Vishal: అల్లు అర్జున్‌ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్‌

‘రత్నం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నటుడు విశాల్‌ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.

Published : 18 Apr 2024 00:02 IST

హైదరాబాద్‌: నటుడు విశాల్‌ (Vishal) తన కొత్త చిత్రం ‘రత్నం’ (Rathnam) ప్రచారంలో బిజీగా ఉన్నారు. తెలుగు యూట్యూబ్‌ ఛానెళ్లకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజా సినిమా కబుర్లతోపాటు గతంలో తాను వదులుకున్న పలు అవకాశాలను గుర్తు చేసుకున్నారు. అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా తెరకెక్కిన ‘వరుడు’లో నటించే అవకాశం వచ్చిందని, మనసు అంగీకరించకపోవడంతో దాన్ని వదులుకున్నానని తెలిపారు. విజయ్‌ హీరోగా దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ రూపొందించిన ‘లియో’లోనూ ఓ కీలక పాత్రలో నటించే ఛాన్స్‌ వచ్చిందని, డేట్స్‌ సర్దుబాటుకాక పోవడంతో దాన్ని తిరస్కరించినట్లు చెప్పారు. విశాల్‌ ‘నో’ చెప్పిన ఆ క్యారెక్టర్లలో ఆర్య (వరుడు), అర్జున్‌ (లియో) నటించారు.

ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్‌ జెయింట్‌ సంస్థతో నెలకొన్న వివాదంపై మరో ఇంటర్వ్యూలో విశాల్‌ స్పందించారు. ఆ సంస్థకు చెందిన ఒక వ్యక్తితో పెద్ద గొడవ జరిగిందన్నారు. ‘‘నేను నటించిన ‘ఎనిమి’ (2021) రిలీజ్‌ సమయంలో ఓ సంఘటన చోటుచేసుకుంది. అది ఉదయనిధి స్టాలిన్‌ దృష్టికి వెళ్లిందో లేదో నాకు తెలియదు. రెడ్‌ జెయింట్‌లో ఉన్న ఒక వ్యక్తితో పెద్ద గొడవ జరిగింది. ఒకరు కష్టపడి తెరకెక్కించిన చిత్రాన్ని వాయిదా వేసుకోమని అడిగే హక్కు మరొకరికి లేదు. ఎందుకంటే, సినిమా ఏ ఒక్కరి సొత్తు కాదు. ‘తమిళ సినిమా నా చేతుల్లోనే ఉంది’ అని చెప్పిన చాలామంది కనుమరుగయ్యారు. నా నిర్మాత కోసం నేను ముందు నిలబడ్డా. ‘ఒక చిత్రాన్ని తీర్చిదిద్దడానికి రక్తాన్ని ధారపోస్తుంటే.. ఏసీ రూమ్‌లో కూర్చొనే మీరు దాన్ని వాయిదా వేయమని కోరడం న్యాయం కాదు. అసలు అలా అడిగే హక్కు మీకు ఎవరు ఇచ్చారు? ఇండస్ట్రీని ఏమైనా లీజుకు తీసుకున్నారా?’ అని ప్రశ్నించా’’ అని పేర్కొన్నారు.

యాక్షన్‌ నేపథ్యంలో దర్శకుడు హరి తెరకెక్కించిన చిత్రమే ‘రత్నం’. ఇందులో విశాల్‌ పవర్‌ఫుల్‌ రోల్‌ ప్లే చేశారు. ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్‌. ఈ సినిమా తమిళం, తెలుగులో ఈ నెల 26న విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని