Telangana News: తెరాస వడ్ల రాజకీయం వెనుక పెద్ద కుట్ర: బండి సంజయ్‌

తెరాస వడ్ల రాజకీయం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. బ్రోకర్ల మాఫియాతో సీఎం కేసీఆర్ కుమ్కక్కై భారీ ఎత్తున కమీషన్లు దండుకునేందుకు వ్యూహం పన్నారని మండిపడ్డారు.

Published : 09 Apr 2022 15:55 IST

హైదరాబాద్: తెరాస వడ్ల రాజకీయం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. బ్రోకర్ల మాఫియాతో సీఎం కేసీఆర్ కుమ్కక్కై భారీ ఎత్తున కమీషన్లు దండుకునేందుకు వ్యూహం పన్నారని మండిపడ్డారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర రైతులకు బండి సంజయ్‌ బహిరంగ లేఖ రాశారు. రైతులు అనివార్యంగా తక్కువ ధరకే ధాన్యం విక్రయించేలా పథకం పన్ని.. రైతుల నుంచి వచ్చే ఆగ్రహాన్ని కేంద్రంపై మళ్లించే ఎత్తుగడ వేశారన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల మూసివేత అందులో భాగమేనని.. సీఎం కేసీఆర్ చేస్తున్న కుట్రతో రైతన్నలు పెద్ద ఎత్తున నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ చేస్తున్న కుట్రలను ఛేదించిందేకు అన్నదాతలు కలిసిరావాలని పిలుపునిచ్చారు.

రైతు పండించే ప్రతి గింజను కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని.. వడ్ల కొనుగోలు కోసం కేంద్రం గత ఏడేళ్లలో తెలంగాణకు రూ. 97 వేల కోట్లను చెల్లించిందన్నారు. ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్ర ప్రభుత్వం పైసా కూడా ఇప్పటివరకు ఖర్చు చేయలేదన్నారు. వడ్లను సేకరించి కేంద్రానికి అప్పగించకుండా తెరాస సర్కారు నాటకాలాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగి ధాన్యం సేకరణ వివరాలు కూడా కేంద్రానికి సీఎం ఇవ్వలేదని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాలను ఎందుకు మూసేశారో కేసీఆర్‌ సమాధానం చెప్పాలని బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు