Arvind Kejriwal: భాజపాకు అతిపెద్ద ముప్పు మానుంచే : కేజ్రీవాల్‌

విశ్వాస పరీక్షలో భాగంగా అసెంబ్లీలో ప్రసంగించిన దిల్లీ సీఎం కేజ్రీవాల్‌(Arvind Kejriwal) భాజపాపై విరుచుకుపడ్డారు. 

Updated : 17 Feb 2024 15:26 IST

దిల్లీ: భాజపా(BJP)కు అతిపెద్ద ముప్పు ఆప్‌ పార్టీతోనే అని, అందుకే తమపై అన్నివైపుల నుంచి దాడి జరుగుతోందని ఆ పార్టీ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) అన్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఈ తీర్మానానికి ఆమోదం లభించింది.

‘మనకు సభలో మెజార్టీ ఉంది. కానీ ఆప్‌ ఎమ్మెల్యేలను భాజపా కొనుగోలు చేయాలని యత్నిస్తోన్న తరుణంలో ఈ విశ్వాస తీర్మానం అవసరం. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో భాజపా గెలిచినా.. 2029 నాటికి ఈ దేశానికి ఆ పార్టీ నుంచి ఆప్(AAP) విముక్తి కలిగిస్తుంది’ అని కేజ్రీవాల్ ధీమా వ్యక్తంచేశారు.  ‘ఎమ్మెల్యేల కొనుగోలుకు మీరు ఎంత డబ్బు వెచ్చించారు..? అని ఈసందర్భంగా భాజపాను ప్రశ్నించారు. ‘వారు నాపై సిరా చల్లారు. చెప్పులు విసిరారు. ఇప్పుడు అరెస్టు చేస్తామంటున్నారు. మీరు నన్ను జైల్లో పెడితే.. ఈ ప్రభుత్వం పడిపోతుందా..? అది కూడా ట్రై చేసి, మీ కల నెరవేర్చుకోండి. మీరు కేజ్రీవాల్‌(Kejriwal)ను అరెస్టు చేయగలరు.. కానీ ఆయన సిద్ధాంతాలను కాదు. ఒక కేజ్రీవాల్‌ను మట్టుపెడితే.. లక్షల్లో పుట్టుకొస్తారు’ అని వ్యాఖ్యలు చేశారు.

భాజపాలోకి విపక్ష నేతలు.. ఖర్గే ప్రశ్నకు మోదీ సమాధానమిదే..!

‘ఎవరైనా భాజపా ఒత్తిడికి లోనై.. ఆ పార్టీలో చేరితే వారు అవినీతిపరులు. ఆ ఒత్తిడి ఎదుర్కొన్నవారు నిజాయతీపరులు. గుజరాత్‌లో 30 ఏళ్లుగా భాజపా అధికారంలో ఉంది. మధ్యప్రదేశ్‌లో 15 ఏళ్లు, యూపీలో 10 ఏళ్లుగా కమలం పార్టీ ప్రభుత్వం నడుస్తోంది. ఈ రాష్ట్రాల్లో 24 గంటల విద్యుత్ అందించండి. పంజాబ్‌లో ఆప్‌ ప్రభుత్వం ఇవన్నీ చేసింది. ప్రభుత్వ పాఠశాలలను సంస్కరించాం. మేం రాముడి భక్తులమని భాజపా చెప్తోంది. కానీ మన ఆసుపత్రుల్లో పేదలకు మందులు నిలిపివేశారు. అయినా మీ శత్రుత్వం నాతో. దిల్లీ ప్రజల్ని ఎందుకు లాగుతారు..? నా హృదయం ద్రవించిపోతోంది’ అంటూ ఉద్వేగంగా మాట్లాడారు.

మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఆరోసారి ఈడీ సమన్లు జారీ చేసిన నేపథ్యంలో ఆయన ఈ తీర్మానం ప్రవేశపెట్టడం గమనార్హం. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) చేసిన ఫిర్యాదుపై ఇటీవల న్యాయస్థానం సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఉన్నందున నేటి విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కేజ్రీవాల్‌(Arvind Kejriwal) కోరారు. తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతానని అభ్యర్థించారు. ఇందుకు అంగీకరించిన న్యాయస్థానం.. తదుపరి విచారణను మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని