sv ranga rao: ఆయన మీద పీకలదాకా కోపం వచ్చింది!

వైవిధ్యమైన పాత్రల్లో... విలక్షణమైన నటనతో సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఎస్వీ రంగారావు (S V Ranga Rao) తొలిసారి కెమెరా ముందు ఎలాంటి అనుభవం పొందారనేది ఎంతో ఆసక్తికరం. తన తొలినాటి సినీ అనుభవం గురించి ఎస్వీఆర్‌ ఓ సందర్భంలో వ్యాసం రాశారు.

Published : 15 Apr 2024 12:56 IST

- ఎస్వీఆర్‌ తొలి సినిమా అనుభవాలు

‘‘విశాలమైన జీవితరంగంలో అడుగుపెట్టే ప్రతివ్యక్తీ ఎన్నో సమస్యలను, ఎన్నో అవాంతరాలు ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. కొంతదూరం పోయాక వెనక్కి తిరిగి చూసుకుంటే తొలినాటి అనుభవాలు ప్రతి మనిషి మరచిపోవడానికి వీలులేకుండా ఉండిపోతాయి. విద్యార్థి జీవితంలో కొత్తగా స్కూల్లో, కళాశాలలో చేరినప్పుడు... కొత్తగా ఆఫీసులో ఉద్యోగ జీవితం ఆరంభించినప్పుడు... పెళ్లయి శోభనం గదిలో భార్యతో సంసార జీవితం ఆరంభించినప్పుడు... కలిగే అనుభవం జీవితాంతం మనలను వెంటాడుతూ గిలిగింతలు పెడుతూనే ఉంటుంది. జీవితంలో ఎప్పటికైనా ఒక మంచి నటునిగా రూపొందాలన్నది నా ఆకాంక్ష. ఆ ఆకాంక్షతోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టాను. నాకు బంధువైన బి.వి.రామానందం ద్వారా నేను తొలిసారిగా సినిమారంగంలోకి అడుగుపెట్టా. నేను నటించిన తొలి చిత్రం ‘వరూధిని’. దాన్ని సేలం మోడరన్‌ థియేటర్స్‌ స్టూడియోలో తీశారు. నేను సెట్‌ మీద అడుగుపెట్టవలసిన రోజు రానే వచ్చింది. నేను ప్రవరాఖ్యుని రూపంలో సెట్టుమీద పాదం మోపాను. సెట్‌లోకి ఇలా వెళ్లానో లేదో అందరి కళ్లూ నామీదే. నాకు చాలా ఇబ్బందనిపించింది. వాళ్లంతా నన్నేదో దిగంబరుని చేసి తమాషా చూస్తున్నట్టు అనిపించింది’’

‘‘నాకే అర్థంకాని ఏదో అనుభూతిలో ఉండిపోయాను. సెట్టుమీద, వాతావరణం ఎంతో నిశ్శబ్దంగా ఉంది. ఎవరో ‘లైట్స్‌’ అంటూ ఒక్కసారి పెద్దగా కేక పెట్టారు. ఉలిక్కిపడ్డాను. ఒక్కసారి లైట్లు వెలిగాయి. అప్పుడు విన్నా రామానందంగారి గొంతు. ఆయన నా వైపు తిరిగి ‘ఆ స్తంభం దగ్గరకు వెళ్లి నిలబడు’ అన్నారు. అంతే.. నాలో ఏదో తెలీని జంకు మొదలైంది. ఎలా వెళ్లి నిలబడ్డానో నాకు తెలియదు...సెట్టుమీద ఏం చేస్తున్నానో కూడా నాకు తెలియదు.. నా వేషధారణ బాగుందో లేదో...? అసలు నా ముఖం బాగుందో లేదో..? ఒకటే సందేహాలు. ఒక్కసారిగా నాలో నిస్సత్తువ అలముకుంది’’

‘‘కాసేపు అయ్యేసరికి ఆ జంకు కాస్తా భయంగా మారిపోయింది. ఇంకేముంది..? గొంతు ఎండిపోవడం ఆరంభించింది. నాలుక పిడచ కట్టుకుపోతున్నది. కళ్లు సరిగ్గా కనిపించడంలేదు. చెవులకు ఏదీ వినపించడంలేదు. శరీరంలో ఎక్కడో ఇంకా పిసరంత చైతన్యం ఉన్నందున దర్శకుని గొంతు మాత్రం వినిపిస్తున్నది. నాతో నటించవలసిన అమ్మాయిని వెళ్లి నా పక్కన నుంచోవలసిందిగా దర్శకుడు చెబుతున్నాడు. ఎక్కడినుంచో ఒక గంధర్వ కన్య వచ్చి నా పక్కన నిలుచున్నది. అదీ అతి చేరువగా.. ఆ గంధర్వ కన్యకు కాసింత దూరం తొలగి నిలబడ్డా, దానితో మా దర్శకుడు ‘అలా పరిగెడతావేమిటయ్యా? ఆవిడ నిన్ను ప్రేమిస్తోంది’ అంటూ కేక పెట్టాడు. అంతా గొల్లుమని నవ్వు. నిజం చెప్పొద్దూ.. ఆయన మీద నాకు పీకల దాకా కోపం వచ్చింది. ఒక స్త్రీ.. అందునా అపరిచితురాలు... ఆవిడ ముందు పెట్టుకుని నన్నట్లా అంటాడేమిటని చాలా బాధనిపించింది. తర్వాత తెలిసింది. అది సినిమా భాష అనీ...దర్శకులు అట్లాగే మాట్లాడుతారనీ’’

‘‘నేను ఈ ఆలోచనల్లో ఉండగానే ఒక మనిషి నా దగ్గరకు వచ్చి ‘ఏదీ? మీ సంభాషణ చెప్పండి’ అంటూ నేను చెప్పవలసిన సంభాషణలు ఎలా పలకాలో ముందు తను చెప్పడం ఆరంభించాడు. నిజానికి అవి ముందురోజు నా చేత వల్లె వేయించినవే. నేను ఉక్రోషంగా ‘అవి నాకు తెలుసులెండి’ అన్నాను. దాంతో ఆయనకు ఎక్కడలేని కోపం వచ్చింది. ‘మరయితే అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడతారేం? డైలాగు చెప్పండి’ అన్నాడు. తర్వాత తెలిసింది అతను సహకార దర్శకుడని. కానీ ఆ క్షణాన వచ్చిన కోపం మాత్రం చెప్పవలసినది కానిది. బయట నేనుగా ఒకరిని పల్లెత్తు మాట అనేవాడిని కాదు. ఎవరైనా నన్ను ఏదన్నా అంటే మాత్రం అంతు కనుక్కునేదాకా ఊరుకుండేవాడిని కాను. అది నా స్వభావం. కానీ నా కోపం నాలోనే దిగమింగుకున్నాను. ఆ సహాయ దర్శకుడు చెప్పినట్లు సంభాషణలు వల్లించడం ఆరంభించాను. కానీ పక్కన ఆ గంధర్వ కన్య ఉండటం చేత తల వంచుకొని చెప్పాను. నిజానికి నాకు డైలాగులు చెప్పడం చేతకాక కాదు. నాటక రంగం మీద విజృంభించిన వాడినే.. కానీ ఇది సినిమా.. ఎంత కాదన్నా కొత్త వాతావరణమాయె.. అదీగాక నాటకాల్లో నా పక్కన అంతా మగాళ్లే స్త్రీ వేషాలు వేసేవారు. కానీ ఇక్కడ పరిస్థితి అలా లేదు. సిసలైన స్త్రీతో మాట్లాడవలసి వచ్చింది. అంతవరకూ పాపం దర్శకుడు చాలా ఓపిక పట్టాడు. ఇక ఆయన ఆగలేకపోయారు. కోపం కట్టలు తెంచుకుంది. ‘ఆవిడ ముఖం చూసి మాట్లాడవోయ్‌? ఎక్కడో పాతాళంలోకి చూసి మాట్లాడాతావేమిటి?’ అంటూ గావుకేక పెట్టాడు. ఎలాగైతేనేం.. ఆరోజుకు షూటింగ్‌ పూర్తయ్యింది. ఈ యమయాతన నా వల్ల కాదనిపించింది. రాత్రికి రాత్రే బండెక్కి మాఊరు వెళ్లిపోదామనుకున్నాను. కానీ, ఎలా తెలిసిందో ఏమో, దర్శకుడికి ఈ విషయం తెలిసిపోయింది. ఆయన వెంటనే నా బసకు వచ్చేశాడు. వచ్చీ రాగానే నన్ను ఓదార్చే కార్యక్రమం ఆరంభించాడు. ఆయన చెప్పిన ఆ ఓదార్పు మాటలతో నాకు కాసింత ఉపశమనం లభించింది. మరునాటి నుంచీ కొంచెం దారిలో పడటం ఆరంభించాను. అయ్యా..అదీ నా తొలినాటి షూటింగ్‌ అనుభవం. ఏ మానవుడైనా.. ఎట్టి పరిస్థితుల్లోనయినా.. తనలో నిద్రాణమై ఉన్న శక్తిని మరిచిపోకూడదని మాత్రం అనుభవ పూర్వకంగా తెలుసుకున్నా.. అప్పటికీ ఇప్పటికీ అదే అభిప్రాయంతో ఉన్నా’’ అని చెప్పుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని