏంటనే విషయాన్ని దర్శకుడు శ్రీనువైట్ల ఓ సందర్భంలో పంచుకున్నారు.

Published : 07 Feb 2023 16:59 IST

హైదరాబాద్‌: నిజ జీవిత ఘటనలతో ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. కొందరు వ్యక్తులను, సంఘటలను స్ఫూర్తిగా తీసుకుని ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి దర్శక-రచయితలు ప్రయత్నిస్తుంటారు. అలాంటి దర్శకుల్లో శ్రీనువైట్ల ఒకరు. నిజ జీవిత పాత్రల నుంచి స్ఫూర్తిపొంది పలు ఆసక్తికర పాత్రలను తన సినిమాల్లో పెడతారు. అలాంటి వాటిలో ‘కింగ్‌’ (King movie) మూవీలో బ్రహ్మానందం (Brahmanandam) చేసిన మ్యూజిక్‌ డైరెక్టర్‌ పాత్ర. దీనిపై అప్పట్లో కాస్త ఆసక్తికర చర్చ జరిగింది. ఈ పాత్రను ఎలా సృష్టించిందీ ఓ ఇంటర్వ్యూలో శ్రీనువైట్ల (Srinu Vaitla) చెప్పుకొచ్చారు.

‘‘కింగ్‌’లో బ్రహ్మానందం చేసిన మ్యూజిక్‌ డైరెక్టర్‌ పాత్రను తమను ఉద్దేశించే పెట్టారని ఇద్దరు ముగ్గురు అనుకున్నారు. చాలా మంది చక్రిని వెక్కిరిస్తూ పెట్టానని భావించారు. ఆయన అలాంటి వ్యక్తికాదు. చాలా మంచివాడు. నా ‘ఢీ’ సినిమాకు కూడా పనిచేశాడు. ఏదైనా సినిమా ఇబ్బందుల్లో ఉండి, తన దగ్గరకు వస్తే, కొన్నిసార్లు పారితోషికం ఇవ్వకపోయినా చేసేవాడు. అది ఆయన వ్యక్తిత్వం. నా మనసులో వేరే మ్యూజిక్‌ డైరెక్టర్‌ వేరొకరైతే కనెక్ట్‌ అయింది మాత్రం మరొకరు. అప్పుడే ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రామజోగయ్యశాస్త్రి గారిని తీసుకుని ఓ సంగీత దర్శకుడి దగ్గరకు వెళ్లి, పరిచయం చేశా. పాటలు బాగా రాస్తారని చెప్పా. వెంటనే ఆ సంగీత దర్శకుడు ‘అరె శాస్త్రి.. అది రాయి’ అనేసరికి నేను షాకయ్యా! అసలు అంతకుముందు పరిచయం కూడా లేని వ్యక్తిని అలా అనేసరికి నాకు కొత్తగా అనిపించింది. అంతకుమించి ఆ మ్యూజిక్‌ డైరెక్టర్‌లో మిగిలినవి ఏవీ లేవు. అవన్నీ మా కల్పితాలు. రాంగోపాల్‌వర్మ తీసిన ఓ చిత్రంలోని పాత్రను స్ఫూర్తిగా తీసుకుని బ్రహ్మానందం పాత్రకు అదనపు హంగులు జోడించాం’’ అని అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని