Bihar: ఎమ్మెల్యేలు మిస్సింగ్‌.. తేజస్వి ఇంటివద్ద పోలీసులు: బిహార్‌లో బలపరీక్ష వేళ కీలక పరిణామాలు

Bihar Floor Test: బిహార్‌(Bihar)లో నేడు బలపరీక్ష జరగనుంది. దాంతో ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి జేడీయూ, భాజపా, ఆర్జేడీ విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి.

Updated : 12 Feb 2024 11:19 IST

పట్నా: బిహార్‌(Bihar)లో నీతీశ్‌ కుమార్(Nitish Kumar) ప్రభుత్వం సోమవారం బలపరీక్ష ఎదుర్కోనుంది. భాజపా మద్దతుతో సునాయాసంగానే దీనిని గట్టెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ప్రధాన విపక్షమైన ఆర్జేడీ తన బలాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. (Bihar Floor Test)

సోమవారం నుంచి రాష్ట్రంలో బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. తర్వాత గవర్నర్‌ ప్రసంగించనున్నారు. అనంతరం స్పీకర్‌(ఆర్జేడీ) అవధ్‌ బిహారీ చౌధరీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. బీజేపీ-జేడీయూ నేతలు ఆయన్ను తొలగించాలని డిమాండ్ చేస్తూ దీనిని తీసుకురానున్నారు. ఆ తర్వాత బలపరీక్ష(Floor Test) జరగనుంది. నేటి ఉదయం కల్లా సభ్యులంతా పట్నాలోని హోటల్‌కు రావాలని జేడీయూ విప్‌ జారీ చేసింది.

ఈ క్రమంలో బీజేపీ-జేడీయూ (BJP-JD(U)) శిబిరం నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అదృశ్యం కావడం కలకలం సృష్టించింది. అయితే, వారిలో ఏడుగురు బలపరీక్షకు ముందే శిబిరానికి తిరిగివచ్చారు. మరొకరి జాడ తెలియాల్సి ఉంది. ఇంకోపక్క ఆర్జేడీ తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పట్నాలోని ఆ పార్టీ నేత తేజస్వీ యాదవ్ ఇంటికి తరలించిందని, వారిని అక్కడ హౌస్‌ అరెస్టు చేసినట్లు ప్రచారం జరిగింది. ఆర్జేడీ ఎమ్మెల్యే చేతన్ ఆనంద్‌ను హౌస్ అరెస్టు చేశారని ఆయన సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత ఆయన ఇంటికి చేరుకొన్నారు. ఆయన ఓటింగ్‌కు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

‘మీ తల్లిదండ్రులు నాకు ఓటు వేయకుంటే రెండు రోజులు తినకండి’

ఈ పరిణామాల మధ్య తేజస్వి ఇంటిముందు భారీగా బలగాలను మోహరించడంపై ఆర్జేడీ విమర్శలు గుప్పించింది. ‘నీతీశ్‌ కుమార్‌, పోలీసుల అధికార దుర్వినియోగాన్ని బిహార్‌ ప్రజలు చూస్తున్నారు’ అని మండిపడింది. అలాగే పార్టీ ఎమ్మెల్యేలపై కుట్ర జరుగుతోందన్న సాకుతో పోలీసులు తేజస్వీ యాదవ్‌ ఇంట్లోకి ప్రవేశించాలనుకున్నారని ఆరోపించింది. పోలీసు చర్యలకు వ్యతిరేకంగా ఆయన మద్దతుదారులు అక్కడకు చేరుకుకొని నినాదాలు చేశారు.

ఇటీవలే ఆర్జేడీని వదిలి నీతీశ్‌.. భాజపాతో జట్టుకట్టారు. ఈ కూటమి బలం 128గా తేలింది. 243 మంది సభ్యులున్న అసెంబ్లీలో మెజార్టీ మార్క్‌ 122. బలపరీక్షలో తమ కూటమికి 127 ఓట్లు వస్తాయని భాజపా విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ పరీక్ష వేళ.. అసెంబ్లీ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని