Samantha: రామలక్ష్మిపై అందరూ అనుమానం వ్యక్తంచేశారు!

 Samantha: కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన సమంత 14 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆమె ‘ఏమాయ చేసావె’తో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే.

Published : 26 Feb 2024 14:40 IST

హైదరాబాద్‌: సమంత.. (Samantha) సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘ఏమాయ చేసావె’ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైన ఆమె కెరీర్‌లో 14 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. కథానాయికగా ఆడి పాడినా, ‘ఫ్యామిలీమెన్‌2’లో యాక్షన్‌తో అదరగొట్టినా, ‘పుష్ప’లో ఐటమ్‌సాంగ్‌తో ఓ ఊపు ఊపినా నటిగా ఆమెను మరో మెట్టు ఎక్కించిన పాత్ర ‘రంగస్థలం’లో రామలక్ష్మి. అప్పటివరకూ గ్లామర్‌ పాత్రల్లో రాణించిన సమంత మొదటిసారి డీగ్లామర్‌ రోల్‌లో కనిపించారు. సుకుమార్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌ (Ram charan) కథానాయకుడిగా రూపొందిన ఈ సినిమాలో సామ్‌.. రామలక్ష్మి అనే పల్లెటూరి యువతి పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. 2018లో విడుదలైన ఈ సినిమా సామ్‌ కెరీర్‌లో ఓ ఆణిముత్యంగా నిలిచింది. అయితే ‘రామలక్ష్మి’ పాత్ర కోసం సమంతను తీసుకోవాలని చిత్ర బృందం తొలుత భావించలేదట. సామ్‌ని డీగ్లామర్‌గా చూపిస్తే అభిమానులు ఏమంటారో అని చిత్రబృందంలోని కొంతమంది సభ్యులు అనుమానం వ్యక్తంచేశారట.

‘‘రామలక్ష్మి పాత్ర నాకు ఎంతగానో గుర్తింపు తెచ్చింది. డీగ్లామర్‌ పాత్రలో నేను నటిస్తే ప్రేక్షకులు ఓకే చేస్తారా? అనే అనుమానం చాలామందికి వచ్చింది. ‘ఇప్పటివరకూ గ్లామర్‌ పాత్రల్లో కనిపించిన సమంతను ఓ పల్లెటూరు అమ్మాయిగా, మొరటుగా.. పూర్తి డీగ్లామర్‌ రోల్‌లో చూపిస్తే అభిమానులు ఏమనుకుంటారో’ అని సుకుమార్‌ డైరెక్షన్‌ టీమ్‌లోని కొంతమంది అసిస్టెంట్‌ డైరెక్టర్లు అనుమానం వ్యక్తంచేశారు. కానీ, సుకుమార్‌ సర్ మాత్రం నాపై నమ్మకం ఉంచి ‘రంగస్థలం’లో అవకాశమిచ్చారు. అలా నాకు రామలక్ష్మి పాత్ర చేసే అవకాశం దక్కింది’’ అని ఇటీవల సమంత ఓ సందర్భంలో తెలిపారు. ఇక సమంత సినీ కెరీర్‌ మొదలుపెట్టి 14 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కథానాయిక నయనతార శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని