Varuntej : ఈ సినిమా కోసం నా పెళ్లి ముహూర్తాన్ని మార్చుకున్నా!

వైవిధ్యమైన కథలతో ప్రయాణం చేస్తుంటారు  వరుణ్‌తేజ్‌. ‘కంచె’, ‘అంతరిక్షం’ తదితర చిత్రాలే అందుకు ఉదాహరణ.

Updated : 28 Feb 2024 09:37 IST

వైవిధ్యమైన కథలతో ప్రయాణం చేస్తుంటారు  వరుణ్‌తేజ్‌. ‘కంచె’, ‘అంతరిక్షం’ తదితర చిత్రాలే అందుకు ఉదాహరణ. ఈ సారి వైమానిక దళం నేపథ్యంలో సాగే కథతో ‘ఆపరేషన్‌     వాలెంటైన్‌’ చేశారు. శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడా    దర్శకత్వంలో తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం రూపొందింది. మార్చి 1న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా వరుణ్‌తేజ్‌ మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

హిందీలో పరిచయం కావడానికి సరైన సినిమా ఇదే అనుకున్నారా 

ఇతర భాషల్లో సినిమాలు చేయాలనే ఆశ ఓ నటుడిగా నాకు ఉండొచ్చు కానీ, అందుకు తగ్గట్టుగా మార్కెటింగ్‌ చేసే నిర్మాణ సంస్థ కూడా అవసరం. ద్విభాషా చిత్రం అని చెప్పి ఏదో డబ్‌ చేసి విడుదల చేయడం కాకుండా, తగిన నిర్మాణ వ్యయం, ప్రణాళికతో సినిమా చేయాలి. ఆ విషయంలో నాకు సోనీ సంస్థ కలిసొచ్చింది. వాళ్లకి మంచి పంపిణీ నెట్వర్క్‌ కూడా ఉంది. దర్శకుడు కూడా హిందీ కుర్రాడే. పైగా ఎక్కువ భాషల్లో, ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ కావాల్సిన కథ కూడా ఇదే అనిపించింది. అలా అన్నీ కుదరడంతోనే ఇది తెలుగు, హిందీ భాషల్లో చేశాం. ఈ సినిమా కోసం రెండు నెలలు ప్రత్యేకంగా హిందీ భాష కోసం శిక్షణ తీసుకున్నా. సొంతంగా డబ్బింగ్‌ కూడా చెప్పా. యాస అంత బాగా కుదరలేదని, ప్రత్యామ్నాయంగా మరొకరితోనూ డబ్బింగ్‌  చెప్పించారు. మరి ఏమవుతుందో చూడాలి (నవ్వుతూ). ప్రతి సన్నివేశాన్ని రెండు భాషల్లో తెరకెక్కిస్తూ పరుగులు పెట్టాం.

ఫైటర్‌ పైలట్‌ పాత్ర కోసం మీరెలా సన్నద్ధమయ్యారు

చాలా మంది ఎయిర్‌ఫోర్స్‌ అధికారుల్ని కలిశా. నిజమైన ఎయిర్‌ బేస్‌కి వెళ్లి చిత్రీకరణ చేశాం. మధ్యలో ఖాళీ దొరికిందంటే అక్కడ ఉండే అధికారులతో కలిసి మాట్లాడేవాణ్ని. తెలుగువాళ్లు చాలా మంది ఉన్నారు. నేను అక్కడ వాళ్లందరినీ కలిసినప్పుడు ఆశ్చర్యపోయా. వాళ్లు చెప్పే కథలు, వాళ్ల ఆపరేషన్ల గురించి వింటూ స్ఫూర్తి పొందేవాణ్ని. వాళ్లు చెప్పిన కథలు చిత్రీకరణలో మాకెంతో మేలు చేశాయి. ఫైటర్‌ జెట్‌లో కూర్చున్నప్పుడు  ఎలా ఉండాలి, ఎలా తిరగాలి అనే విషయాలు మనకు తెలియదు కదా. ‘టాప్‌గన్‌’ తరహా సినిమాలు చూసినప్పుడు కొన్ని విషయాలు అర్థం అవుతాయి తప్ప, ప్రాక్టికల్‌గా మాత్రం చిత్రీకరణ సమయంలోనే తెలుసుకున్నా. పైలట్‌ని మొదట ఓ స్టిములేటర్‌లో కూర్చోబెట్టి అవగాహన కల్పిస్తారట. అందులో కూర్చుంటే నిజంగానే ఫ్లైట్‌ నడుపుతున్నట్టే ఉంటుంది. అందులో నన్నూ కూర్చోబెట్టారు అధికారులు. నా పాత్ర కోసం నేను సన్నద్ధం కావడం ఒకెత్తైతే, ఈ సినిమా చిత్రీకరణ సాగిన విధానం మరో ఎత్తు. ఎయిర్‌బేస్‌లో నియమాలు చాలా కఠినంగా వుంటాయి. ఫోన్లు, ఫోటోగ్రఫీకి అనుమతి లేదు. వాళ్లు చెప్పినట్టుగానే ఉదయం 8లోపు ప్రతి నటుడూ వెళ్లాలి. మళ్లీ సాయంత్రం అందరూ ఒకేసారి తిరిగి రావాలి. విమానాల్లో మనం లోపల కూర్చుంటే అంతగా శబ్ధం రాదు కానీ, బయట చాలా ఎక్కువ. మామూలు విమానాలతో పోలిస్తే ఫైటర్‌ జెట్‌ల శబ్ధం 20 శాతం ఎక్కువ వుంటుంది. ప్రతిరోజూ 40 లాండింగ్స్‌ జరిగేవి. జెట్‌ 2 కిలోమీటర్ల దూరంలో వస్తున్నా సరే, సెట్‌లో ఒకరిమాటలు మరొకరికి వినిపించవు. అలా 40 రోజులపాటు చిత్రీకరణ చేశాం. ఒక దశలో మేమూ భారతీయ వైమానిక దళంలో ఓ భాగం అన్నట్టుగా ఉండేది. ఫోన్లు లేకుండా చిత్రీకరణలో పాల్గొనడం కూడా చాలా బాగుండేది. పనిపైనే ధ్యాస పెడుతూ చిత్రీకరణని చాలా ఆస్వాదించాం. ఈ సినిమా కోసం నా పెళ్లి ముహూర్తాన్నీ మార్చుకుని, పూర్తయ్యాకే పెళ్లి చేసుకున్నా.

హిందీలో విడుదలైన హృతిక్‌ రోషన్‌ ‘ఫైటర్‌’ కథ కూడా మీ సినిమాకి దగ్గరగా ఉంటుంది. మీకు ఆ సినిమా గురించి ఎప్పుడు తెలిసింది

పుల్వామా దాడులు, బాలాకోట్‌ ఎయిర్‌ స్ట్రైక్‌ నేపథ్యంలో దాదాపు 14 కథలు వచ్చాయి.  మేం వైమానిక దళం అధికారులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్లూ చెప్పారు. కానీ మేం మా కథని నమ్మాం. ఒక సంఘటనని ఒకొక్కరూ ఒక్కోలా వివరిస్తుంటారు. బాలాకోట్‌ దాడులకి సంబందించి మాదైన వివరణ ఈ సినిమాలో ఉంటుంది.  దేశభక్తి అనేది ఓ గొప్ప భావోద్వేగం. అది అందరికీ అర్థమయ్యేది. బాగా తీస్తే ప్రతి భారతీయుడూ కనెక్ట్‌ అయ్యే అంశం కావడంతో మేం నమ్మకంగా ముందుకెళ్లాం. నిజానికి ఈ సినిమాలో వైమానిక దళం మాట్లాడే సాంకేతిక పరమైన మాటలకి అర్థం ఏమిటో నాకూ తెలియదు. కానీ దాని వెనకాల ఓ భావోద్వేగం మాత్రం బలంగా ఉంటుంది. అది కనెక్ట్‌ అయ్యేలా మేం చిత్రాన్ని చేశాం. నేను స్క్వాడ్రన్‌ లీడర్‌గా కనిపిస్తే, కథానాయిక మానుషి చిల్లర్‌ రాడార్‌ అధికారిగా కనిపిస్తారు. మా ఇద్దరి మధ్య ప్రేమ ఎంత ఉంటుందో, మాకు దేశంపై అంత ప్రేమ వుంటుంది. ఆ నేపథ్యంలో ప్రతీ సన్నివేశం మనసులకి హత్తుకుంటుంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌ ప్రధానంగా సాగే ‘అంతరిక్షం’ చేసిన అనుభవం ఈ సినిమాకి బాగా కలిసొచ్చింది.

ఈ సినిమా గురించి మీ బాబాయ్‌ పవన్‌కల్యాణ్‌కి చెప్పారా? ఆయన స్పందన ఏమిటి

టీజర్‌ విడుదలైనప్పుడు బాబాయ్‌ని కలిశా. మామూలు సినిమాలకి ఆయన పెద్దగా స్పందించరు. కానీ ఈ టీజర్‌ని ఐదారుసార్లు చూశారట. ‘చాలా బాగుంది. బాగా ఫిట్‌ అయ్యావ్‌. ఈ సినిమాని చూడాలని ఉంది’ అన్నారు. బాబాయ్‌ చాలా అరుదుగా చెబుతుంటారు ఇలా. ఆ మాటలు నాకైతే చాలా ప్రోత్సాహకరంగా అనిపించాయి. ఇలాంటి సినిమాలంటే బాబాయ్‌కి చాలా ఇష్టం. మా పెదనాన్న, మా నాన్నలకీ మన సైన్యం గురించి అవగాహన ఎక్కువ. అందుకే వాళ్లని ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ వేడుకకి పట్టుబట్టి తీసుకొచ్చా. మన సైనికులకు నివాళిలా చేస్తున్న చిత్రమిది.

వైవిధ్యమైన కథలతో ప్రయాణం చేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలు ఆర్థికంగా మీపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుంటాయి

ప్రతి సినిమానీ డబ్బుల కోసం చేయకూడదు. ‘అంతరిక్షం’కు ముందు నేను వంద శాతం పారితోషికం తీసుకుంటే, ఆ సినిమా కోసం యాభై శాతమే తీసుకున్నా. మిగతా డబ్బుని సినిమాకోసం ఖర్చు చేయమని చెప్పా. నన్ను దర్శకుడు అడగలేదు, నిర్మాత అడగలేదు. కొన్ని సినిమాలు అలా ప్రభావితం చేస్తుంటాయి. వాణిజ్యకోణంలో నిజంగా నా సినిమాలకి గట్టిగా దెబ్బ తగిలిందనుకోండి, పారితోషికం తగ్గించుకుంటాను. అవసరమైతే డబ్బు తీసుకోకుండా కూడా చేస్తా. ఆ సందర్బం రాదు (నవ్వుతూ) కానీ, వచ్చినా తట్టుకునే శక్తి నాకు ఉందని చెబుతున్నా. నటుడిగా నాపై నాకు ఉన్న నమ్మకం అది.

వరుసగా సీరియస్‌ సినిమాలు చేస్తున్నారు కదా, తదుపరి ప్రేమకథలో నటిస్తారా  

సినిమాల్ని అలా లెక్కలేసుకుని చేయలేం. ‘ఫిదా’కి ముందు అస్సలు ప్రేమకథ చేయకూడదుకున్నా. కానీ దర్శకుడు శేఖర్‌ కమ్ముల కథ చెప్పడం, ఇలాంటిది అస్సలు మిస్‌ చేసుకోకూడదని నాకు అనిపించడం, చేయడం చకచకా జరిగిపోయాయి. సినిమాల గురించి కొద్దివరకే ప్లాన్‌ చేస్తాం తప్ప, అన్నీ అనుకున్నట్టు జరగవు. పక్కా ఓ పోలీస్‌ కథ చేయాలని వుంది. కథలు వింటున్నా. ప్రస్తుతం చేస్తున్న ‘మట్కా’ ఓ రివెంజ్‌ కథ. నటనకి ప్రాధాన్యమున్న, వ్యతిరేక ఛాయలతో కూడిన పాత్రలో కనిపిస్తా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని