Venky: 20 ఏళ్ల ‘వెంకీ’.. ఈ హిట్‌ మూవీ మిస్సైన హీరోయిన్‌ ఎవరంటే?

రవితేజ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘వెంకీ’ చిత్రం 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా ఆ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు..

Published : 26 Mar 2024 09:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏళ్లు గడిచినా కొన్ని సినిమాలు ఫ్రెష్‌గానే ఉంటాయి. అందులోని పలు సన్నివేశాలను తలచుకోవడమే ఆలస్యం ప్రేక్షకుల ముఖాల్లో నవ్వులు పూస్తాయి. ఈ కోవకు చెందిందే ‘వెంకీ’ (Venky) చిత్రం. ఇందులోని ట్రైన్‌ సీక్వెన్స్‌ కామెడీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్‌ మీడియాలో.. ఆ ఎపిసోడ్‌కు సంబంధించిన ‘మీమ్స్‌’ హంగామా అంతా ఇంతా కాదు. ఈ సినిమా విడుదలై 20 సంవత్సరాలు (20 Years for Venky) పూర్తైన సందర్భంగా దర్శకుడు శ్రీను వైట్ల (Srinu Vaitla) ఓ ఇంటర్వ్యూలో పాల్గొని, పలు ఆసక్తికర విశేషాలు తెలియజేశారు.

నాగార్జున సాగర్‌కు వెళ్లి అక్కడే స్క్రిప్టు పూర్తి చేసే అలవాటు తనకు ఈ చిత్రంతోనే మొదలైందని తెలిపారు. హీరోయిన్‌గా ముందుగా అసిన్‌ (Asin)ను అనుకున్నా కుదర్లేదని చెప్పారు. ట్రైన్‌ సీన్స్‌లో ప్రముఖ కమెడియన్‌ ఎం.ఎస్‌.నారాయణను తీసుకుందామని ప్రయత్నించినా సాధ్యపడలేదన్నారు. ‘‘ఈ చిత్రం విడుదలకు ముందు ‘ట్రైన్‌ సీక్వెన్స్‌’ వర్కౌట్‌ కాదేమోనని కొందరు సందేహించారు. కానీ, మా టీమ్‌ ఊహించిన దానికన్నా ఎక్కువ స్పందన లభించింది. ‘వెంకీ’ బాగుందని చిరంజీవి సర్‌ చెప్పడమే ఈ సినిమా విషయంలో నాకు వచ్చిన బెస్ట్‌ కాంప్లిమెంట్‌’’ అని నాటి సంగతులు గుర్తు చేసుకున్నారు. ‘వెంకీ 2’ తెరకెక్కించే ఆలోచన ఉందన్నారు.

దర్శకుడిగా శ్రీను వైట్లకు ఇది ఐదో చిత్రం కాగా ఆయన, హీరో రవితేజ (Ravi Teja) కాంబినేషన్‌లో రెండో సినిమా. 2004 మార్చి 26న విడుదలైంది. రవితేజ పోషించిన వెంకీ పాత్ర, హీరోయిన్‌ స్నేహ (Sneha) నటించిన శ్రావణి పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్నాయి. హీరో ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌ శ్రీనివాసరెడ్డి, చిత్రం శ్రీను, రామచంద్ర, గజాలాగా బ్రహ్మానందం, బొక్కా సుబ్బారావుగా ఏవీఎస్‌.. ఇలా ప్రతిఒక్కరూ తమ కామెడీతో గిలిగింతలు పెట్టించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరపరిచిన ‘గోంగూర తోటకాడ’, ‘మాస్‌తో పెట్టుకుంటే’, ‘అందాల చుక్కల లేడీ’.. ప్రతీ పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. ఈ హిట్‌ ఫిల్మ్‌ గతేడాది డిసెంబరులో రీరిలీజై, మరోసారి నవ్వుల వర్షం కురిపించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని