త్రివిక్రమ్‌కు సునీల్‌ కండీషన్‌!

sunil: త్రివిక్రమ్‌తో తనకున్న అనుబంధం గురించి నటుడు సునీల్‌ పంచుకున్న ఆసక్తికర విశేషాలు..

Published : 22 Mar 2023 15:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కమెడియన్‌గా వెండితెరపై తనదైన ముద్రవేసిన నటుడు సునీల్‌ (Sunil). ఆ తర్వాత కథానాయకుడిగా మారి, పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఇప్పుడు ప్రతినాయకుడిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానూ రాణిస్తున్నారు. చిత్ర పరిశ్రమకు రాకముందు త్రివిక్రమ్‌ (Trivikram srinivas), సునీల్‌ మంచి స్నేహితులన్న సంగతి అందరికీ తెలిసిందే. ఒకే గదిలో ఉండి, అవకాశాల కోసం దర్శక-నిర్మాతల చుట్టూ తిరిగారు. త్రివిక్రమ్‌ రచన అందించిన అనేక చిత్రాల్లో సునీల్‌కు మంచి పాత్రలు దక్కాయి. అయితే, సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న రోజుల్లో త్రివిక్రమ్‌కు చాలా కండీషన్లు పెట్టేవారట? అని సునీల్‌ను ఓ సందర్భంలో అడిగితే ఇలా చెప్పుకొచ్చారు.

‘‘సినిమాలకు సంబంధించి కథల విషయంలో త్రివిక్రమ్‌కు చాలా కండీషన్లు పెట్టేవాడిని. నాకు రోజూ కథలు చెప్పమనేవాడిని. వారం రోజుల్లో ఒకరికి కథ చెప్పడానికి వెళ్లాలి. సమయం దగ్గర పడుతున్నా, తను చాలా ప్రశాంతం‌గా ఉండేవాడు. టీవీలో క్రికెట్‌, పాటలు, పాత సినిమాలు చూస్తూ ఉండేవాడు. అలా ఆరు రోజులు గడిపేశాడు. రేపు ఉదయాన్నే వాళ్లకు కథ చెప్పడానికి వెళ్లాలి. నేను వచ్చి ‘కథ ఓకే అయిందా’ అంటే, ‘ఇంకా ఏమీ రెడీ చేయలేదు’ అన్నాడు. వెంటనే టీవీ కట్టేసి, ‘ముందు నాకు కథ చెబుతావా? లేదా?’ అంటే, రాత్రి కూర్చొని నాలుగైదు గంటల్లో కథ చెప్పేసేవాడు. అలా చెప్పుకొంటూ వెళ్తే మొత్తం కథ డెవలప్‌ అయిపోయేది. ఆయన సరస్వతి పుత్రుడు. నా జీవితంలో తనతో నేను చేసిన ట్రావెల్‌ బెస్ట్‌’’ అని చెప్పుకొచ్చారు.

‘‘మనకు చిన్నప్పుడు తల్లిదండ్రులు ఇది మంచి.. ఇది చెడు అని చెబుతారు. ఆ తర్వాత గురువులు ఆ విషయాలను చెబుతూనే విజ్ఞానాన్ని కూడా నేర్పుతారు. మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఇంట్లో ఉన్న అన్నయ్య లేదా పెద్దవాళ్లు డబ్బులు ఇచ్చి బాగా చూసుకుంటారు. నేను హైదరాబాద్‌ వచ్చిన తర్వాత నా విషయంలో ఆ మూడు పాత్రలు పోషించిన వ్యక్తి త్రివిక్రమ్‌ శ్రీనివాస్. అందుకే నేను ఎన్ని వేషాలు వేసినా, ఫైనల్‌గా నాకోసం ఓ మంచి వేషం రాయడానికి తను ఉన్నాడని ధైర్యం’’ అంటూ తమ మధ్య ఉన్న స్నేహ బంధాన్ని గుర్తు చేసుకున్నారు సునీల్‌. ‘పుష్ప’ మంగళం శ్రీనుగా మెప్పించిన సునీల్‌, రజనీకాంత్‌ ‘జైలర్‌’లో నెగెటివ్‌ రోల్‌ పోషిస్తున్నట్లు టాక్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని