NTR: ఎన్టీఆర్‌ హనుమంతుడిగా ఎందుకు చేయలేదంటే!

తెలుగు ప్రేక్షకులకు రాముడు, కృష్ణుడు అంటే గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు నందమూరి తారక రామారావు. పౌరాణిక పాత్రలు ఆయనకు కొట్టిన పిండి. డైలాగులు, హావభావాలు పలికించడంలో ఆయనకు తిరుగులేదు.

Updated : 28 May 2024 13:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు ప్రేక్షకులకు రాముడు, కృష్ణుడు అంటే గుర్తొచ్చే ఒకే ఒక్క పేరు నందమూరి తారక రామారావు. పౌరాణిక పాత్రలు ఆయనకు కొట్టిన పిండి. డైలాగులు, హావభావాలు పలికించడంలో ఆయనకు తిరుగులేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే పౌరాణిక పాత్రలకు, చిత్రాలకు ఆయన నిఘంటువు. రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, భీముడు, రావణుడిగా ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయారు. కృష్ణుడిగా దాదాపు అత్యధిక సార్లు తెరపై కనిపించి రికార్డు సృష్టించారు. మరి అంత పేరు ప్రఖ్యాతులను సంపాదించిన ఆయన తన సినీ ప్రస్థానంలో నారదుడు, హనుమంతుడి పాత్రలను మాత్రం వేయలేదు. ఇదే విషయాన్ని ఓసారి ఆయన వద్ద ప్రస్తావిస్తే..

‘‘అప్పట్లో షూటింగ్స్‌ జరుగుతున్నప్పుడు తరుచూ కరెంటు పోయేది. మళ్లీ ఎప్పుడొస్తుందో తెలియదు. కరెంటు వచ్చేదాకా, అందరూ ఫ్లోర్‌ బయటకి వచ్చి కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకునేవాళ్లు. అలా ఓ చిత్ర షూటింగ్‌ సమయంలో కరెంటు పోతే ఫ్లోర్‌ బయట కూర్చుని ఎన్టీఆర్‌ పౌరాణిక పాత్రల గురించి మాట్లాడుతున్నారు. అందరూ ఆసక్తిగా వింటున్నారు. అక్కడే ఉన్న రావి కొండలరావు మధ్యలో కలగజేసుకుని ‘నారదుడు, హనుమంతుడు వంటివి ముఖ్య పాత్రలే కదా! అన్నగారూ... ఆ పాత్రల్లో మిమ్మల్ని చూసే అవకాశం ఉందా?’ అని అడిగారట.

అప్పుడు ఎన్టీఆర్‌ బదులిస్తూ.. ‘నారదుడిగా ఆలోచించాను బ్రదర్‌. హాస్యం వచ్చేలా కాకుండా భక్తుడిగా, సర్వజ్ఞుడిగా గంభీరంగా ప్రదర్శించవచ్చు. కానీ, నా రూపం అందుకు సహకరించదేమోనని సాహసించలేదు. నారదుడు అంటే ఇలాగే ఉండాలి అని మనం ఒక విధమైన రూపానికి అలవాటు పడ్డాం. నా శరీరం కాస్త భారీ అవుతుందని ఆ ఆలోచన రానివ్వలేదు. రంగారావుగారిని నారదుడి పాత్రలో ఊహించుకోగలమా? పర్సనాలిటీలు ఒప్పుకోవు. ఇక హనుమంతుడంటారా? నా ముఖం కానప్పుడు నాకెందుకా పాత్ర? మాస్క్‌తో నటించాలి. ఫిజికల్‌ మూవ్‌మెంట్స్‌‌ ఎక్కువ కావాలి’ అని విశ్లేషించారట ఎన్టీఆర్‌. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలతో వెండితెరపై అదరగొట్టిన ఎన్టీఆర్‌ తెలుగువారి గుండెల్లో అభిమాన నటుడిగా చిరస్థాయిగా నిలిచిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని