Actor Sivaji: నెలకు రూ.800 జీతంతో జీవితం మొదలు పెట్టి..

ప్రస్తుతం సినీ పరిశ్రమలో తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఎంతో మంది నటీనటులు సున్నా నుంచి మొదలు పెట్టినవారే.

Published : 19 Dec 2023 09:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం సినీ పరిశ్రమలో తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న ఎంతో మంది నటీనటులు సున్నా నుంచి మొదలు పెట్టినవారే. అవకాశాల కోసం చెప్పులరిగేలా తిరిగిన వారే. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, హీరోగా 100కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు శివాజీ (Sivaji). ఎడిటింగ్‌ రూమ్‌లో మొదలైన ఆయన సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. అసలు సినిమా ఇండస్ట్రీలోకి ఎలా అడుగు పెట్టారో ఓ సందర్భంలో పంచుకున్నారు.

‘‘1996 సమయంలో కె.ఎస్‌.రామారావు స్టూడియో పెట్టారు. అప్పుడే జెమిని, ఈటీవీ వస్తున్నాయి. కె.ఎస్‌.రామారావుగారిని కలవాలంటే ఒక చిన్న సమస్య. పని కోసం కలుస్తానంటే ఎవరినీ లోపలికి రానివ్వరు. ‘కథ చెప్పాలి’ అంటే పంపుతారు. ఈ విషయం దర్శకుడు దశరథ్‌ ద్వారా తెలిసింది. అప్పుడు దశరథ్‌ యండమూరి దగ్గర అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఆ విషయం గుర్తు పెట్టుకుని, కె.ఎస్‌.రామారావుగారి ఆఫీస్‌కు వెళ్లా. కథ చెబుతానని చెప్పి, లోపలికి వెళ్లిన నేను నిజం ఒప్పుకొన్నా. ‘సర్‌ నాకు కథ చెప్పడం రాదు. ఎడిటింగ్‌ వచ్చు. నాకు ఉద్యోగం ఇవ్వండి’ అని అడిగా. ‘ఓరి నీ దుంప తెగ.. భలేవాడివయ్యా. సర్లే జీతం ఎంత కావాలి’ అని అడిగారు. ‘అన్నం పెట్టి, బట్టలు కొనుక్కోవడానికి ఏదైనా ఇవ్వండి’ అన్నాను. క్యాషియర్‌కు చెప్పి, రూ.800 ఇచ్చారు. అందులో కొంత డబ్బులు పెట్టి బట్టలు కొన్నా. మరో స్నేహితుడి దగ్గర ఇంకొంత అప్పు తీసుకుని, శ్రీనగర్‌ కాలనీలో రూమ్‌ తీసుకున్నా’’

‘‘రోజూ ఆఫీస్‌కు వెళ్లి, బాగా పనిచేసేవాడిని. గంటకు రూ.100 ఇచ్చేవారు. బేటాలు అదనం. కొన్ని సార్లు దాదాపు 18గంటలు పనిచేసేవాడిని. బాగా వర్క్‌ వచ్చిన తర్వాత కె.ఎస్‌.రామారావుగారి దగ్గరకు వెళ్లి, ‘సర్‌ కొన్ని రోజులు ఫ్రీలాన్సర్‌గా పనిచేయాలనుకుంటున్నా’ అని చెప్పా. సాధారణంగా ఆయనకు కాస్త కోపం ఎక్కువ. కానీ, నా పనితనం చూసి, ‘సర్లే వెళ్లు. ఒకవేళ నీకు అక్కడ ఇబ్బంది అయితే, మళ్లీ వచ్చేయ్‌’ అన్నారు. దీంతో మంజులా నాయుడు దగ్గర ఎడిటింగ్‌ వర్క్‌లో చేరా. నెలకు రూ.5వేలు. బయట వర్క్‌లు చేసుకునేందుకు కూడా అవకాశం ఇచ్చారు. జెమిని టీవీలో పని మొదలయ్యాక నెలకు రూ.15వేలు సంపాదించా. అప్పులన్నీ తీర్చేశా. సొంత కారు కొని, ఇంటికి వెళ్లా. అమ్మకు బంగారు గొలుసు చేయించా’’ అని శివాజీ చెప్పుకొచ్చారు. ఆ తర్వాత చిరంజీవి నటించిన ‘మాస్టర్‌’తో వెండితెరకు పరిచయం అయిన శివాజీ వరుస అవకాశాలు దక్కించుకుని, సోలో హీరోగానూ రాణించారు. ‘బిగ్‌బాస్‌-సీజన్‌7’ (Bigg Boss Telugu 7) లో మూడో స్థానంలో నిలిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని