Varun tej: నాలుగు రూపాల్లో వరుణ్‌

Eenadu icon
By Cinema Desk Updated : 27 Nov 2023 09:21 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

త్వరలోనే ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ సినిమాతో సందడి చేయనున్నారు కథానాయకుడు వరుణ్‌తేజ్‌. ఆ సినిమా విడుదలలోపే మరో కొత్త చిత్రం ‘మట్కా’ కోసం రంగంలోకి దిగనున్నారు. ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తూనే, మరోవైపు వివిధ దశల్లో ఉన్న తన కొత్త చిత్రాల పనుల్ని చక్కబెట్టడంలో బిజీ అయ్యారు. కరుణకుమార్‌ దర్శకత్వంలో... వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా ‘మట్కా’ ప్రారంభమైన సంగతి తెలిసిందే. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై మోహన్‌ చెరుకూరి (సీవీఎం), డా.విజేందర్‌రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నోరా ఫతేహి, మీనాక్షి చౌదరి కథానాయికలు. ఈ సినిమా చిత్రీకరణ డిసెంబరు నెలలోనే ఆరంభం కానున్నట్టు సినీవర్గాలు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపాయి. విశాఖపట్నం నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం 1960ల నాటి విశాఖ నగరాన్ని తలపించేలా భారీ సెట్స్‌ని హైదరాబాద్‌లో నిర్మిస్తున్నారు. ‘‘యావత్‌ దేశాన్ని కదిలించిన యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రమిది. 1958-82 మధ్య జరిగే కథ. అద్భుతమైన యాక్షన్‌ సన్నివేశాలు ఉంటాయి. వాటిని నలుగురు యాక్షన్‌ కొరియోగ్రాఫర్లు పర్యవేక్షిస్తారు. 24 ఏళ్ల వ్యవధి ఉన్న ఈ కథలో వరుణ్‌తేజ్‌ నాలుగు భిన్నమైన గెటప్పుల్లో కనిపించనున్నారు. అందుకోసం ప్రత్యేకంగా సన్నద్ధమవుతున్నారు. ఆయన కెరీర్‌లోనే అత్యధిక వ్యయంతో రూపొందుతున్న చిత్రమిది. తెలుగుతోపాటు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తామ’’ని సినీవర్గాలు తెలిపాయి. నవీన్‌చంద్ర, కన్నడ కిశోర్‌, అజయ్‌ ఘోష్‌, మైమ్‌ గోపి, రూపాలక్ష్మి, విజయరామరాజు, జగదీశ్‌, రాజ్‌ తిరందాస్‌ తదతరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్‌, కూర్పు: కార్తీక శ్రీనివాస్‌.ఆర్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌: ఆశిష్‌ తేజ, కళ: సురేశ్‌.

Tags :
Published : 27 Nov 2023 00:21 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని