Daddy Movie: చిరంజీవి ‘డాడీ’ మూవీ వెంకటేశ్‌ చేస్తే సూపర్‌ హిట్‌ అయ్యేదట!

Daddy movie: ‘డాడీ’ మూవీ యావరేజ్‌గా ఆడటంపై చిరంజీవి ఓ సందర్భంలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.

Updated : 13 Mar 2024 09:34 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ప్రతీ గింజ మీద తినేవాడి పేరు రాసి ఉంటుంది’ అంటారు. అలాగే ప్రతీ సినిమా కథపైనా ఒక నటుడి పేరు రాసి ఉంటుంది. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతకాలం వేచి చూసినా చివరకు అది చేరాల్సిన వారికే చేరుతుంది. ఆ సినిమా విడుదలైన తర్వాత ఫలానా హీరో చేసి ఉంటే బాగుండేదని కొన్నిసార్లు ప్రేక్షకులు అభిప్రాయపడతారు. అగ్ర కథానాయకుడు వెంకటేశ్‌ (Venkatesh) కూడా ఇలాగే అనుకున్నారట. సురేశ్‌ కృష్ణ దర్శకత్వంలో చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా నటించిన మూవీ ‘డాడీ’ (Daddy Movie). 2001లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద యావరేజ్‌ ఫిల్మ్‌గా నిలిచింది. మాస్‌లో విపరీతమైన క్రేజ్‌ ఉన్న చిరంజీవి ఒక్కసారిగా ఫ్యామిలీ డ్రామాలో కనిపించడంతో ప్రేక్షకులు సినిమాకు కనెక్ట్‌ కాలేకపోయారు. ఇదే విషయాన్ని ఓ సందర్భంలో చిరంజీవి స్వయంగా ఒప్పుకొన్నారు.

‘‘డాడీ’ మూవీ నాకు మంచి పేరే తెచ్చింది. అయితే, తొలుత ఈ కథ చెప్పినప్పుడు వెంకటేశ్‌లాంటి హీరోకైతే బాగుంటుందని రచయిత భూపతిరాజాకు చెప్పాను. ‘లేదండీ.. మీకైతే వెరైటీగా ఉంటుంది. పైగా చిన్న పాప కూడా ఉండటంతో క్యూట్‌ ఫ్యామిలీస్టోరీ అవుతుంది’ అని ఆయన చెప్పారు. నా సన్నిహితులు కూడా ‘బాగుంటుంది చేయండి’ అన్నారు. దీంతో అయిష్టంగానే ఒప్పుకొన్నా. సినిమా ఫలితం ఏంటో అందరూ చూశారు. అప్పుడు నాకు వెంకటేశ్‌ ఫోన్‌ చేశారు. మాటల సందర్భంలో ‘డాడీ బాగా చేశాను కదా’ అంటే, ‘లేదండీ.. మీపైన కాబట్టి యావరేజ్‌గా ఆడింది. అదే ఆ సినిమా నేను చేసి ఉంటే సూపర్‌హిట్‌ అయ్యేది’ అన్నారు. వెంకటేశ్‌ మాటల్లో నిజాయతీ, నిష్పక్షపాతం నాకు నచ్చింది’’ అని చిరు అన్నారు. వెంకటేశ్‌ అలా అనడానికి కారణం కూడా ఉంది. అప్పట్లో ఫ్యామిలీ హీరోగా ఆయనకు విపరీతమైన క్రేజ్‌ ఉంది. 90వ దశకం చివరిలో వెంకీ నటించిన ‘సూర్య వంశం’, ‘రాజా’, ‘కలిసుందాం రా’ తదితర చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు ఆయనకు అభిమానులుగా మారిపోయారు. ఆ ఉద్దేశంతోనే ‘డాడీ’ తాను చేస్తే హిట్‌ అయ్యేదని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని