అల్లు అర్జున్‌తో ‘జగడం’

‘జగడం’ తొలుత మహేష్‌, ఆ తర్వాత అల్లుఅర్జున్‌తో తీయాలని అనుకున్నారట సుకుమార్‌. అయితే, దిల్‌రాజుతో జరిగిన చిన్న గొడవ కారణంగా రామ్‌తో తీయాల్సి వచ్చింది.

Published : 04 Sep 2023 17:38 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అల్లు అర్జున్‌ కెరీర్‌కు మంచి బ్రేక్‌నిచ్చిన చిత్రం ‘ఆర్య’. దర్శకుడు సుకుమార్‌ తొలి చిత్రంతోనే ఘన విజయాన్ని అందుకున్నారు. వన్‌సైడ్‌ లవ్‌ అంటూ సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ‘ఆర్య’ బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా తర్వాత సుకుమార్‌.. రామ్‌తో ‘జగడం’ తీశారు. అయితే, ఆ చిత్రం అంతగా ఆకట్టుకోలేదు. అసలు ఈ సినిమాను తొలుత మహేష్‌, ఆ తర్వాత అల్లుఅర్జున్‌తో తీయాలని అనుకున్నారట. అయితే, దిల్‌రాజుతో జరిగిన చిన్న గొడవ కారణంగా రామ్‌తో తీయాల్సి వచ్చింది.

‘‘నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఎలా మాట్లాడాలో పెద్దగా తెలిసేది కాదు. ప్రపంచం కూడా మనలాగే ఉంటుందనుకోలేదు. ‘ఆర్య’ హిట్‌ కావడంతో గాల్లో తేలిపోయా. ఆ సందర్భంలో బన్నితో ‘జగడం’ చేయాలనుకున్నా. కథతో సహా అన్ని సిద్ధం అయ్యాయి. అయితే, అదే సమయంలో దిల్‌రాజుతో చిన్న సమస్య వచ్చింది. కోపం పట్టలేకపోయా. బాగా ఎమోషనల్‌ అయిపోయా. వెంటనే రాత్రికి రాత్రే రామ్‌ దగ్గరకు వెళ్లిపోయి, కథ చెప్పడం.. ఒకే చేయించుకోవడం అయిపోయింది. అంతేకాదు.. మరుసటి రోజే ముహూర్తం కూడా పెట్టించేశా. ముహూర్త సన్నివేశానికి బన్నిని, రాజుగారిని పిలిచా’’

‘‘అక్కడకు రాజుగారు వచ్చి ‘నీకు బుద్ధుందా? ఏంటి ఇలా చేశావ్. కోపం వస్తే, కనీసం చెప్పకుండా సినిమాను ఓపెన్‌ చేసేస్తావా’ అని తిట్టారు. నేను అమాయకుడినని ఆయనకు తెలుసు. నేనేమో నాది వీరత్వం అనుకున్నా. ‘మీరు కథలో ఆ మార్పు చేయాలి.. ఈ మార్పు చేయాలి’ అంటున్నారు అసలు కుదరదు అని చెప్పేశా. మొదటి సినిమా హిట్‌ కావడంతో నా జడ్జిమెంట్‌ను ఎవరైనా తప్పు అని చెబితే కోపం వచ్చేసేది. రామ్‌ చేసిన పాత్ర బన్ని లేదా మహేష్‌ అయితే బాగుండేది. అతడి తమ్ముడి పాత్రకు రామ్‌ అయితే సరిపోయేవాడు. కానీ, అలా జరగలేదు. ‘జగడం’ ఫ్లాప్‌ కావడంతో నాలోనూ మార్పు వచ్చింది. అప్పటి నుంచి ఎవరు ఏది చెప్పినా, వినేవాడిని.’’ అంటూ ‘జగడం’ వెనుక కథను ఓ సందర్భంలో పంచుకున్నారు సుకుమార్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని