RRR Movie: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రీక్లైమాక్స్‌లో చేసిన మార్పు ఇదే.. జెన్నీ పాత్ర చనిపోతుందట!

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు నటించిన ‘ఆర్ఆర్ఆర్‌’ గురించి ఆ  చిత్ర దర్శకుడు రాజమౌళి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.

Published : 19 Mar 2024 15:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎస్‌.ఎస్‌.రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో రామ్‌చరణ్‌ (Ram charan), ఎన్టీఆర్‌ (NTR) కథానాయకులుగా నటించిన పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా ‘RRR’. 2022లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రూ.1300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సంగతి తెలిసిందే. అంతేకాదు, ఆస్కార్‌ అవార్డుల్లోనూ సత్తా చాటింది. తాజాగా జపాన్‌లో ఈ మూవీని విడుదల చేయడంతో దర్శకుడు రాజమౌళి అక్కడకు వెళ్లారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ గురించి ఇప్పటివరకూ బయటకు రాని ఆసక్తికర విషయాలను ఈ సందర్భంగా పంచుకున్నారు. ఎన్టీఆర్‌(భీమ్‌)కు జోడీగా బ్రిటిష్ యువతి జెన్నీ పాత్రలో ఓలివియా మోరిస్‌ నటించింది. ఆమె అతడిని తన ఇంటికి ఆహ్వానిస్తుంది. అప్పుడే మల్లి అక్కడ ఉందన్న విషయం భీమ్‌కు తెలుస్తుంది. సినిమాలో వీరిద్దరి కాంబినేషన్‌లో ఇంకొన్ని సన్నివేశాలు ఉన్నాయని, కానీ, నిడివి కారణంగా ఎడిటింగ్‌లో తీసేయాల్సి వచ్చిందని రాజమౌళి చెప్పారు.

‘‘భీమ్‌ను జైలులో పెట్టిన తర్వాత జెన్నీ (ఓలివియా మోరిస్‌) అతడిని కలుస్తుంది. జైలు నుంచి తప్పించడానికి భీమ్‌కు సాయం చేయాలనుకుంటుంది. దీంతో ఆమె అంకుల్‌ గవర్నర్‌ స్కాట్‌ (రే స్టీవెన్‌సన్‌) గదిలోకి రహస్యంగా వెళ్లి, అక్కడ ఉన్న ప్లాన్స్‌ను దొంగిలించి తీసుకెళ్లి భీమ్‌కు ఇస్తుంది. అక్కడి నుంచి వస్తుండగా, స్కాట్‌ భార్య (అలీసన్‌ డూడీ) చూస్తుంది. జెన్నీ బూట్లకు మట్టి అంటుకుని ఉండటంతో అనుమానం వచ్చి, విషయాన్ని స్కాట్‌కు చెబుతుంది. ఆ తర్వాత భీమ్‌ తప్పించుకుని పారిపోతాడు. దీంతో రామ్‌ను జైల్లో పెడతారు. విషయం తెలుసుకున్న భీమ్‌ తిరిగి వచ్చి రామ్‌ను కాపాడి జైలు నుంచి బయటకు తీసుకెళ్తాడు. అడవిలో ఎదురైన బ్రిటిష్‌ సైన్యాన్ని చంపుకొంటూ వీరిద్దరూ వెళ్తున్న క్రమంలో జెన్నీని పావుగా వాడుకుని వాళ్లను పట్టుకోవాలని స్కాట్‌ భావిస్తాడు. వాళ్లని లొంగిపోమ్మని లేకపోతే, జెన్నీని చంపేస్తానని బెదిరిస్తాడు. అయితే, వాళ్లు లొంగిపోవడానికి సిద్ధమవుతున్న సమయంలోనే మోసం చేసిందన్న కోపంతో జెన్నీని స్కాట్ చంపేస్తాడు. ఒరిజినల్‌ వెర్షన్‌లో జెన్నీ చనిపోతుంది. విషాదంతో కూడిన కథను తీయాలని నాకు అనిపించలేదు. దీంతో మొత్తం మార్చేశాం. అందుకే జెన్నీ బతికిపోయింది. మీరు హ్యాపీగా సినిమా చూశారు’’ అంటూ రాజమౌళి వివరించారు.

ప్రస్తుతం రాజమౌళి చెప్పిన మాటలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. దీనిని బట్టి చూస్తే భీమ్, జెన్నీలకు అదనంగా ట్రాక్స్‌ రాసుకున్నట్లు అర్థమవుతోంది. అయితే, అప్పటికే సినిమా నిడివి మూడు గంటలు దాటిపోవడంతో ఆ సన్నివేశాలను తీసేశారు. ఇక రాజమౌళి సినిమాల విషయానికొస్తే, మహేశ్‌బాబుతో ఓ సినిమా చేయబోతున్నారు. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో యాక్షన్‌ అడ్వెంచర్‌ జానర్‌లో ఈ మూవీ తెరకెక్కనుంది. త్వరలోనే షూటింగ్‌ మొదలు పెట్టనున్నట్లు రాజమౌళి స్వయంగా ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని